ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Roads: అడుగేస్తే గుంత .. బాగయ్యేది ఎపుడంటా?

By

Published : May 9, 2022, 3:57 PM IST

Roads

Roads: దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ రహదారులపై ప్రయాణిస్తే.. ప్రాణాలు పోవడం ఖాయమన్న భావన అక్కడి ప్రజల్లో నెలకొంది. ఈ పాట్లు పడలేక ప్రయాణాలు కూడా మానుకుంటున్నారు. పది కిలోమీటర్ల మేర దారి.. అత్యంత దారుణంగా తయారైంది. నేటికీ నవీకరణ ఊసే లేకపోవటంతో.. జనం నానా అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల పరిస్థితులపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం..

Roads: ఏదైనా ఆపద వస్తే త్వరగా ఆసుపత్రులకు చేరుకునేందుకు ఉపయోగపడాల్సిన పల్లె రహదారులు... ప్రమాదాలకే నిలయంగా మారాయి. అభివృద్ధి, మరమ్మతులకు నోచుకోక.. గుంతలమయంగా మారాయి. ఏ మాత్రం ఆదమరచినా మరుక్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల పరిస్థితిపై పరిశీలనలో చాలా చేదు వాస్తవాలు వెలుగుచూశాయి.

శ్రీకాకుళం జిల్లాలో దారుణంగా రోడ్ల పరిస్థితి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నక్కపేట పరిధిలోని పంచాయతీరాజ్‌ రహదారి ఇది. ఈ రోడ్డు.. పూర్తిగా ఛిద్రమైపోయి... భారీ గోతులు ఏర్పడ్డాయి. నక్కపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని జి.సిగడాం వెళ్లేదారిలో.. ఇటు నుంచి ఆ చివర వరకు ఎటు చూసినా గోతులే కనిపిస్తాయి. రోడ్డు ఆనవాళ్లే కనిపించడం లేదు. ఏ మాత్రం వేగంగా వాహనాన్ని నడిపినా.. గోతుల్లో పడి ప్రమాదాలకు గురికాక తప్పడం లేదు. విద్య, వ్యాపారం, ఉపాధి పనుల మీద రోజూ ఈ మార్గంలో ప్రయాణించేవారిలో ఎక్కువ మందికి వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. నక్కపేట-పాలఖండ్యాం-జి.సిగడాం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. నక్కపేట గ్రామస్థులు.. జి.సిగడాం వెళ్లాలంటే దగ్గరి దారి పది కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. నక్కపేట నుంచి టంకాల దుగ్గివలస వరకు అత్యంత దారుణంగా ఉండటంతో.. ప్రజలు, రైతులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..

నక్కపేట-జి.సిగడాం మధ్యలో పాలఖండ్యాం వద్ద ఆర్​ అండ్​ బీ క్రాస్‌ అవుతుంది. ఈ కొంత మినహా.... మిగతాదంతా పంచాయతీ రహదారే. ఈ పది కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 341 గుంతలున్నాయి. కొన్ని గుంతలయితే.... 5 నుంచి 15 సెంటిమీటర్ల లోతున ప్రమాదకరంగా ఉన్నాయి. నక్కపేట-టంకాల దుగ్గివలస వరకు రహదారి కొంత భాగం ఛిద్రమైపోయింది. అసలు అక్కడ తారు రోడ్డు ఉందనే విషయం కూడా గుర్తుపట్టలేనంతగా పాడయిపోయింది. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే చావుతో పోరాటంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో..... గ్రామస్తులు, యువత కలసి తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఏ చిన్నపాటి వర్షం కురిసినా గ్రామస్తుల రహదారి కష్టాలు మళ్లీ మొదటికొస్తున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details