ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water Problem: గొంతెండుతోంది.. మండువేసవిలో మన్యంవాసుల దాహం కేకలు..

By

Published : May 27, 2023, 3:53 PM IST

parvathipuram water problem news
మండువేసవిలో మన్యంవాసుల దాహం కేకలు

Water Problem: మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం ప్రజలు తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం రోజులు తరబడి ఎదురుచూస్తున్నారు. మండు వేసవిలో.. మున్సిపల్‌ సిబ్బంది నాలుగైదు రోజులకోసారి నీళ్లు పంపిణీ చేస్తుండటంతో.. పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మండువేసవిలో మన్యంవాసుల దాహం కేకలు

Water Problems: పార్వతీపురం.. మన్యం జిల్లా కేంద్రంగా ఏర్పడి ఏడాది పూర్తై రెండో ఏడాదిలోకి అడుగుపెట్టినా.. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యలు మాత్ర తీరడం లేదు. తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు. దీంతో తమ గోడును అధికారులు పట్టించుకోవట్లేదంటూ.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగావళి నది నుంచి ఇన్‌ఫిల్టర్‌ బావులకు నీటిని ఫిబ్రవరిలోనే మళ్లించినా.. సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కార మార్గం చూపకపోవటంపై మహిళలు పెదవి విరుస్తున్నారు.

మంచి నీటి సరఫరా కోసం పురపాలకశాఖ అధికారులు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం చూపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 30వార్డులు ఉండగా సుమారు 70వేల జనాభా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం రోజుకు 11 ఎమ్​ఎల్​డీల నీరు అవసరం ఉండగా మున్సిపల్‌ శాఖ అధికారులు కేవలం 4 ఎమ్​ఎల్​డీల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా.. అవి అందరికీ సరిపోవటంలేదు. దీంతో శివారు ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల కిందట 66కోట్ల రూపాయలతో మెగా తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. అధికార పార్టీ నేతలు శంకుస్థాపన చేసినా.. పనుల్లో మాత్రం పురోగతి కనిపించటం లేదని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

"పార్వతీపురం గ్రామంగా ఉన్నప్పుడు తాగునీటిని రెండు రోజులకు ఒకసారి పంపిణీ చేసేవారు. కాగా.. ఇప్పుడు జిల్లా కేంద్రంగా మార్చిన తర్వాత నాలుగు రోజులకు ఒకసారే నీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సదుపాయం లేక మేము నానా అవస్థలు పడుతున్నాము. సరైన వసతులు కల్పించకుండా.. పార్వతీపురాన్ని గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా మార్చి ఏం లాభం..? దీంతోపాటు కుళాయిలు ఇవ్వకపోయినా.. పన్నుల మాత్రం పెంచుకుంటూ పోతున్నారు."- పల్లవి, పార్వతీపురం

గత ప్రభుత్వ హయాంలో మంజూరైన తాగునీటి ప్రాజెక్టును వైసీపీ సర్కారు పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవి కాలంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వచ్చే వేసవికి అయినా శాశ్వత పరిష్కారం చూపించి.. తాగునీటి సమస్య లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. మరోవైపు.. అనకాపల్లె జిల్లాలోని గిరిజనులకు తాగునీటి సదుపాయం లేకపోవటంతో.. వాగుల వద్ద నీటి ఊటలపై ఆధారపడుతున్నారు. గుక్కెడు మంచినీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details