ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"మాకు చెప్పకుండానే పోస్టుమార్టం.." తెదేపా కార్యకర్త జల్లయ్య కుటుంబం ఆందోళన

By

Published : Jun 4, 2022, 9:33 AM IST

Updated : Jun 4, 2022, 12:28 PM IST

Tension at Narasaraopet
నరసరావుపేట ఏరియా వైద్యశాల వద్ద ఉద్రిక్తత

09:30 June 04

వైద్యశాలలో బైఠాయించి.. మృతుడి బంధువుల ఆందోళన

నరసరావుపేట ఏరియా వైద్యశాల వద్ద ఉద్రిక్తత

Tension at Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమకు తెలియకుండానే జల్లయ్యకు పోస్టుమార్టం నిర్వహించారని ఆగ్రహిస్తూ.. వైద్యశాల ఆవరణలో జల్లయ్య కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. దీంతో.. దాదాపు 3 గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసులు లాక్కెళ్లి బస్సు ఎక్కించారు. ఈ క్రమంలో.. మహిళా పోలీసులు, మహిళా ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. మహిళలని కూడా చూడకుండా చేయిచేసుకున్నారని జల్లయ్య బంధువుల ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుని బంధువులు, తెదేపా నాయకులను 2 బస్సుల్లో పోలీసులు తరలించారు.

ఉద్రిక్తల మధ్యనే జల్లయ్య మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించాడు. జల్లయ్య బంధువులకు మృతదేహం అప్పగించాలని పోలీసులు యోచిస్తున్నా... మృతదేహాన్ని తీసుకునేందుకు జల్లయ్య బంధువులు నిరాకరిస్తున్నారు. తెదేపా కార్యకర్త జల్లయ్య కుటుంబసభ్యులు నరసరావుపేటలో ఉన్నారు. కుటుంబసభ్యులు లేకుండా మృతదేహం ఎలా తీసుకుంటామని బంధువులు ప్రశ్నించారు

ఏం జరిగిందంటే..?:పల్నాడులో తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను.... ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక అధికార పార్టీ నేతల దాడులను తట్టుకోలేక... పల్నాడులో చాలా మంది తెలుగుదేశం సానుభూతిపరులు స్వగ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. హతుడు జల్లయ్య కూడా స్వగ్రామం దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలి గురజాల మండలంమాడుగులలో తలదాచుకుంటున్నారు. కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పనినిమిత్తం, శుభలేఖలు పంచేందుకు ఆయన దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జంగమేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు....గ్రామ సమీపంలోని మించాలపాడు అడ్డరోడ్డు వద్ద కాపు కాశారు.

ద్విచక్రవాహనంపై జల్లయ్యతో పాటు ఆయన బంధువులు ఎల్లయ్య, బక్కయ్య వస్తుండగా అడ్డగించి దాడి చేశారు. గాయపడిన ఎల్లయ్య, బక్కయ్యలు అటవీ ప్రాంతంలోకి పారిపోగా.....ప్రత్యర్థులు జల్లయ్యను జంగమేశ్వరపాడులోకి తీసుకొచ్చారు. గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈలోగా చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అంబులెన్సులో మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా.....జల్లయ్య ప్రాణం విడిచాడు.

కొట్టి.. రూ.5 లక్షలు లాక్కెల్లారు :రావులాపురంలో శుభకార్యం కోసం పురోహితుడితో మాట్లాడి, బ్యాంకు నుంచి 5 లక్షలు తీసుకుని వెళ్తుంటే ప్రత్యర్థులు తమపై దాడి చేశారని....గాయపడ్డ ఎల్లయ్య, బక్కయ్య చెప్పారు. జంగమేశ్వరపాడుకు చెందిన పలువురు ఈ దాడిలో పాల్గొన్నారని.....కొట్టిన తర్వాత 5 లక్షలు లాక్కెల్లారని చెప్పారు. ఘటనపై బక్కయ్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్తగా గ్రామంలో డీఎస్పీ జయరాంప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ అండతోనే తెదేపా నేతలపై దాడులు: వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో తెదేపా కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను దారుణంగా హతమార్చిన ఘటనను ఆయన ఖండించారు. వైకాపా నాయకత్వ ప్రోత్సాహంతో పల్నాడు రాజకీయ హత్యలకు కేంద్రంగా మారుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ వేధింపులకు బయపడి బయట ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న జల్లయ్య శుభకార్యం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చిన సమయంలో హత్యకు గురికావటం దారుణమన్నారు. రౌడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య, ఎల్లయ్య ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు.

పథకం ప్రకారమే కార్యకర్తలపై దాడులు :పథకం ప్రకారమే ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేసి హత్య చేయిస్తోందని.... మాచర్ల నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ధ్వజమెత్తారు. నరసరావుపేటలో జల్లయ్య మృతదేహాన్ని....స్థానిక తెలుగుదేశం నేత అరవిందబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. హత్యా రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అరవిందబాబు హెచ్చరించారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ :పల్నాడులో హత్యా రాజకీయాలపై డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జల్లయ్య హత్య కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి....పోలీసులు అనుకూలంగా వ్యవహరించడంతోనే పల్నాడులో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆక్షేపించారు. తోట చంద్రయ్య హత్య తర్వాతా పోలీసులు మేల్కోపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు.....ముగ్గురు సభ్యుల బృందం జంగమేశ్వరపాడు వెళ్లనుంది.కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధ వెంకన్న ఈ బృందంలో ఉన్నారు. వీరితో పాటు జిల్లా ముఖ్య నేతలూ జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details