ETV Bharat / state

రాజకీయ హత్యలకు కేంద్రంగా పల్నాడు.. వైకాపా నాయకత్వమే కారణం: చంద్రబాబు

author img

By

Published : Jun 3, 2022, 9:45 PM IST

Palnadu Murder Incident: వైకాపా నాయకత్వ ప్రోత్సాహంతో పల్నాడు రాజకీయ హత్యలకు కేంద్రంగా మారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చటాన్ని ఆయన ఖండించారు. వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో తెదేపా కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని ఆక్షేపించారు.

చంద్రబాబు
చంద్రబాబు

CBN On Palnadu Murder Incident: వైకాపా ప్రభుత్వ మద్దతుతోనే పల్నాడులో తెదేపా కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను దారుణంగా హతమార్చిన ఘటనను ఆయన ఖండించారు. వైకాపా నాయకత్వ ప్రోత్సాహంతో పల్నాడు రాజకీయ హత్యలకు కేంద్రంగా మారుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ వేధింపులకు బయపడి బయట ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న జల్లయ్య శుభకార్యం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చిన సమయంలో హత్యకు గురికావటం దారుణమన్నారు. రౌడీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడిన బక్కయ్య, ఎల్లయ్య ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా తీశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుందని ఆక్షేపించారు. కొద్ది నెలల క్రితం స్థానికంగా హత్యకు గురైన చంద్రయ్య విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ హత్యాకాండ జరిగేది కాదని అన్నారు. హత్యలతో పల్నాడును రక్తసిక్తం చేస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మీ రక్తదానం తీరదా ?: ఫ్యాక్షన్ నేప‌థ్యంతో పాటు క్రూర మ‌న‌స్తత్వం ఉన్న జ‌గ‌న్​ను ముఖ్యమంత్రిగా గ‌ద్దెనెక్కిస్తే ఆంధ్రప్రదేశ్​ను అరాచ‌క‌ప్రదేశ్‌గా మార్చేశాడని తెదేపా నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ప‌ల్నాడు జిల్లాలో తెదేపా వ‌ర్గీయుల‌పై వైకాపా దాడి రాక్షస‌త్వానికి ప‌రాకాష్ఠ అని మండిపడ్డారు. వేట కొడవళ్లతో తెదేపా నేత కంచర్ల జల్లయ్యని చంపారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెదేపా కార్యక‌ర్తలు ఎల్లయ్య, బక్కయ్యల‌ని తీవ్రంగా గాయ‌ప‌రిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద‌ల మంది తెదేపా కార్యక‌ర్తల్ని పొట్టన‌బెట్టుకున్నా.. మీ ర‌క్తదాహం తీర‌దా ? అని జగన్​ను ప్రశ్నించారు. ఇంకెంత‌కాలం ఈ న‌ర‌మేధాన్ని సాగిస్తారని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక.. అన్ని బాకీలు సెటిల్ చేస్తామని హెచ్చరించారు. వైకాపా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జ‌ల్లయ్య కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని స్పష్టం చేశారు. గాయ‌ప‌డి న‌వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామని లోకేశ్ వెల్లడించారు.

ఏం జరిగిందంటే..: పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెలుగుదేశం నాయకుడు కంచర్ల జల్లయ్యను ప్రత్యర్థులు చంపేశారు. గ్రామంలో వివాదాలతో ఇటీవల జల్లయ్య కుటుంబం ఊరు విడిచి వెళ్లింది. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయనపై.. ప్రత్యర్థులు దాడి చేశారు. దారికాచి కర్రలు, రాడ్లతో విపరీతంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన జల్లయ్యతో పాటు మరో ఇద్దరిని స్థానికులు మొదట మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య కన్నుమూశారు. పాత కక్షలే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.