ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైతన్నకు ఖరీఫ్​లో కరవైనా ప్రభుత్వ తోడు - రబీలోనైనా ఉంటుందా ?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 9:13 PM IST

Updated : Nov 15, 2023, 10:09 PM IST

Farmers Want to Government Help in Rabi Season: ఖరీఫ్​ సీజన్​లో సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి.. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిని పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం.. రబీ సీజన్​లోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు, మెళకువలపై దృష్టి సారించడం లేదు. విత్తనాలు, పెట్టుబడి వంటి వాటిని అందించి అన్నదాతలకు భరోసానైనా ఇవ్వడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

farmers_want_to_government_help_in_rabi_season
farmers_want_to_government_help_in_rabi_season

రైతన్నకు ఖరీఫ్​లో కరవైనా ప్రభుత్వతోడు - రబీలోనైనా ఉంటుందా

Farmers Want to Government Help in Rabi Season:ఖరీఫ్ సీజన్‌లో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీ సీజన్ వచ్చినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో.. ఎలాంటి పంటలు వేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై రైతులను అప్రమత్తం చేసేవారే కరవయ్యారు. రబీ కార్యాచరణ ప్రణాళికలు కనీసం కాగితాలను దాటడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది వర్షాభావానికి తోడు జలాశయాల నుంచి పంటలకు సాగునీరందకపోవటంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 85 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను.. ఏకంగా 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పంటలు వేయడానికే అవకాశం లేకుండా పోయింది.

ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు

రాజ్యమేలుతున్న కరవు: కరవు మండలాలుగా ప్రకటించటంలో ప్రభుత్వం చెబుతున్న సాంకేతిక కారణాలను పక్కనపెడితే వాస్తవంగా 350 నుంచి 400 మండలాల్లో కరవు రాజ్యమేలుతోంది. 50, 60 మండలాల్లో తాగేందుకు సైతం నీరులేని విధంగా దుర్భిక్ష పరిస్థితులున్నాయి. 428 మండలాల్లో 28 శాతం మేర వర్షపాతం లోటుంది. నీరందక వరి, మిర్చి, పత్తి వంటి పంటలు ఎండిపోయాయి. ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపి కొన్నింటినే కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"పైర్లు బాగా దెబ్బతిని రైతులు ఆగమైపోయారు. నాగార్జుసాగర్​ కాలువ రాకపోవడం.. వర్షాలు లేక పంటలు సక్రమంగా రాలేదు. దీనివల్ల రైతులు పంటలు నష్టపోయారు. ప్రభుత్వం కరవు మండలాలు ప్రకటించి ఏదోవిధంగా రైతుకు సహాయం చేయాలి." -వెంకటేశ్వరరావు, రైతు

'అనంత' కరవు కష్టం! ఎండిన చెరువులు, అడుగంటిన బోర్లు - రైతుల కన్నీళ్లు పట్టని వైసీపీ పాలకులు

"పది నుంచి పదిహేను రోజులు పంటలు బతకగలిగితే చేతికి వస్తాయి. లేదంటే.. పంటలు పీకేసి వేరే పంటలు సాగుచేయడమే మార్గం. ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాము."-బాషా, రైతు

రబీ సీజన్ వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన కార్యాచరణ లేదు. ఇప్పటికే కరవు పరిస్థితులు కొనసాగుతుండగా.. రబీ సీజన్లో ఎలాంటి పంటలు వేయాలి. ఏఏ మెళకువలు పాటించాలన్న దానిపై అధికారుల నుంచి శాస్త్రీయ సూచనలు కరవయ్యాయి. విత్తనాలు, పెట్టుబడులు వంటివాటిపై అన్నదాతలకు భరోసా కరవైంది. రబీ సీజన్లోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంపై రైతు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

'కరవు కనిపిస్తున్నా అంతా బాగుందనడం పచ్చి అబద్ధం - ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఐక్య పోరాటం'

"వాస్తవానికి అగష్టు నెల నుంచే రాష్ట్రంలో కరవు పరిస్థితులు కనిపించాయి. దీనివల్ల వ్యవసాయానికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వం కరవును గుర్తించడంలో వైఫల్యం చెందింది." -సూర్యనారాయణ, రైతు సంఘం నాయకుడు

"ప్రభుత్వం రైతుల పట్ల ఇంత నిర్లక్షంగా వ్యవహరించిన తీరును గతంలో ఎన్నడూ చూడలేదు. అగమ్యగోచర పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్​ చేస్తున్నాము." -ప్రభాకరరెడ్డి, రైతు సంఘం కార్యదర్శి

రబీ సీజన్​లోనైనా ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని రైతు సంఘాలు నేతలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పష్టమైన కార్యచరణ ప్రకటించాలని.. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.

సీఎం పర్యటనలో కరవు మండలాల ప్రకటన వస్తుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే

Last Updated : Nov 15, 2023, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details