ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tiger counting : అటవీ అధికారుల పులుల 'వేట'!

By

Published : Oct 11, 2021, 9:22 AM IST

Updated : Oct 11, 2021, 3:13 PM IST

నల్లమలలో పులుల గణన

దేశంలోని పెద్ద పులుల అభయారణ్యాల్లో ప్రధానమైనది నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్ట్‌. ఇక్కడ దాదాపుగా.. 63 వరకు పెద్ద పులులు ఉన్నాయి. వీటి వివరాలు వేటాడేందుకు సిద్దమైన అటవీ అధికారులు.. కెమెరాలు పట్టుకొని అడవుల్లోకి వాలిపోతున్నారు.

దేశంలో పెద్ద పులుల అభయారణ్యాల్లో ప్రధానమైనది నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్ట్‌. ఎన్‌.ఎస్‌.టి.ఆర్‌. 5,938 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. దట్టమైన చెట్లు, ఎత్తైన కొండకోనలు కలిగిన టైగర్‌ ప్రాజెక్ట్‌ ఇది. నల్లమల అడవుల్లో ప్రస్తుతం 63 పెద్ద పులులు ఉన్నాయి. ఇవేకాక అధిక సంఖ్యలో చిరుత పులులు ఉన్నాయి. చిరుత పులుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. పులులతోపాటు ఎన్నో వన్యప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయి.

20 నుంచి ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు..
అయితే.. ప్రతి నాలుగేళ్లకోసారి పులుల లెక్కింపు దేశవ్యాప్తంగా జరుగుతోంది. అడవుల్లోని చెట్లకు ట్రాప్‌ కెమెరాలు అమర్చి పులుల గణన చేపడతారు. ఇదే క్రమంలో వన్యప్రాణుల స్థితిగతులనూ అధికారులు గుర్తిస్తున్నారు. నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్ట్‌లో పులుల గణన కోసం అటవీశాఖ ఉన్నతాధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీశైలంతోపాటు ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని ప్రతీ బీట్‌లో ఒకటి, రెండు ట్రాన్జాక్‌ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాన్జాక్‌ లైన్‌ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రత్యేక మార్గాల ద్వారా అటవీశాఖ ప్రొటెక్షన్‌ వాచర్లు, సెక్షన్‌ అధికారులు, రేంజర్లు, సబ్‌-డీఎఫ్‌వోలు, డీఎఫ్‌వోలు అడవుల్లోకి వెళ్లి పులుల లెక్కింపు చర్యలు చేపడుతున్నారు.

పులులతోపాటు జింకలు, దుప్పులు, నెమళ్లు, చిరుత పులులు గుర్తించి ఇకలాజికల్‌ మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం మూడు నుంచి ఆరు రోజులపాటు వన్య ప్రాణులను నమోదు చేస్తారు. ఇందులో భాగంగా.. 20వ తేదీ నుంచి నల్లమల అడవుల్లో ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులుల లెక్కింపు చేపట్టనున్నారు. ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యే చిత్రాల ఆధారంగా పెద్ద పులుల చారలను గుర్తించి లెక్కిస్తారు. శ్రీశైలం రేంజి పరిధిలో సబ్‌ డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పులుల గణన చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ట్రాన్జాక్‌ మార్గాలను పరిశీలించారు.

సంఖ్య మరింత పెరిగే అవకాశం..

పులుల లెక్కింపులో భాగంగా అటవీశాఖ ప్రొటెక్షన్‌ వాచర్లు, సెక్షన్‌ అధికారులు ట్రాన్జాక్‌ లైన్ల ద్వారా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అడవుల్లో జీవిస్తున్న వన్యప్రాణులను లెక్కిస్తారు. ప్రస్తుతం ఉన్న 63 పెద్ద పులుల కంటే మరిన్ని పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. అడవిలోకి వెళ్లే సమయంలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించి గణనను పూర్తి చేస్తాం.

- చైతన్యకుమార్‌ రెడ్డి, ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారి, శ్రీశైలం

ఇదీచదవండి. pension problems : ‘ఏ నెలకు ఆ నెలే పింఛను’ నిబంధనతో కష్టాలు

Last Updated :Oct 11, 2021, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details