ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP JOB Calendar: ప్రతిపక్షంలో జాబ్​ క్యాలెండరంటూ.. అధికారంలో ఉద్యోగాల భర్తీ ఊసేలేదు

By

Published : Jul 14, 2023, 10:38 AM IST

Government Ignored Job Calendar: ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాబోయేది మన ప్రభుత్వం.. మన ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేసుకుందామని మాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడూ ఉద్యోగాలు భర్తీ చేస్తుందా అని నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తునే ఉన్నారు

Etv Bharat
Etv Bharat

YSRCP Government Ignored Job Calendar JOB Calendar: ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ లేదు. ఏటా ఇస్తామన్న ఊసే లేదు. ప్రకటించిన పోస్టుల భర్తీ జాడ అసలే లేదు. రెండున్నర లక్షల ఉద్యోగాలు, ఏటా మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల్ని ఊరించిన జగన్​ సీఎం పోస్టు పట్టేసి.. నాలుగు సంవత్సరాలు కాకమ్మ కబుర్లతోనే కాలం గడిపేశారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని నమ్మించి.. చివరకు నిరుద్యోగులు నీరసించిపోతున్నా స్పందించడంలేదు.

ప్రతిపక్షంలో జాబ్​ క్యాలెండరంటూ.. అధికారంలో ఉద్యోగాల భర్తీ ఊసేలేదు

'దేవుడు ఆశీర్వాదించి.. మీ అందరి చల్లని దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటిగా నేను చేయబోయేది.. గవర్నమెంటులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు రీలీజ్​ చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ క్యాలెండర్​ కూడా విడుదల చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను' అని ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అన్న మాటలివి

ఈ మాటతోనే జగన్‌ నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టారు. ఆయన మాత్రం సీఎం పోస్టు దక్కించుకున్నారు. ఆ తర్వాత జాబ్‌క్యాలెండర్‌ హామీని గాలికొదిలేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించారు. 2021 జూన్‌ 18న 10 వేల 143 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్.. అంటూ ఒక ప్రచార వీడియో కూడా విడుదలచేశారు.

ఆ వీడియోలో చివరి మాటల్లో చెప్పినవే కాదు చెప్పనివీ చేయడం జగనన్న నైజమని ప్రకటించారు. ఈ నాలుగేళ్లలో ఇచ్చిన ఒకే ఒక జాబ్‌క్యాలెండర్‌లో చెప్పిందేంటో చేసిందేంటో పరిశీలిస్తే అదొక జాబ్‌లెస్‌ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. 2021 జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపకుల పోస్టుల భర్తీకి గతేడాది జనవరిలో వర్సిటీల్లో 2వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి.. గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ నేటికీ అతీగతీ లేదు. జగన్‌ ఇలా మడమ తిప్పుతారని తెలియక నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉన్నారు.

''జగన్​మోహన్​ రెడ్డి పాదయాత్రలో 2 లక్షల 35వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. పాఠశాల విద్య శాఖలోనే 43వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారు.'' -ప్రసన్నకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

''మీరు నిరుద్యోగులను మోసం చేయకుండా ఉండాలంటే.. ఖాళీగా ఉన్న2లక్షల 35వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల జీవీతాలను కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.'' -సోమేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు

గ్రూప్స్‌ విషయంలో జగన్‌ నిరుద్యోగుల్ని నిలువునా మోసగించారు. 2022 సెప్టెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్‌ ఇచ్చినా నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. గ్రూపు-2 నోటిఫికేషన్‌ మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఈ ఏడాది మే 25న వంద గ్రూపు-1, 900 గ్రూపు-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నెలన్నరదాటినా నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు.

ఇక అధికారం లోకొస్తే ఏటా మెగా డీఎస్సీ వేస్తానన్న హామీకి జగన్ తూట్లు పొడిచారు. పాఠాశాలల విలీనంతో.. ఉపాద్యాయ ఉద్యోగుల పోస్టుల్లో భారీగా కోత పెట్టారు. ఐనా పాఠశాలల్లో సరిపడా టీచర్లు లేనప్పటికీ డీఎస్సీ ప్రకటన లేదు. నోటిఫికేషన్ల జారీలో జాప్యం వల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయసు రీత్యా అర్హత కోల్పోతున్నామని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

''జగన్​మోహన్​ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఏపీపీఎస్సీ పోస్టులు గానీ, ఇతర పోస్టులు గానీ భర్తీ చేయలేదు. రాజకీయంగా లబ్ది చేకూరే పోస్టులను భర్తీ చేశారు తప్పా.. మిగతా పోస్టులను భర్తీ చేయలేదు.'' -రామకృష్ణ, పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్

''ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టు టీచర్లు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా ఎస్టీటీలు ఖాళీగా ఉన్నాయి. కేంద్రం 50వేల వరకు పాఠశాల విద్య శాఖలోని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 10వేలో లేక 15వేలో పోస్టులో ఖాళీగా ఉన్నాయని అంటోంది.'' -వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details