ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చలో అసెంబ్లీ'.. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విపక్షాలు

By

Published : Mar 20, 2023, 9:28 AM IST

Chalo Assembly programme: ఇవాళ తలపెట్టిన చలో అసెంబ్లీపై.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. విపక్షాలు, వివిధ ప్రజాసంఘాల నేతలు.. జిల్లాలు దాటకుండా పోలీసులు ముందే గృహనిర్బంధం చేస్తున్నారు. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరన్న నేతలు.. కచ్చితంగా కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు.

Chalo Assembly programme
Chalo Assembly programme

Chalo Assembly programme: Chalo Assembly programme: సభలు,ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జీవో నంబర్‌ వన్‌ను రద్దు చేయాలంటూ.. విపక్షాలు, ప్రజాసంఘాలు పిలుపిచ్చిన చలో అసెంబ్లీపై.. ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. జీవో నంబర్‌ వన్‌ రద్దు పోరాటానికి.. రాష్ట్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న బార్ కౌన్సిల్ సభ్యుడు.. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావుని రాజమహేంద్రవరంలో అరెస్ట్ చేశారు.

జీవో 1 రద్దు చేయాలంటూ సోమవారం ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 151 సీఆర్సీపీ నోటీసు ఇచ్చిన పోలీసులు.. గృహనిర్బంధం చేశారు. రాత్రి 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి రాజానంగరం పోలీస్టేషన్ కు తరలించారు. జీవో 1 రద్దు కోసం పోరాడుతున్న వారిపై ప్రభుత్వం పోలీస్ చర్యకు పాల్పడటం అప్రజాస్వామక చర్యని అని ముప్పాళ్ల అన్నారు. నిర్బంధాలకు భయపడేది లేదని.. ఏ నేరం చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసుల్ని నిలదీశారు. జీవో 1 రద్దు చేసే వరకు పోరాడతామని ముప్పాళ్ల అన్నారు..

"అరెస్టుల ద్వారా మా ఉద్యమాన్ని నీరు గారుస్తామంటే ఇంక సహించేది లేదు.. అది నల్ల జీవో.. బ్రిటీష్ వారు కూడా అలాంటి జీవోని తీసుకు రాలేదు. ఈ జీవో తీసుకొచ్చి.. ప్రజల గొంతు నొక్కడానికి, ప్రతిపక్షాల నోరు నొక్కడానికి, ప్రజా సంఘాల నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము". - ముప్పాళ్ల సుబ్బారావు, కన్వీనర్, జీవో-1 వ్యతిరేక పోరాట ఐక్యవేదిక

ముందస్తు అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు జగన్ సర్కార్ కుటిలయత్నాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులపై ఎక్కడబడితే అక్కడ ముందస్తు గృహ నిర్బంధాలకు, అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్​ 1ని తీసుకొచ్చి ప్రజాస్వామిక విలువలను కాలరాసింది అని అన్నారు. శాంతియుత ప్రజా ఉద్యమాలపై పోలీసులచే ఉక్కుపాదం మోపటం తగదని.. తక్షణమే జీవో నెం1ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్రవాదులంతా రాష్ట్ర ప్రభుత్వ దమననీతిని ఖండించాలని కోరారు. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని అసెంబ్లీ ముట్టడికి విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి విధానాలను చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా చాటి చెప్తామని హెచ్చరించారు.

" రాష్ట్రంలో జీవో నెంబర్ 1ని తీసుకువచ్చి అమలు చేయడం వల్ల.. ప్రత్యేకంగా ఒక పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ విషయానికి అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు తెచ్చిన దుష్ట చట్టాలను.. ఉపసంహరించుకోవాలని చేప్తున్నా కూడా వినకుండా.. హైకోర్టులో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. ఏమైనా కాని అరెస్టులకు బయపడేది లేదు. వెనుకకు జంకేది లేదు. కచ్చితంగా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం". -రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details