ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Govt Schools Admissions Reduced: ప్రభుత్వ స్కూల్స్​లో భారీగా తగ్గిన ప్రవేశాలు.. ఇదేనా సమూల మార్పు..?

By

Published : Jul 17, 2023, 7:07 AM IST

Admissions Reduced in Government Schools: అమ్మఒడి ఇస్తున్నాం.. నాడు-నేడు ద్వారా బడుల రూపురేఖలు మార్చేస్తున్నాం.. డిజిటల్‌ తరగతుల ద్వారా విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం అంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్‌ సహా వైఎస్సార్​సీపీ నేతలంతా ఊదరగొడుతున్నారు. మరి ఈ లెక్కన ప్రభుత్వ బడుల్లో చదివే వారి సంఖ్య పెరగాలి. కానీ తగ్గుతోంది. ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఈ విషయమై ఎవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా.. ఏకంగా వెబ్‌సైట్‌ నుంచి వివరాలు తొలగించేశారు.

government schools condition in AP
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి

ప్రభుత్వ బడుల్లో తగ్గిన ప్రవేశాలు

Admissions Reduced in Government Schools: "మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాం. ప్రభుత్వంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు 37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు.” అంటూ గతేడాది సెప్టెంబర్‌ 20 శాసనసభలో సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ..అవును నిజమే.. సమూలంగా మార్చేశారు. ఎంతగా అంటే ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేసి.. 9నెలలు గడవక ముందే 6.41 లక్షల మంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయే అంతగా మార్చేశారు. అశాస్త్రీయమైన విధానాలతో పిల్లలు వెళ్లిపోయేలా పొగబెడుతున్నారు. 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,29,569 మంది విద్యార్థులు ఉంటే.. ప్రస్తుతం విద్యాసంవత్సరంలో 37.88లక్షలకు పడిపోయింది.

గత రెండేళ్లుగా ప్రభుత్వ బడులకు వచ్చే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పిల్లల్ని ఎందుకు ఆకర్షించలేకపోతోంది..? సంస్కరణలు బాగుంటే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగాలి కదా? ఎందుకు తగ్గిపోతున్నారు? కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులను కొనసాగేలా ఎందుకు చూడలేకపోయారు..? గత సంవత్సరం 3.98లక్షల మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయినా.. 2018-19 ఏడాది విద్యార్థులతో పోల్చితే విద్యార్థుల సంఖ్య రెండు లక్షలు అదనంగా ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేసింది.

ఈ సంవత్సరం మరి కొంత తగ్గి చివరికి 2018-19లో ఉన్న 37లక్షలకే చేరింది. 2023-24లో ప్రవేశాలు ముగింపునకు చేరాయి. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు 37.88లక్షలుగా నమోదవుతోంది. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2019-20లో 38.18 లక్షలు ఉండగా.. ఇప్పుడు 30వేలు తగ్గారు. పిల్లల సంఖ్యను పెంచి చూపించేందుకు గతంలో ఎప్పుడో బడి మానేసిన పిల్లల్నీ రిజిష్టర్లలో నమోదు చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.

ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత స్కూల్స్​లో కలిపేశారు. ఇలాంటిచోట బడుల దూరం పెరిగిపోయింది. మరోపక్క గ్రామంలోని బడి 1, 2 తరగతులకే పరిమితమైపోయింది. స్టూడెంట్స్ సంఖ్య తక్కువగా ఉన్నచోట సబ్జెక్టు టీచర్లను ఇచ్చేందుకు ఎన్నో నిబంధనలు పెట్టారు. ఇవన్నీ విద్యార్థుల చదువుకు ఇబ్బందిగా మారాయి.

ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో 9 వేల ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. ఒక్కో స్కూల్​కు ఇద్దరు ఉపాధ్యాయులను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. పోస్టులను తగ్గించుకునేందుకు సర్దుబాటు చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 234 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. ఈ పాఠశాలల్లో ఇప్పుడు కేవలం 1, 2 తరగతులు మాత్రమే మిగిలాయి. కొత్తగా పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులు రెండేళ్ల కోసమే ఇక్కడ చేర్పించడం ఎందుకని భావించి సమీపంలోని ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 3 లక్షల 6 వేల533 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 2 లక్షల 36 వేల 36 మంది మాత్రమే ఉన్నారు.

విద్యార్థుల సంఖ్య ఇలా..

సంవత్సరం పిల్లలు
2018-19 37,20,988
2019-20 38,18,348
2020-21 43,42,874
2021-22 44,29,569
2022-23 (అక్టోబరు) 40,31,239
2022-23 (ఏప్రిల్‌) 39,95,992
2023-24 37,88,283

తరగతుల విలీనాన్ని గతేడాది పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోలేదు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను 7 కిలో మీటర్ల దూరంలో కనీస సౌకర్యాల్లేని బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ 68 రోజులు ఆందోళన చేశారు. దీంతో అధికారులు విలీనాన్ని నిలిపివేసి.. ఇక్కడి నుంచి సబ్జెక్టు టీచర్లను తొలగించారు. గతేడాది విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనేకచోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో ఆరో తరగతిలో 4 లక్షల 32 వేల 318మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 3 లక్షల 91 వేల 7మంది మాత్రమే ఉన్నారు.

98 మందిలోపు పిల్లలు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8వ తరగతుల్లో బోధనకు ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ను ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఒక వ్యక్తి మూడు తరగతులకు గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం బోధించడం అవుతుందా? సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణే 98 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత బడులకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వబోమని, ఇక్కడ చదివే వారిని వేరే బడుల్లో చేర్చుకోవాలని వెల్లడించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఎక్కువగా చూపించేందుకు కొన్నిచోట్ల డ్రాపౌట్ల పేర్లను రిజిష్టర్లలో నమోదు చేస్తున్నారు. గతంలో చదువు మధ్యలో మానేసిన విద్యార్థుల్ని ఇప్పుడు స్కూల్​లో చేర్పించినట్లు రికార్డులు రాయాలని ప్రధానోపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు టీసీలు అడుగుతుండడంతో ప్రధానోపాధ్యాయులు ఇవ్వడం లేదు. ఎక్కడైనా టీసీలు ఎక్కువగా ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదైతే ప్రధానోపాధ్యాయుడిని ఇబ్బందులు పెడుతున్నారు.

ఈ ఏడాది ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గాయి. గతేడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 3.80 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు వెళ్లిపోయారు. ఈ స్థాయిలో ప్రవేశాలు రావడం లేదు. ఇప్పటి వరకు 2.36లక్షల మంది మాత్రమే చేరారు. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. గత మూడేళ్లుగా వెబ్‌సైట్‌ నుంచి పిల్లల సంఖ్యను తీసేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున గణాంకాలు, హాజరును రహస్యంగా ఉంచుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details