ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Allegations on Chittoor Police: "చోరీ కేసులో పోలీసులు లైగింకంగా వేధించారు"

By

Published : Jul 7, 2023, 8:08 AM IST

Tamilnadu Women Allegations on Chittoor Police: బంగారం చోరీ కేసులో చిత్తూరు పోలీసులు తమను లైంగికంగా, శారీరకంగా హింసించారంటూ తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన దళిత మహిళలు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Tamilnadu Women Allegations on Chittoor Police
Tamilnadu Women Allegations on Chittoor Police

Tamilnadu Women Allegations on Chittoor Police: బంగారం చోరీ కేసులో చిత్తూరు పోలీసులు తమను లైంగికంగా, శారీరకంగా హింసించారంటూ తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాకు చెందిన దళిత మహిళలు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ, రాడ్డుతో చిత్రహింసలు పెట్టారని మరొకరు ఆరోపించారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారని పురుషులు పేర్కొన్నారు. ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులను పోలీసులు అరెస్టు చేయగా స్త్రీల వెంట వారిద్దరి కుమారులూ ఉండటం గమనార్హం. అందులో అయ్యప్పన్‌, పూమదిని చిత్తూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌లో ఉంచారన్నారు. ఈ ఘటనలపై క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో పూతలపట్టు ఎస్సై హరిప్రసాద్‌, కానిస్టేబుళ్లు రమేష్‌, తనికాచలం సహా మరికొందరిపై కేసు నమోదైంది. మహిళల ఫిర్యాదు మేరకు చిత్తూరు రెండో పట్టణ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదైంది. సంబంధిత ఎస్సై, కానిస్టేబుళ్లను వేర్వేరు స్టేషన్లకు బదిలీ చేశారు.

బాధిత మహిళలు ‘ఈనాడు- ఈటీవీ’కి తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, చిత్తూరు వన్‌టౌన్‌ స్టేషన్లలో రెండు కిలోల బంగారం చోరీ కేసులో పోలీసులు తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పుళియాండపట్టి గ్రామానికి చెందిన అయ్యప్పన్‌ను సూత్రధారిగా భావించారు. జూన్‌ 5, 7 తేదీల్లో పూతలపట్టు పోలీసులు అయ్యప్పన్‌ బంధువు రమేష్‌, అయ్యప్పన్​ రెండో భార్య రేణుకను ఐదేళ్ల కుమారుడితో సహా అదుపులోకి తీసుకున్నారు. రేణుకను చిత్రహింసలు పెట్టారు. అయ్యప్పన్‌ గురించి అతడి అక్క సత్య, చిన్న కుమారుడు తమిళరసుకు తెలుసని భావించి రేణుకతో ఫోన్‌ చేయించి హోసూరులో జూన్‌ 9న అతణ్ని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత పుళియాండపట్టిలో అయ్యప్పన్‌, అతని తల్లి కన్నమ్మ, మొదటి భార్య, ఆమె ఏడేళ్ల కుమారుడు, చెల్లి వరసైన పూమదిని అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు. బంగారం చోరీ చేశావంటూ అయ్యప్పన్‌ను ముఖంపై కారం పోసి కొట్టారు. అక్కడి నుంచి అందరినీ పూతలపట్టుకు తీసుకువచ్చారు.

జూన్‌ 12న అయ్యప్పన్‌ అక్క సత్య.. ఆన్‌లైన్‌లో తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెతోపాటు భర్త రమేష్‌నూ పూతలపట్టుకు తరలించారు. విచారణ సమయంలో ఓ కానిస్టేబుల్‌ తనను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని అయ్యప్పన్‌ మొదటి భార్య ఆరోపించారు. బంగారం విక్రయించావంటూ అయ్యప్పన్‌తోపాటు మరికొందరిని తమిళనాడులోని పలు బంగారు దుకాణాలకు తీసుకెళ్లి కొన్ని నగలు రికవరీ చేశారు. జూన్‌ 16న చిత్తూరులో అయ్యప్పన్‌, పూమది మినహా చిన్నారులతో పాటు 8మందికి కులసంఘం నాయకులు, న్యాయవాదుల సమక్షంలో 41ఏ నోటీసులు ఇచ్చి ఇళ్లకు పంపారు. జూన్‌ 17న వారు క్రిష్ణగిరి జిల్లా ఆసుపత్రిలో చేరి తమకు జరిగిన అన్యాయాన్ని అక్కడి పోలీసులకు తెలియజేయడంతో చిత్తూరు పోలీసులపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు క్రిష్ణగిరి జిల్లా కలెక్టర్‌ సరయు ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

కాగా ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఈ ముఠా గతంలో తమిళనాడులోని అటవీ, పోలీసు అధికారులపై ఇదే తరహా ఆరోపణలు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి చెప్పారు. ‘చిత్తూరు ఒకటో పట్టణ, పూతలపట్టు స్టేషన్లలో బంగారం చోరీ కేసుకు సంబంధించి జూన్‌ 15న చిత్తూరు నగరంలో వైరుముత్తు, అయ్యప్పన్‌ అనుచరులను అరెస్టు చేశాం. అయిదుగురు మహిళా నిందితులను సీపీఐ నేతలు, గ్రామ పెద్దల సమక్షంలో 41ఏ నోటీసు ఇచ్చి తమిళనాడులోని ఊతంగరై స్టేషన్‌లో డీఎస్పీకి అప్పగించాం. పోలీసులు తమనేమీ వేధించలేదని వారు అక్కడ వాంగ్మూలం ఇచ్చారు. క్రిష్ణగిరి ఆసుపత్రి డీన్‌ సైతం శారీరకంగా వారిపై ఎలాంటి హింస జరగలేదని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కొందరి ప్రలోభాలతో అదే మహిళలు చిత్తూరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. అయినా పారదర్శకంగా విచారణ జరపాలనే ఉద్దేశంతో ఎస్సై, కానిస్టేబుళ్లను బదిలీ చేశాం. ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది’ అని ఎస్పీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details