ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలుగు విద్యార్థిని ప్రతిభ.. అమెరికా వైట్​హౌస్​ సందర్శన

By

Published : Mar 25, 2023, 5:29 PM IST

AP Gurukul student visited White House: బాపట్ల గురుకులంలో చదివే విద్యార్థిని ప్రస్తుతం అమెరికాలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. నీతి ఆయోగ్‌ ద్వారా విదేశాల్లో చదివేందుకు ఏపీ నుంచి ఎంపికైన ముగ్గురిలో అక్ష ఒకరు. గత ఆగస్టులో అమెరికా వెళ్లింది. వాషింగ్టన్‌ బ్రెమెర్టన్‌ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. సెమినార్లలో చురుగ్గా పాల్గొని బాగా చదివి విద్యలో రాణిస్తున్న అక్షకు అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించే అవకాశం దక్కింది.

gurukula to white house
గురుకులం టు వైట్‌హౌస్‌

AP Gurukul student visited White House: ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి.. కేంద్రప్రభుత్వ సహాయంతో విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది. బాపట్ల జిల్లాలోని గురుకులంలో చదివే విద్యార్థిని.. కేంద్రప్రభుత్వ పథకం సహకారంతో ప్రస్తుతం అమెరికాలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. తరగతి గదిలో చలాకీగా ఉంటూ కష్టపడి చదువుతూ తాజాగా అమెరికా అధ్యక్ష భవన కార్యాలయం వైట్​హౌస్​ నుంచి ఆహ్వానం అందుకుని సందర్శించిన విద్యార్థిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

కొమరాబత్తిన అక్ష స్వస్థలం పర్చూరు మండలం చెరుకూరు. అక్ష తండ్రి మరియరాజు తన గ్రామంలో చిన్న టీ కొట్టు నిర్వహిస్తుండగా.. ఆమె తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తుంది. బాపట్ల జిల్లా నరసాయపాలెం గురుకులంలో అక్ష 9, 10 తరగతి విద్యను పూర్తి చేసుకుంది. పాఠశాలలోని ప్రిన్సిపల్‌ వినీత అక్షలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడంతో పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ మార్కులు సాధించింది. అనంతరం 2021లో బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. కెనడీ లిగర్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ స్టడీ(కేఎల్‌వైఈఎస్‌) కింద కేంద్రప్రభుత్వం నీతిఅయోగ్‌ ద్వారా ఏటా 35 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పంపించగా.. అమెరికాలో పది నెలలు సీనియర్‌ ఇంటర్‌ విద్యను అభ్యసించటానికి అందులో ఒక అమ్మాయిగా అక్ష నిలిచింది. కేఎల్‌వైఈఎస్‌ పథకం కింద అక్ష చదువుకయ్యే ఖర్చు మెుత్తాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తోంది.

అమెరికాలోని వాషింగ్టన్​లో బ్రెమెర్టన్‌ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ చదువుతోంది. కాలేజిల్లో నిర్వహించే వివిధ సెమినార్లలో అక్ష చురుగ్గా పాల్గొని బాగా చదివి విద్యలో రాణిస్తుంది. అక్కడి అధ్యాపకులను సైతం మెప్పిస్తూ.. ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. భారతదేశం నుంచి అమెరికాలో చదువుతున్న విద్యార్థినుల్లో ముగ్గురికి అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించే అవకాశం వచ్చినవారిలో అక్ష అమ్మాయిగా అవకాశం దక్కించుకుంది.

ప్రతిభావంతులకు అమెరికా అవకాశాల గని అని అక్ష తెలిపింది. మారుమూల గ్రామానికి చెందిన తాను ఇక్కడికి వచ్చి చదువుతున్నానంటే ఇప్పటికి కలగానే ఉందని అక్ష పేర్కొంది. విద్య, ప్రతిభ వల్లే అది సాధ్యమైందని వెల్లడించింది. ప్రతిభకు ఎల్లలు లేవనీ.. వాషింగ్టన్‌ బ్రెవెర్టన్‌ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ ఇంటర్‌ చదవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు అక్ష తెలిపింది. అమెరికాలోని విద్యా విధానం చాలా బాగుందని.. ఇక్కడ చదవడం వల్ల తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని అక్ష వెల్లడించింది. ఇక్కడ తన గురువులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని.. కష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నా కలలు సాకారం చేసుకుంటానని అక్ష వెల్లడించింది. ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్​హౌస్‌ సందర్శనకు పిలుపు రాగానే తనకు గొప్ప సంతోషం కలిగిందని వెల్లడించింది.

అమెరికాలోని విదేశాంగ శాఖ అధికారులు ఆహ్వానించి అభినందించిన తీరు జీవితాంతం గుర్తుండిపోతుందని అక్ష వెల్లడించింది. అమెరికాలో కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి వచ్చి డిగ్రీ చదివి.. మరలా ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్తానంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. ఉన్నత విద్య అమ్మాయిల జీవితంలో వెలుగులు నింపుతుందని.. ప్రతిఒక్కరూ కష్టపడి చదివి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలని అక్ష తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details