ETV Bharat / state

పోర్టు రహదారికి భూములు ఇవ్వలేం.. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ రైతుల నిరసన

author img

By

Published : Mar 25, 2023, 1:05 PM IST

Farmers Protest: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు రోడ్డు కోసం తమ భూములు ఇవ్వబోమని రైతులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. టెక్కలి, బొన్నవాడ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో రైతులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రహదారి నిర్మిస్తే జీవనోపాధిగా ఉన్న భూముల్ని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మించొద్దంటూ రైతులు నినాదాలు చేశారు.

Farmers Protest
రైతుల నిరసన

Farmers Protest: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు రోడ్డు కోసం చేస్తున్న భూ సేకరణకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూ సేకరణ కోసం పలు గ్రామాలలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ జరుగుతుండగా.. రైతులు కుర్చీల నుంచి పైకి లేచి నినాదాలు చేశారు. రైతుల పొట్ట కొట్టొద్దని వేడుకున్నారు. పోర్టు ప్రాంతం నుంచి జాతీయ రహదారిని అనుసంధానించే 100 మీటర్ల వెడల్పు రహదారి నిర్మిస్తే తమ జీవనోపాధిగా ఉన్న భూములన్నీ పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం ఎంత ఇచ్చినా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని, గ్రామ సభలు బహిష్కరిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా రెవిన్యూ అధికారులకు అందజేసి నినాదాలు చేశారు. సెంటు భూమికి కోటి రూపాయలు ఇచ్చినా తమ భూములను మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపాదించిన రహదారిని కాదని ఇప్పుడు తమ భూముల మీదగా రహదారిని నిర్మిస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు రోడ్డుకి భూ సేకరణ కోసం టెక్కలి, బన్ను వాడలలో రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో సంబంధిత సర్పంచులు గొండేల సుజాత, పోలాకి మోహనరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు చోట్ల రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెక్కలిలో 23వ తేదీన సాయంత్రం సమావేశం జరగాల్సి ఉండగా, దానిని రద్దు చేసి అర్ధాంతరంగా శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. కొద్దిమందికే ఈ సమాచారం తెలిసినా పాల్గొన్నవారంతా భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తూ వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్ గిరిబాబుకు అందజేశారు.

అనంతరం రహదారి నిర్మించొద్దంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసు బందోబస్తు నడుమ జరిగిన గ్రామసభలో బన్నువాడ, మోదుగవలస రైతులు తమ భూములను ఇవ్వబోమని, అలాంటి పరిస్థితి వస్తే ప్రాణ త్యాగాలకు సిద్ధమని స్పష్టం చేశారు. గ్రామసభలను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసి పుస్తకాలపై రాసి సంతకాలు చేశారు. దీనిపై అధికారులు ఇంకేమైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతూ.. వారికి సర్దిచెప్పే చెప్పే ప్రయత్నం చేసినా.. రైతులు అంతా ఒకే మాటపై నిలబడి తమ వైఖరిని తెలియజేశారు.

వలసలు లేని గ్రామాలుగా బన్నువాడ, మోదుగవలస ఉన్నాయని, రైతులకు మేలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత గ్రామాలను శ్మశానంగా మార్చేస్తారా అంటూ మహిళలు, రైతులు నిప్పులు చెరిగారు. వ్యవసాయం తమ జీవనాధారమే కాదని, జీవన విధానమన్నారు. ఉప తహసీల్దార్ గిరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ఫల్గుణరావు, మాజీ సర్పంచులు స్వతంత్ర రావు, తిరుమల కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.