ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష ఎప్పుడంటే..?

By

Published : May 26, 2022, 2:31 PM IST

Police Preliminary Examination: తెలంగాణలో భారీఎత్తున పోలీస్​ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్‌ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సన్నాహాలు చేస్తోంది.

Police Preliminary Examination
తెలంగాణలో పోలీస్ ప్రాథమిక రాతపరీక్ష ఎప్పుడంటే

Police Preliminary Examination: పోలీస్‌ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) సన్నాహాలు చేస్తోంది. అదే నెల 21న కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అనుకోని అవాంతరాలు ఎదురుకాకపోతే దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కానున్నాయి.

ఒకవేళ ఆ తేదీల్లో టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఉంటే స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. తెలంగాణలో ఈసారి భారీఎత్తున 17,291 పోస్టులను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా.. మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులే. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు కలిపి మంగళవారం సాయంత్రం వరకు సుమారు 12.1 లక్షల దరఖాస్తులొచ్చాయి.

ఈ నెల 26న గడువు ముగిసే నాటికి సుమారు 14 లక్షల దరఖాస్తులు రావొచ్చని, వీటిలో కానిస్టేబుల్‌ పోస్టుల దరఖాస్తులే 9-11 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక రాతపరీక్షలకు సంబంధించి జూన్‌ 10 నాటికి కసరత్తు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాల్‌టికెట్ల జారీతోపాటు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియను అప్పటిలోగా పూర్తి చేయనున్నారు.

2018 నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎఫ్‌, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఈసారి అదనంగా రవాణా, ఎక్సైజ్‌శాఖ సిబ్బంది నియామకాల బాధ్యతనూ ఆయా శాఖలు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకే అప్పగించాయి. వాటిలోనూ కానిస్టేబుల్‌ పోస్టులే ఉండటంతో మండలి ద్వారా శారీరక సామర్థ్య పరీక్షల నియామకాలు చేపడితే ఫలితాలు పక్కాగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

2018తో పోల్చితే రెట్టింపు కంటే అధికం :2018 నోటిఫికేషన్‌లో దాదాపు ఇన్నే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. అప్పట్లో సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దాంతో పోల్చితే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం విశేషం. క్రితంసారి కేవలం పోలీసుల నియామకాలే జరిగాయి. ఈసారి టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకూ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు అటువైపు కూడా దృష్టి సారిస్తారని.. 7 లక్షల దరఖాస్తులే రావొచ్చని తొలుత అంచనా వేశారు. అయితే అనూహ్యంగా దరఖాస్తులు పోటెత్తాయి. తొలుత ఈ నెల 20 నాటికే దరఖాస్తుల సమర్పణకు గడువుండగా.. యూనిఫాం పోస్టులకు ప్రభుత్వం రెండేళ్ల వయోపరిమితి పెంచడంతో గడువును ఈ నెల 26 వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తులు అంచనాలను మించాయి.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details