ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Corona Vaccination : ఓవైపు విజృంభిస్తున్న కరోనా.. మరోవైపు కరవైన టీకా

By

Published : Aug 10, 2021, 12:05 PM IST

తెలంగాణలో కనీసం మొదటి డోసు కరోనా టీకా(Corona Vaccination) వేయించుకోవాలనుకుంటే వేయడం లేదు.. పోనీ ఇప్పటికే మొదటి డోసు వేయించుకున్నవారు రెండో డోసుకు వెళ్తే లేదంటున్నారు. అసలు టీకా వేయించుకోనివారు, ఒకసారి వేయించుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు కరోనా రోగుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండటంతో ప్రజల్లో భయం మొదలైంది. వేలాదిమంది వ్యాక్సిన్‌ కోసం కేంద్రాలకు ప్రతిరోజూ ఉదయమే పరుగులు తీస్తున్నారు.

cororna vaccination
cororna vaccination

తెలంగాణ.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో పక్షం రోజులుగా ఏ కేంద్రంలోనూ మొదటి డోసు టీకా(Corona Vaccination) వేయడం లేదు. రెండో డోసైనా సరిపోను ఉన్నాయా అంటే అదీ లేదు. ఆర్థికంగా కాస్త బాగున్నోళ్లు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి మొదటి డోసు టీకా వేయించుకుంటున్నారు. కొవాగ్జిన్‌ రూ.1400, కొవిషీల్డు రూ.800 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. అంత భరించలేని పేద కుటుంబాలు ప్రతిరోజూ కేంద్రాలకు వెళ్లడం నిరాశగా తిరిగి రావడం పరిపాటిగా మారింది. హైదరాబాద్‌ జిల్లాలో కొద్దిరోజులపాటు ప్రతిరోజూ 50 వేల డోసులు వేసేవారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను కలుపుకొంటే లక్ష డోసులకు అటు ఇటుగా వేశారు. ప్రస్తుతం డోసుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. సోమవారం నాజర్‌ స్కూలులో 500 మందికి టీకాలు వేస్తామని ప్రకటించారు. అక్కడికి 1500 మంది వెళ్తే 100 డోసులు మాత్రమే వేశారు.

టీకాకు దూరంగా టెకీలు!

ఏడాదిన్నర కాలంగా ఇంటి నుంచి పని కొనసాగుతున్నా ఇప్పటికీ కనీసం 40% మంది టెకీలకు టీకాలు(Corona Vaccination) వేయకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లో దాదాపు 1500 ఐటీ సంస్థల్లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. కానీ 1.5 లక్షల మందికే టీకాలు వేసినట్లు ఐటీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కొవిడ్‌ మొదటిదశలో అంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. వీరిలో దాదాపు 40% మంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అసోసియేషన్‌) ఇటీవల చేసిన అధ్యయనంలో 36% సంస్థల్లో 50%-75% మంది మాత్రమే ఒక డోసు వేయించుకున్నారని తేలింది. టీకాపై ఇంకా అపోహలున్నాయని హైసియా ఉపాధ్యక్షుడు చెరుకూరి కిరణ్‌ అన్నారు.

నేటినుంచి మొబైల్‌ కేంద్రాల ద్వారా..

రెండో డోసుకు వచ్చిన వారితోపాటు కొన్ని మొదటి డోసులు(Corona Vaccination) కూడా వేస్తే బావుంటుందని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. అధికారులు మాత్రం ఇది ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయమంటున్నారు. మంగళవారం నుంచి 72 మొబైల్‌ కేంద్రాల ద్వారా టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రానికి నెలకు 22 లక్షల డోసులు మాత్రమే కేంద్రం ఇస్తోందని చెబుతున్నారు. ఈ సంఖ్య పెరిగితే రోజువారీ డోసుల సంఖ్య కూడా పెరుగుతుంది.

  • ఇదీ చదవండి :

చేనేతల ఖాతాల్లోకి.. వైఎస్సార్​ నేతన్న నేస్తం నిధులు

ABOUT THE AUTHOR

...view details