ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై తీర్పు నేడే

By

Published : Aug 25, 2021, 6:21 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తన వాదన వినిపించారు. కోర్టు విధించిన షరతుల్లో ఒక్కటి కూడా ఉల్లంఘించలేదని.. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ వాదనగా ఉంది. విచక్షణ మేరకు పిటిషన్​పై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ తటస్థ వైఖరిని ప్రదర్శించింది. గత నెల 30న వాదనలు ముగిసిన ఈ పిటిషన్​పై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపైనా నేడు వాదనలు జరగనున్నాయి.

jagan bail
jagan bail

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు వీడనుంది. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నది రఘురామ ప్రధాన వాదన. సహ నిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని వాదించారు. పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు.

అదే సమయంలో రఘురామ కృష్ణరాజు పిటిషన్​కు విచారణ అర్హతే లేదని.. కొట్టివేయాలని సీఎం జగన్‌ తన వాదన వినిపించారు. ఎంపీగా అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినందుకే.. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిటిషన్ వేయగానే మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం రఘురామ ఉద్దేశాలను స్పష్టం చేస్తోందని జగన్ వాదించారు. సీఎంగా ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటున్నారు తప్ప.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన కారణం ఒక్కటి కూడా చూపలేదని జగన్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఊహించి.. పిటిషన్లు వేయడం తగదన్నారు. సీబీఐ మాత్రం తటస్థ వైఖరి ప్రదర్శించింది. పిటిషన్​లోని అంశాలను విచక్షణ మేరకు.. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టును కోరింది. జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్​పై నేడు విచారణ జరగనుంది. ఈనెల 22న ఇరువైపుల న్యాయవాదులు గడువు కోరడంతో విచారణ నేటికి వాయిదా పడింది. నేడు రఘురామ, విజయసాయిరెడ్డి తరఫు వాదనలు వినిపించనున్నారు.

ఇదీ చదవండి:jagan cbi case: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని.. సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details