సెలవుపై రైలులో ఇంటికెళ్తూ జవాన్ సాహసం.. అధికారులకు ఫస్ట్ అలర్ట్.. ఒంటరిగా రెస్క్యూ ఆపరేషన్

author img

By

Published : Jun 4, 2023, 11:44 AM IST

Odisha Train Accident

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై అందరికన్నా ముందుగా ఓ ఎన్​డీఆర్​ఎఫ్ జవాను అధికార యంత్రాంగానికి సమాచారం అందించినట్లు తెలిసింది. సెలవుపై కోరమాండల్ ఎక్స్​ప్రెస్​లో సొంతూరు వెళ్తున్న ఆయన దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్​డీఆర్​ఎఫ్​ ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు. సహాయక సిబ్బంది రాక ముందే ఒంటరిగా బాధితుల్ని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్​ ప్రారంభించారు.

Odisha Train Crash : ఒడిశాలో ప్రమాదానికి గురైన రైలులో ఉన్న జాతీయ విపత్తు స్పందన దళం-ఎన్​డీఆర్ఎఫ్ జవాను.. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తిని, సాహసాన్ని కనబరిచారు. దుర్ఘటన సమాచారాన్ని అందరికన్నా ముందుగా అధికారులకు అందించి.. సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభమయ్యేలా చూశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది క్షతగాత్రుల ప్రాణాలు నిలిచేందుకు కారణమయ్యారు.

సెలవు పెట్టి సొంతూరు వెళ్తూ..
ఎన్​.కె. వెంకటేశ్​ (39) తమిళనాడు వాసి. సరిహద్దు భద్రతా దళం-బీఎస్ఎఫ్​లో పని చేసేవారు. 2021లో ఎన్​డీఆర్​ఎఫ్​కు బదిలీ అయ్యారు. కోల్​కతాలోని ఎన్​డీఆర్​ఎఫ్​ రెండో బెటాలియన్​లో విధులు నిర్వర్తించే వెంకటేశ్.. తమిళనాడులోని స్వస్థలం వెళ్లేందుకు సెలవు పెట్టారు. బంగాల్​లోని హావ్​డా నుంచి కోరమాండల్ ఎక్స్​ప్రెస్​లో చెన్నై బయలుదేరారు.

మరికొన్ని గంటల్లో కుటుంబసభ్యుల్ని కలుస్తానన్న ఆనందంతో థర్డ్​ ఏసీ క్లాస్​లో ప్రయాణిస్తున్న వెంకటేశ్​కు శుక్రవారం సాయంత్రం అనూహ్య పరిస్థితి ఎదురైంది. కోరమాండల్ ఎక్స్​ప్రెస్​ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. అయితే.. వెంకటేశ్​ ఉన్న బీ-7 బోగీ పట్టాలు తప్పినా ఇతర కోచ్​లను ఢీకొట్టలేదు. ఫలితంగా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

యాక్సిడెంట్ షాక్​ నుంచి వెంకటేశ్​ వెంటనే కోలుకున్నారు. కోల్​కతా ఎన్​డీఆర్​ఎఫ్​ కార్యాలయంలోని తన సీనియర్​ ఇన్స్​పెక్టర్​కు కాల్ చేశారు. ఏం జరిగిందో చెప్పారు. ప్రమాద తీవ్రతను తెలియజేసేలా కొన్ని ఫొటోలు తీసి పంపారు. దుర్ఘటన ఎక్కడ జరిగిందో సులువుగా తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా లైవ్​ లొకేషన్​ షేర్ చేశారు. వెంకటేశ్​ సమాచారంతో కోల్​కతాలోని ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక యంత్రాంగం సహా సంబంధిత విభాగాలు అన్నింటినీ అలర్ట్ చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు.

వారి కోసం వేచి చూడకుండా..
వెంకటేశ్​ సమాచారం అందించిన దాదాపు గంట సేపటికి ఎన్​డీఆర్​ఎఫ్​, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకోగలిగాయి. అయితే అప్పటివరకు వారి కోసం వేచి చూడలేదు వెంకటేశ్. ఒంటరిగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

"రైలు భారీ కుదుపునకు గురైనట్లు నాకు అనిపించింది. నా బోగీలోని కొందరు ప్రయాణికులు కింద పడిపోయారు. ముందు ఒక ప్రయాణికుడ్ని బయటకు తీసుకొచ్చి.. రైలు పట్టాల పక్కన ఉన్న దుకాణం దగ్గర కూర్చోబెట్టాను. వెంటనే ఇతరులకు సాయం చేసేందుకు రైలులోకి వెళ్లాను. దగ్గర్లోని ఔషధ దుకాణ యజమాని సహా కొందరు స్థానికులు అసలైన రక్షకులు. బాధితులను రక్షించేందుకు వారికి చేతనైందల్లా చేశారు. చిమ్మచీకట్లో వారంతా సెల్​ఫోన్​ వెలుతురులో ప్రయాణికులకు సాయం చేశారు" అని నాటి ఘటనను వివరించారు వెంకటేశ్.

ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు సాధ్యమైనంత త్వరగా వైద్య సాయం అందించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సకాలంలో చికిత్స అందితేనే ప్రాణం నిలుస్తుంది. అందుకే ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అలాంటి గోల్డెన్ అవర్​లో.. ఎన్​డీఆర్​ఎఫ్​ జవాన్ వెంకటేశ్ అనేక మంది ప్రాణాలు కాపాడారని అందరూ కొనియాడుతున్నారు. "యూనిఫాంలో ఉన్నా లేకపోయినా ఎన్​డీఆర్​ఎఫ్​ జవాన్​ ఎప్పుడూ డ్యూటీలోనే ఉంటారు" అంటూ వెంకటేశ్​ను ప్రశంసించారు ఎన్​డీఆర్​ఎఫ్​ డీఐజీ మొహ్సేన్ షాహిది.

ఇవీ చదవండి : వేగంగా ట్రాక్​ పునరుద్ధరణ పనులు.. రాత్రంతా అక్కడే ఉన్న రైల్వే మంత్రి

Odisha Train Accident : దిల్లీ నుంచి వైద్యులు, మందులు.. ఎయిర్​ ఫోర్స్​ విమానంలో భువనేశ్వర్​కు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.