తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సుపై హత్యాచారం - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నర్సుపై బిహార్‌ వాసి హత్యాచారానికి పాల్పడినట్లు తేల్చిన పోలీసులు - కిటికీలోంచి యువతి గదిలోకి దూరి అత్యాచారం, హత్య చేసి పరారైన కిరాతకుడు - సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

Nurse Sirisha dies in Pahad Sharif
పహాడీషరీఫ్‌లో నర్సు మృతిలో వీడిన మిస్టరీ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : August 30, 2026 at 5:02 PM IST

Updated : August 31, 2026 at 2:37 PM IST

Nurse Murder Case In Hyderabad : తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ నర్స్ శిరీష హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు శిరీష దారుణంగా హత్యకు గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంచలన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే? : కొత్తగూడెం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి గత 7 నెలలుగా తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆస్పత్రి సమీపంలో ఉన్న సిబ్బంది క్వార్టర్స్‌లో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేది. అయితే ఈ నెల 28న సాయంత్రం విధులు ముగించుకుని గదికి వచ్చిన యువతి మరుసటి రోజు డ్యూటీకి హాజరుకాలేదు. ఆస్పత్రి నుంచి ఫోన్ చేసినా తీయకపోవడంతో యాజమాన్యం పక్క గదిలో ఉండే మరో నర్సుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆమె రూమ్ డోర్ ఇంకా తీయలేదని చెప్పడంతో మళ్లీ ఫోన్ చేయలేదు. కాగా మహేశ్వరంలో ఉండే తన బంధువు అమెకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో హాస్పిటల్‌ వద్దకు వచ్చి ఆరా తీశారు.

హాస్పిటల్ సిబ్బంది కూడా అదే చెప్పడంతో యువతి బంధువు క్వార్డర్స్ వద్దకు వచ్చాడు. యువతి తలుపు ఎంత కొట్టినా తెరవకపోవడంతో కిటికిలో నుంచి చూడగా అమ్మాయి విగతజీవిగా పడి ఉండటం గమనించాడు. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. యువతి పిన్ని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

నిజాన్ని అంగీకరించిన నిందితుడు : దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తి రాత్రి ఒంటి గంట సమయంలో అనుమానాస్పదంగా ఆస్పత్రి క్వార్టర్స్​వైపు వెళ్లడం గమనించారు. అదే ప్రాంతంలో ఉంటున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత కొన్నేళ్ల పాటు ఉప్పల్‌‌లో నివాసం ఉన్నాడు. రెండు నెలల కిందట తుక్కుగూడ వచ్చి బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతో ఆమె బిహార్‌లోని స్వస్థలానికి వెళ్లింది. దీంతో నేరస్థుడు ఒంటరిగా ఉంటున్నాడు. సైనా ఉల్లాను పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు.

అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై అత్యాచారం : నిందితుడు ఉండే నివాసానికి ఎదురుగానే మృతురాలు ఉంటున్న ఆస్పత్రి క్వార్టర్స్ ఉండటంతో తరచూ గమనిస్తుండే వాడు. అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉన్న సైనా ఉల్లా, మద్యం సేవించి ఈ నెల 28న రాత్రివేళలో యువతి ఉన్న గదివైపు వెళ్లాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికిలో నుంచి లోపలికి ప్రవేశించాడు. మృతురాలికి సైనా ఉల్లా అలికిడి వినిపించి కేకలు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో నేరస్థుడు ఆమె గొంతు నులిమాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై సైనా అత్యాచారం చేసి అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కాగా పహడీ షరీఫ్ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుణ్ని వెతికి పట్టుకున్నారు.

"నర్సు శిరీష అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సైనా ఉల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీల పరిశీలనకు 5 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశాం. సైనా ఉల్లాపై అనుమానం రావడంతో అతణ్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి ఫోన్‌లో ఇతర నర్సుల ఫొటోలు కూడా గుర్తించాం. శిరీషతో పాటు గదిలో ఉండే కేరళకు చెందిన మరో నర్సు ఓనం పండుగకు స్వగ్రామానికి వెళ్లింది. నిందితుడు ఇదే అదనుగా భావించి శిరీష గదిలోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు గుర్తించాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా స్పీడ్ ట్రయల్ జరిగేలా చర్యలు తీసుకుంటాం" - రాజేశ్​, శంషాబాద్ డీసీపీ

కుటుంబ సభ్యుల ఆందోళన : మరోవైపు యువతిపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానిక రాజకీయ నేతలు ఆందోళనకు దిగారు. మృతురాలు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసు‌లు తెలిపారు.

శిరీష హత్య కేసులో ఏ-1గా ఆడపడుచు - ఎందుకు చంపిందో వివరించిన ఏసీపీ

అమెరికాలో హైదరాబాద్​ యువతి హత్య - ఆగ్రాలో ఎఫ్​బీఐ, సీబీఐ సాయంతో నిందితుడి అరెస్ట్‌

Last Updated : August 31, 2026 at 2:37 PM IST