ETV Bharat / state

శిరీష హత్య కేసులో ఏ-1గా ఆడపడుచు - ఎందుకు చంపిందో వివరించిన ఏసీపీ

మలక్‌పేటలో నర్సు శిరీష హత్య కేసులో ముగ్గురు అరెస్టు - కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్యాం సుందర్‌

ACP Shyam Sundar on Malakpet Murder Case
ACP Shyam Sundar on Malakpet Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 5, 2025 at 7:21 PM IST

|

Updated : March 5, 2025 at 7:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

ACP Shyam Sundar on Malakpet Murder Case : మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఏసీపీ శ్యాం సుందర్‌ తెలిపారు. శిరీష భర్త వినయ్‌తో పాటు అతని సోదరి సరిత, మరో సోదరి కుమారుడు నిహాల్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు వివరాలను ఏసీపీ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.

పరస్పరం ఘర్షణ : మార్చి ఒకటో తేదీ రాత్రి వినయ్‌ సోదరి సరిత, శిరీష మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందని, నర్సుగా పని చేస్తున్న శిరీష పలు చోట్ల ఉద్యోగాలు మానేసిందని శ్యాం సుందర్‌ తెలిపారు. తరచూ ఉద్యోగాలు ఎందుకు మానేస్తున్నావని, నిలకడ లేదా నీకు అని సరిత గట్టిగా నిలదీసిందని, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, నీ సంగతి తేలుస్తా అంటూ శిరీష కూడా ఎదురు దాడికి దిగడంతో పరస్పరం ఘర్షణ పడ్డారని, ఆ తరువాత ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయారని వివరించారు.

నిందితురాలిని రక్షించేందుకు వారిద్దరూ సాయం : గొడవ తరువాత శిరీషకు నిద్ర పట్టడం లేదని సరిత వద్ద ఉండే మత్తు ఇంజెక్షన్‌ అడిగిందని, అప్పటికే శిరీషపై కక్ష పెంచుకున్న సరిత మత్తు ఇంజెక్షన్‌ డోసు ఎక్కువగా ఇచ్చిందని అన్నారు. శిరీష మత్తులోకి జారుకున్న తరువాత దిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసిందని, మరుసటిరోజు ఉదయం శిరీష భర్త, సోదరుడికి జరిగిన విషయం చెప్పింది. నిందితురాలిని రక్షించేందుకు వినయ్​తో పాటు మరో సోదరి కుమారుడు నిహాల్​ అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, తన గురించి భర్తకు చెడుగా చెబుతుందని భయపడిన సరిత శిరీషను హతమార్చినట్టు దర్యాప్తులో తేలిందని ఏసీపీ వివరించారు. సరిత ఏ-1గా కేసు నమోదు చేశామని తెలిపారు.

"నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేసింది. తరచూ ఉద్యోగాలు ఎందుకు మానేస్తున్నావని శిరీషను సరిత నిలదీసి తిట్టింది. నీ చరిత్ర అంతా నాకు తెలుసులే అంటూ సరితను శిరీష తిట్టింది. నీ గురించి అన్ని విషయాలు బయటపెడతానని సరితను శిరీష బెదిరించింది. శిరీష అలా అనటంతో సరిత మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి తర్వాత దిండుతో అదిమిపెట్టి చంపింది."- శ్యాం సుందర్‌, ఏసీపీ

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో చిన్న కూతురు శిరీష (32)ను కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్‌ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను శిరీష ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహం ఇష్టం లేని ప్రొఫెసర్‌ కుటుంబం శిరీషను దూరంగా ఉంచారు. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో జీవితం మొదలుపెట్టారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తోంది. 2019లో వారికి ఓ పార పాప జన్మించింది.

మలక్​పేట వివాహిత శిరీష హత్య కేసులో బిగ్గెస్ట్​ ట్విస్ట్ - ఆడపడుచే హంతకురాలు!

Last Updated : March 5, 2025 at 7:31 PM IST