ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెన్నా సంస్థతో కుమ్మక్కై భారీగా వసూళ్లు రాబట్టిన జగన్‌- సిమెంట్ కంపెనీ ఏర్పాటు పేరుతో దోపిడీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 8:11 AM IST

Updated : Jan 29, 2024, 12:15 PM IST

Penna Cement Organization Jagan Extortion: అనంతపురం, కర్నూలు, తాండూరు ప్రజల వెనకబటుతనం, పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న జగన్‌ బృందం వారిని బాగు చేస్తామని చెప్పి భారీ దోపిడీకి పన్నాగం పన్నింది..! సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని.. దానికి సున్నపురాయి కావాలని కోరగా.. అప్పటి సీఎం వైఎస్ విశేషాధికారాలను అడ్డగోలుగా ఉపయోగించారు. కుమారుడి కంపెనీల్లోకి పెట్టుబడులు తెచ్చుకోవడానికి.. పేదల జీవనాధారమైన భూములు లాక్కున్నారు. పరిశ్రమ, గనుల పేరిట సిమెంట్ సంస్థకు 18 వందల 12 ఎకరాలు కట్టబెట్టారు. ఇదే పెన్నా కుంభకోణం..! పేదలను ఉద్ధరిస్తామని వచ్చిన పెద్దలు.. గద్దల్లా మారి.. అధికార బలంతో రైతుల భూములు లాక్కున్న తీరును సీబీఐ స్పష్టంగా వివరించింది.

Penna_Cement_Organization_Jagan_Extortion
Penna_Cement_Organization_Jagan_Extortion

పెన్నా సంస్థతో కుమ్మక్కై భారీగా వసూళ్లు రాబట్టిన జగన్‌- సిమెంట్ కంపెనీ ఏర్పాటు పేరుతో దోపిడీ

Penna Cement Organization Jagan Extortion: అనంతపురం జిల్లా యాడికి మండలంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందే.. భూముల కోసం పెన్నా సిమెంట్స్ యాజమాన్యం చక్రం తిప్పింది. పరిశ్రమ ఏర్పాటుకు మార్కెట్ ధరతో ప్రభుత్వ భూమి బదలాయించాలని.. 2006 ఏప్రిల్‌ 22న పెన్నా సిమెంట్స్ జనరల్ మేనేజర్‌.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము పట్టా భూములను కొన్నామని, వాటి పక్కనఉన్న కుందనకోట, గుడిపాడు, కమలపాడులో భూమిని కేటాయించాలని కోరింది.

ఎంఆర్​వో ముందస్తు సమాచారంతో ఎసైన్డ్‌ భూములను నామమాత్రపు ధరకే కొట్టేశారు. తాము గుర్తించిన భూములపై నివేదికను కలెక్టర్‌కు సమర్పించాల్సిన ఎంఆర్​వో ఎల్లమ్మ.. అందులోని వివరాలను కంపెనీ ప్రతినిధులతో పంచుకున్నారు. దాంతో.. ఎసైన్డ్ భూములున్న రైతులను కలిసిన కంపెనీ ప్రతినిధులు.. సంస్థ కాంపౌండ్ నిర్మిస్తోందని.. పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదని బెదిరింపులకు దిగారు. ఎకరానికి 20 వేల నుంచి 60 వేల రూపాయల వరకు చెల్లించి.. రైతులతో ఓచర్లపై సంతకాలు తీసుకున్నారు. తర్వాత.. అదే రైతులతో ఆయా భూములు తమకు వద్దని.., స్వాధీనం చేసుకోవాలని అర్థిస్తూ ఎంఆర్​వోకు అర్జీలు పెట్టించారు. దాంతో ప్రభుత్వానికి అసైన్డ్‌ భూముల సేకరణ అవసరం తప్పింది.

ఈ నేపథ్యంలోనే.. తమకు 237 ఎకరాలు కేటాయించాలని ప్రతాప్‌రెడ్డి నేరుగా సీఎం వైఎస్‌కు 2007 డిసెంబర్‌లో లేఖ ఇచ్చారు. ప్రతాప్‌రెడ్డి వినతిని పరిశీలించాలని.. సీఎం కార్యాలయం వెంటనే రెవెన్యూ శాఖకు మెమో పంపుతూ.. సీసీఎల్​ఏ, జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసింది. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల ఆమోదం లేకుండానే.. భూబదలాయింపు ప్రతిపాదనలపై సీసీఎల్​ఏ అడిగిన వివరణలను డీఆర్​ఓ సుదర్శన్‌రెడ్డి నేరుగా పంపించారు.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

పెన్నాకు 231.09 ఎకరాలను.. ఎకరా 50 వేల రూపాయల చొప్పున.. ఎసైన్డ్‌ చట్ట నిబంధనల ప్రకారం కేటాయించవచ్చని.. 2008 జూన్‌ 4న సాధికారిక కమిటీ సిఫారసు చేసింది. సీఎం వైఎస్‌ ఆదేశంతో.. మంత్రివర్గం ఆమోదంతో భూములు కేటాయిస్తూ.. రెవెన్యూశాఖ జీవో జారీ చేసింది. ప్రభుత్వమే కనుక భూములు సేకరించి ఉంటే.. వారికి ఇంకా ఎక్కువ మొత్తంలో పరిహారం అంది ఉండేది. ఈ మేరకు ఆ పేద రైతులకు ఆర్థికంగా నష్టం కలిగింది.

పెన్నాకు సున్నపురాయి లీజుల మంజూరులోనూ వైఎస్‌ తనదైన శైలిలో దందా నడిపారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బూర్గులలోని కౌలపల్లిలో వెయ్యి 32.31 ఎకరాలలో 20 ఏళ్లపాటు.. సున్నపురాయి గనుల లీజు కోసం 2005 అక్టోబర్‌ 5న అల్ట్రాటెక్ సిమెంట్‌ దరఖాస్తు చేసుకుంది. అలాగే.. అక్కడికి సమీపంలోని 47.53 ఎకరాల్లో లీజు కొరుతూ.. 2007 మార్చిలో పీ.లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అర్జీ పెట్టుకున్నారు. వీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతాలు కూడా కలిసేలా ఉన్న 800 ఎకరాల్లో ప్రాస్పెక్టింగ్ లైసైన్స్‌ కోరుతూ పెన్నా సిమెంట్స్ లిమిటెడ్‌ 2007 జూన్‌ 4న దరఖాస్తు చేసుకుంది.

దీనిపై భూగర్భ గనుల శాఖ సహాయ డైరెక్టర్‌ సర్వే నిర్వహించి.. 753 ఎకరాల భూమిని.. పెన్నాకు మూడేళ్ల ప్రాస్పెక్టింగ్‌ లీజు మంజూరు చేయాలని డైరెక్టర్‌కు సిఫార్సు చేశారు. అల్ట్రాటెక్‌ మైనింగ్‌ లీజును తిరస్కరించాలని స్పష్టం చేశారు. అల్ట్రాటెక్‌ నుంచి ఉపసంహరణ లేఖ లేకుండానే.. అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి పెన్నా లీజును.. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సిఫారసు చేశారు. అల్ట్రాటెక్‌ నుంచి ఉపసంహరణ లేఖకు పట్టుబట్టకుండానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించేశారు. మంత్రి అనుమతి లేకుండానే.. పెన్నాకు 304.74 హెక్టార్ల లీజును మంజూరు చేస్తూ.. శ్రీలక్ష్మి 2008 మార్చిలో జీవో ఇచ్చారు.

వేల కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ జగన్‌ సన్నిహితులకే- స్మార్ట్​గా దోపిడీ

తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరులో రద్దయిన సున్నపురాయి మైనింగ్ లీజులను.. పెన్నాకు పునరుద్ధరించడంలోనూ అధికార దుర్వినియోగమే జరిగింది. తాండూరులోని వెయ్యి 21.26 ఎకరాలలో వాల్‌చంద్‌ కంపెనీకి చెందిన సున్నపురాయి మైనింగ్‌ లీజుల వ్యవహారం దిల్లీ కోర్టులో ఉండేది. ఈ మధ్యలో మైనింగ్ లీజును తిరిగివ్వడానికి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయగా.. వాల్‌చంద్‌ కోరిన గనులకే విశాఖ సిమెంట్ ఇండస్ట్రీస్ దరఖాస్తు చేసుకుంది.

హైకోర్టులో కేసు పెండింగులో ఉండగానే.. వాల్‌చంద్‌ వాటాలను కోటీ 21 లక్షల రూపాయలకు సేకరించడానికి.. ప్రతాప్‌రెడ్డికి చెందిన పయనీర్‌ బిల్డర్స్‌ ఒప్పందం చేసుకుంది. కార్యదర్శి సిఫారసుతో నిమిత్తం లేకుండానే సీఎం విచక్షణాధికారాన్ని ఉపయోగించి, లీజులను తిరస్కరించిన ఉత్తర్వులను పున:సమీక్షిస్తామని ఏపీ ప్రభుత్వం ద్వారా దిల్లీ కోర్టుకు విన్నవించడంతో విషయం తిరిగి రాష్ట్ర పరిధిలోకి వచ్చింది.

అనంతరం వాల్‌చంద్‌ తాండూరు సిమెంట్‌ కంపెనీ పేరును నిబంధనలకు విరుద్ధంగా.. పెన్నా తాండూరు సిమెంట్ కంపెనీగా మార్చుతూ అప్పటి కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు. తర్వాత మైనింగ్‌ ప్లాన్‌, పర్యావరణ అనుమతులు సమర్పించాలన్న షరతులను పట్టించుకోకుండా 822.13 ఎకరాలకు లీజు మంజూరు చేస్తూ 2008లో జీవో వచ్చింది.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 150 గదులతో 4 నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి పయనీర్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో 2003లో ప్రభుత్వానికి అవగాహన ఒప్పందం కుదిరింది. దాని గడువు 2005లోనే ముగిసినా.. ప్రతాప్‌రెడ్డి కోరికతో అప్పటి సీఎం వైఎస్‌.. రాయితీలతో కూడిన అనుమతి ఇప్పించారు.

2006 నుంచి 2009 మధ్య.. పెన్నా గ్రూపునకు చెందిన పీఆర్​ ఎనర్జీ హోల్డింగ్ సంస్థ నుంచి జగన్‌ కంపెనీల్లోకి 68 కోట్ల రూపాయల పెట్టుబడులు మళ్లాయి. దీనిపై.. సీబీఐ వినతి మేరకు ఆయా ఖాతాలను రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ తనిఖీ చేసి.. కంపెనీ చట్టం, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేల్చింది. ఇందులో 58 కోట్లు పెన్నా గ్రూపు, దాని అనుబంధ సంస్థల నుంచి వచ్చాయంది. మిగతా 10 కోట్లను.. 2006లో ఆన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌ సీఈవో కె.రామమోహన్‌రావు పెట్టుబడిగా పెట్టారంది.

ఈ అవినీతి తతంగంపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొంది. జగన్‌ను ఏ1, విజయసాయిరెడ్డిని ఏ2గా, పుత్తంరెడ్డి ప్రతాప్‌రెడ్డిని ఏ3గా చేర్చారు. నిందుతుల్లో ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సైతం ఉన్నారు. సీబీఐ 2011 ఆగస్టు 17న ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం 2013 సెప్టెంబర్‌ 30న తొలి అభియోగపత్రం దాఖలు చేసింది. ఈడీ కేసు రుజువైతే మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనల కింద ఆస్తులను కేంద్రం జప్తు చేస్తుంది.

నేరం రుజువైతే యావజ్జీవ జైలు శిక్షపడే అవకాశముంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రెండేళ్లకు మించి శిక్ష పడితే.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష కాలం పూర్తయినా.. ఆరేళ్లదాకా తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. అలాంటి ఈ కేసు విచారణ ముందుకెళ్లకుండా నిందితులు ఇప్పటి వరకు 286 సార్లు వాయిదాలు తీసుకున్నారు. ఈడీ నమోదు చేసిన కేసులోనూ 176 సార్లు వాయిదాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ దశలోనే ఉంది.

సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్‌ - 381వ సారి వాయిదా

Last Updated :Jan 29, 2024, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details