ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం పిలుపు - 'చలో విజయవాడ' భగ్నం చేసేందుకు యత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 7:47 AM IST

Government Meeting With Employees Unions : ఏపీజేఏసీ ఈ నెల 27న 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చింది. మరోవైపు చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Government_Meeting_With_Trade_Unions
Government_Meeting_With_Trade_Unions

Government Meeting With Employees Unions : పీఆర్సీ సహా పెండింగ్ డీఏలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ అహ్వానించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 2 వద్ద మంత్రుల కమిటీ ఉద్యోగలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నట్టు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు పంపించిన లేఖలో పేర్కొంది.

పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్​లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 12 పీఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవటంతో ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఎన్​జీవో నేతృత్వంలోని ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందజేసింది.

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - రేపు మంత్రుల బృందం భేటీ

బుధవారం విజయవాడలోని ఎన్జీఓ కార్యాలయంలో ఈ నెల 27 తేదీన 'చలో విజయవాడ(Chalo Vijayawada)' కార్యక్రమాన్ని చేపడతామని ఏపీజేఏసీ స్పష్టం చేసింది. అటు ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం సైతం కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. ఈ సమావేశంలో మధ్యంతర భృతికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు ఉద్యోగులు, పెన్షనర్లకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఓ కీలక అధికారి నాయకులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎలా చేస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.

27న ప్రభుత్వ ఉద్యోగుల 'చలో విజయవాడ' - పోస్టర్​ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని ఏపీజేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ రోజున వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరేవరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ కోరడం లేదని, తాము దాచుకున్న డబ్బులు ఇస్తే చాలని మాత్రమే అడుగుతున్నామని అన్నారు. చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం నిధులు ఇస్తే నోటీసులు ఇచ్చే పని ఉండదు కదా?, చలో విజయవాడ జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడుతోందా? అని ఆయన ప్రశ్నించారు.

చలో విజయవాడ అనుమతి కోసం మరోసారి సీపీని కలుస్తాం-ఏపీ సీపీఎస్

ABOUT THE AUTHOR

...view details