ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడలో అగ్నిప్రమాదం - ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో భారీగా వ్యాపించిన మంటలు - Fire Accident in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 11:27 AM IST

Updated : Mar 26, 2024, 2:16 PM IST

Fire Accident in Vijayawada: విజయవాడ ఆటోనగర్​లోని ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Fire_Accident_in_Vijayawada
Fire_Accident_in_Vijayawada

Fire Accident in Vijayawada: విజయవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్​లోని ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.

ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం సుమారు 8.50 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో అగ్నిప్రమాదం- ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో భారీగా వ్యాపించిన మంటలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:ఆటోనగర్​లోని ఆయిల్‌ శుద్ధి కేంద్రంలో కంపెనీల్లో వినియోగించిన మడ్ ఆయిల్​ను శుద్ధి చేసి గ్రీజు తయారు చేస్తారు. ప్రతిరోజు ఉదయం గ్రీజు శాంపిల్స్​ను పరీక్షిస్తారు. ఈరోజు కూడా సిబ్బంది వచ్చి పరిశీలించారు. అయితే హఠాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన పొగలతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

ఆయిల్ కావటంతో ఫోమ్​ను వినియోగించి 5 ఫైరింజన్ల సహాయంతో సుమారు గంటన్నర పాటు ఫైర్ ఫైటింగ్ చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. పెట్రో కెమికల్ గుణాలుండటంతో మంటల వేడికి డ్రమ్ములు ఎగిసి పడ్డాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కంపెనీల్లో వినియోగించిన మడ్ ఆయిల్​ను కొనుగోలు చేసి నిల్వ ఉంచి, వాటిని శుద్ధి చేసి ఆయిల్, గ్రీజును తయారు చేస్తారు. దీనిపై పొల్యూషన్, అగ్నిమాపక శాఖ, రెవిన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సిన ఉంటుంది.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్నిమాపక శాఖ నుంచి కంపెనీకి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పరిశీలనలు చేపట్టిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చుట్టూ ఎటువంటి రక్షణ లేదని, అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు అందుబాటులో ఉంచలేదని అధికారులు తెలిపారు. కంపెనీ యజమానులను విచారించి అనుమతుల వివరాలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.

Electrical Short Circuit in Anantapur District: మరోవైపుఅనంతపురం జిల్లా ఉరవకొండ పాతబస్టాండ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ హోటల్‌, గాజుల దుకాణం దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగటంతో హోటల్‌ పైకప్పు పూర్తిగా కాలిపోయి కిందపడింది. హోటల్‌ పక్కనే ఉన్న గాజుల దుకాణంలోకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు.

Last Updated :Mar 26, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details