ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ ఉద్యోగులతో జగన్‌ చెడుగుడు - జీతాల కోసం ప్రతి నెలా పడిగాపులే !

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 7:15 AM IST

CM Jagan Cheated Government Employees : ఎన్నికలకు ముందు ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను ఎన్ని రకాలుగా వేధించాలో అంతా చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్​ను పునరుద్ధరిస్తానని చెప్పి మరచిపోయారు.

CM_Jagan_Cheated_Government_Employees
CM_Jagan_Cheated_Government_Employees

CM Jagan Cheated Government Employees :గత పాలనలో గంట కొట్టినట్టుగా ఒకటో తేదీన వేతనం, పీఎఫ్‌, జీపీఎఫ్‌, డీఏ తదితర సదుపాయాలు. పిలిచి మరీ రుణాలిచ్చే బ్యాంకులు, సకాలంలో పదవీ విరమణ ప్రయోజనాలు, లెక్క తప్పకుండా వచ్చే పింఛను, డీఏ చెల్లించాలని, ధరలకు అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరే స్వేచ్ఛ. మరీ ఇప్పుడు సీఎం జగన్‌ పాలనలోఎప్పుడొస్తుందో తెలియని వేతనం. పీఎఫ్‌, జీపీఎఫ్‌, ఆర్జిత సెలవు బిల్లుల ఊసే లేదు. పెండింగ్‌లో డీఏలు, పీఆర్సీ బకాయిలు. సకాలంలో అందని పదవీ విరమణ ప్రయోజనాలు. పింఛను కోసం నెలల తరబడి నిరీక్షణ. ఏదైనా అడగాలంటేనే భయం. వెరసి, వేతన జీవులు, వేదన జీవులుగా మారిన దుస్థితి !

"ఉద్యోగ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరికాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి"- 2022, నవంబరు 27న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

AP Government Employees Struggle :హడావుడిగా బస్సు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడి పర్సును ఎవరో కొట్టేస్తారు. టికెట్‌ తీసుకునేందుకు జేబులో వెతగ్గా పర్సు కనిపించలేదు. పర్సు, అందులోని వెయ్యి రూపాయలు పోయాయని బాధపడుతూ విషయాన్ని కండక్టర్‌కు చెప్తారు. తనను గమ్యస్థానం చేర్చాలని, అక్కడికి వెళ్లాక ఛార్జీ మొత్తాన్ని చెల్లిస్తానని వేడుకుంటారు. కుదరదంటాడు కండక్టర్‌. అంతలో ఓ పెద్దాయన లేచి 'ఇదిగో ఆ వ్యక్తి ఊరెళ్లడానికయ్యే ఛార్జీ' అంటూ కండక్టర్‌కు 200 రూపాయలు ఇస్తాడు. దానికి ఉప్పొంగిన ప్రయాణికుడు 'బాబూ! మీరు మహానుభావులు' అంటూ చేతులు జోడించి నమస్కరిస్తారు. దానికి ఆ పెద్దాయన 'ఏం పర్వాలేదు. ఇదిగో దారిలో తిండి, ఖర్చులకు పనికొస్తాయి' అంటూ మరో 100 రూపాయలును చేతిలో పెడతాడు. ఉబ్బితబ్బిబ్బయిన ప్రయాణికుడు పెద్దాయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే పర్సు కొట్టేసింది ఆ పెద్దాయనే!!

"నాడు ఠంచనుగా.. నేడు టెన్షన్​గా".. జీతాల చెల్లింపులో ఎందుకీ అలసత్వం.!

ఈ పెద్దాయనలాగే ఉంది వేతన జీవుల విషయంలో జగన్‌ తీరు. మొదట ఉద్యోగుల ప్రయోజనాల్లో కోత వేస్తారు. 'అయ్యో అదనపు ప్రయోజనాల సంగతి తర్వాత అసలు వచ్చే వాటికే కోత పెడితే ఎలా?' అంటూ వారు ఆందోళన చెందే పరిస్థితి కల్పిస్తారు. ఆ కోత పెట్టిన వాటిల్లోంచే కొంత తిరిగి ఇచ్చి ఉద్యోగులను తామే ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకొంటారు. ఉద్యోగ సంఘాల నేతలతోనే భజన చేయించుకుంటారు. 11వ పీఆర్సీలో మొదట ఇంటి అద్దె భత్యం, అదనపు క్వాంటం పింఛనులో కోత విధించారు. తర్వాత హెచ్‌ఆర్‌ఏ పెంపు కాదు కదా ఉన్నదాన్నే ఇవ్వాలంటూ ఉద్యోగులు కోరే స్థితికి జగన్‌ తీసుకురావడం గమనార్హం.

ఉద్యోగుల సొమ్మును వాడేసుకుంటున్న సర్కారు : ఎన్నికలకు ముందు ఉద్యోగులకు జగన్‌ అనేక హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని ఎన్ని రకాలుగా వేధించాలో అంతా చేశారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తానని చెప్పి మరచిపోయారు. ఈ ఐదేళ్లలో ఒక్క డీఏ బకాయినీ విడుదల చేయలేదు. నెల జీతాలు, పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. విశ్రాంత ఉద్యోగుల పింఛనుదీ అదే పరిస్థితి. జీపీఎఫ్‌, పీఎఫ్‌ డబ్బుల కోసం పెట్టే బిల్లుల మంజూరుకూ దిక్కు లేదు. ఉద్యోగుల సొమ్మును సర్కారు వాడేసుకోవడంతో అవసరాలకు వారు అవస్థలు పడాల్సి వచ్చింది. సీపీఎస్‌ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన డబ్బును గత ఏప్రిల్‌ నుంచి సంబంధిత ఖాతాల్లో జమ చేయడం లేదు. సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధమవ్వాలని ఆయా సంఘాలు పిలుపునిస్తే పోలీసులతో అణచివేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది.

Employees not Received Salaries జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆందోళన ..

ఒక్కో ఉద్యోగికి జగన్‌ సర్కారు సరాసరిన రూ.రెండున్నర లక్షలకుపైగా బకాయి పడింది. 2023కు సంబంధించిన జనవరి, జులై డీఏలను మంజూరు చేయలేదు. 2022 జులైలో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు ప్రయోజనాలు అందలేదు.

  • 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించిన 66 నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపి ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను మినహాయించేశారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, చెల్లించలేమంటూ 2020 జనవరి, జులై, 2021 జనవరికి రావాల్సిన మూడు డీఏలను ఎగ్గొట్టింది.
  • 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి.. జీతాలు భారీగా పెరిగినట్లు చూపింది. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇవ్వలేదు.
  • 2022లో ఇవ్వాల్సిన జనవరి, జులై డీఏల బకాయిలు రూ.4,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జులైలో ఇచ్చిన డీఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలే అందలేదు.
  • 2023లో రెండు డీఏలు రావాల్సి ఉంది. వీటిని ఎప్పుడు ప్రకటిస్తుందో చెప్పడం లేదు.
  • సీపీఎస్‌, పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.2,100 కోట్లు ఉన్నాయి.

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) ఉద్యోగులకు పాత పింఛనును అమలు చేస్తామన్న జగన్‌ ఆ హామీని తుంగలో తొక్కేశారు. ఉద్యోగులు వద్దంటున్నా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ పథకాన్ని తీసుకొచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగుల జీతం నుంచి ప్రభుత్వం 10శాతం మినహాయించి దానికి తాను మరో 10 శాతం కలిపి ఉద్యోగి ప్రాన్‌ ఖాతాలో వేస్తోంది. గత ఏప్రిల్‌ నుంచి ఆ నిధులను జమ చేయకపోగా, ఉద్యోగుల వేతనాల నుంచి తీసుకున్న 10 శాతాన్నీ వాడేసుకుంటోంది. ఉద్యోగులు, ప్రభుత్వం వాటా కలిపి రూ.2,800కోట్లను ప్రాన్‌ ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 10% నుంచి 14%కు పెంచాలన్న కేంద్రం ఆదేశాలను అమలు చేయడం లేదు. సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను 90 శాతం నగదు రూపంలో చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఈ మొత్తంపై వడ్డీ, ఇతర ప్రయోజనాలను కోల్పోతున్నారు.

2004, సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్‌ అమల్లోకి వచ్చింది. దీనికి ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ సుమారు 10 వేల మంది సెప్టెంబరు తర్వాత ఉద్యోగాల్లో చేరారు. వీరికి పాత పింఛనును అమలు చేయాలన్న కేంద్రం సూచనలనూ రాష్ట్రం బేఖాతరు చేస్తోంది.

రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలుగా ఇవ్వాల్సినవే రూ.200కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ గడువు డిసెంబరుతో ముగిసింది. దీంతో పాత వాటికే దిక్కులేకపోగా, ఇప్పుడు కొత్తగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

పదవీ విరమణ చేసినా :'సమాన పనికి సమాన వేతనం' ప్రాతిపదికన పొరుగుసేవల వారికి న్యాయం చేస్తానని 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక జీతం పెంచాలని కోరితే.. ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగిస్తున్నారు.

విభజించి - నోళ్లు మూయించి :పోలీసు నిర్బంధాలను అధిగమించి 2022 ఫిబ్రవరి 3న ఉద్యోగులు వేల మంది తరలివచ్చి 'చలో విజయవాడ (Chalo Vijayawada)'ను నిర్వహించారు. ఈ ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వం కాస్త దిగొచ్చి పీఆర్సీ చర్చల్లో కొంత ప్రయోజనాలు కల్పించినా, ఉద్యోగులకు చివరికి అన్యాయమే జరిగింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చి విభజించు.. పాలించు సూత్రాన్ని జగన్‌ సర్కారు ఆచరిస్తోంది.

వేల కోట్ల బకాయిలు :ఉద్యోగులకు ప్రభుత్వం ఏపీజీఎల్‌ఐ రుణాలు, జీపీఎఫ్‌, పీఎఫ్‌ బిల్లులు, అడ్వాన్సులు, పీఆర్సీ, ఈఎల్‌, డీఏ బకాయిలు తదితరాలన్నీ కలిపి రూ.21 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆయా సమస్యల విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భాల్లో ఎంతోకొంత ఇస్తామని ఊరడించడం, తర్వాత పట్టించుకోకపోవడం జగన్‌ సర్కారుకు పరిపాటిగా మారింది. ఒక అడుగు ముందుకేసి రాబోయేది మళ్లీ తామేనని, అప్పుడు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతోంది. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలవుల పెండింగ్‌ బకాయిలు రెండు విడతల్లో గతేడాది సెప్టెంబరులోపు చెల్లిస్తామని మంత్రుల కమిటీ హామీనిచ్చినా ఇంతవరకు అందలేదు.

  • పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయి. వీటిని 2027లోగా చెల్లిస్తామని సర్కారు చెబుతోంది. కానీ, ఇంతవరకు దీనికి సంబంధించి జీఓనే ఇవ్వలేదు. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఇస్తామన్న 10 శాతానికీ అతీగతీ లేదు. పదవీ విరమణ చేసిన వారికి, కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటి విషయంలోనూ మాయ చేస్తోంది.
  • ఉద్యోగుల టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్లు ఉన్నాయి. ఏపీజీఎల్‌ఐ బిల్లులు రూ.313కోట్లు ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బిల్లులను అప్‌లోడ్‌ చేసే యాప్‌ను సైతం ప్రభుత్వం ఆపేసింది. దీంతో మరో రూ.200కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ కాలేదు.
  • జీపీఎఫ్‌, పీఎఫ్‌ బిల్లుల బకాయిలు రూ.946కోట్లు ఉంటే నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రమే రూ.60కోట్లు చెల్లించింది. మిగతా బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
  • మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118కోట్లు, సరెండర్‌ లీవుల బకాయిలు రూ.2,250కోట్లు, ఇవికాకుండా 2021-22నాటికి చెల్లించాల్సిన సరెండర్‌ లీవుల బకాయిలు రూ.300కోట్లు ఉన్నాయి.

పీఆర్సీ ఒక డ్రామా :ఎప్పుడూ లేని విధంగా మధ్యంతర భృతి (ఐఆర్‌) 27% కంటే 4% తగ్గించి.. 23% ఫిట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్‌ఆర్‌ఏ ఉంటే, జగన్‌ వచ్చాక 24 శాతానికి తగ్గించేశారు. జిల్లాకేంద్రాల్లో గతంలో 20% హెచ్‌ఆర్‌ఏ ఉండగా.. 16%కి కుదించేశారు.

  • పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ వేసేశారు. పీఆర్సీ పేస్కేల్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్‌ స్కేల్స్‌ ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్‌ కొత్తవి నిర్ణయిస్తారు? పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా? పోస్టులవారీ స్కేళ్ల ఆమోదం వల్ల కొందరికి వేతనం పెరగనుంది. డిప్యుటేషన్‌ అవకాశాలూ ఉంటాయి.
  • 11వ పీఆర్సీ బకాయిలు, ప్రయోజనాలు కొలిక్కి రాకుండానే 12వ పీఆర్సీ కమిషన్‌ వేశారు. ఇప్పుడు మధ్యంతర భృతి ఇవ్వకుండా, ఒకేసారి ఫిట్‌మెంట్‌ ఇస్తామంటూ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసింది. ఏడాదిలోగా 12వ పీఆర్సీ కమిషన్‌ నివేదిక ఇవ్వాలి. కానీ, ఇంతవరకు కార్యకలాపాలను ప్రారంభించలేదు.

నూతన పెన్షన్​ విధానం వద్దు - ఓపీఎస్ అమలు చేయాలి : రైల్వే ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details