UK Award To Sunil Bharti Mittal : భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిత్తల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను ప్రతిష్ఠాత్మక పురస్కారమైన నైట్‌హుడ్ పురస్కారానికి ఎంపిక చేసింది బ్రిటన్ ప్రభుత్వం. దీంతో ఆ దేశ రాజు- కింగ్ ఛార్లెస్ 3 చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మిత్తల్ నిలిచారు. బ్రిటన్ ప్రభుత్వం పౌరులకు అందించే అత్యున్నత పురస్కారాల్లో నైట్ కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్‌లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ అంపైర్ అవార్డు ఒకటి. పలు రంగాల్లో విశేష సేవలందించిన విదేశీ పౌరులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవిస్తుంటారు. అంతకుముందు రతన్‌టాటా (2009), రవిశంకర్ (2001), జమ్‌షెడ్ ఇరానీ (1997) ఈ నైట్‌హుడ్ పురస్కారాన్ని దివంగత క్వీన్ ఎలిజబెత్-II చేతుల మీదుగా అందుకున్నారు.
సునీల్ మిత్తల్ సంతోషం
బ్రిటన్ రాజు చేతుల మీదుగా పురస్కారం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు సునీల్ భారతీ మిత్తల్. 'బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 నుంచి నాకు దక్కిన ఈ గుర్తింపును ఎంతో గౌరవంగా భావిస్తున్నా. యూకే, భారత్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నేను కృషి చేస్తాను. దేశాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన బ్రిటన్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు' అని 66 ఏళ్ల మిత్తల్ అన్నారు. కాగా, 2007లో సునీల్ మిత్తల్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది.