Farmers Protest Delhi 2024 :పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని మంగళవారం దిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు బుధవారం కూడా మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణా సరిహద్దులతో పాటు దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా RAF బలగాలను మోహరించారు. సరిహద్దుల వద్ద మరిన్ని కాంక్రీటు దిమ్మెలు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు.
Farmers Protest 2024 Update : మంగళవారం దిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ, అల్పాహారాన్ని సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే, రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని వారికి విజ్ఞప్తి చేశారు.
'వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతుల సంక్షేమం కోసం గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం రైతుల డిమాండ్లను వినేందుకు ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దింపింది. ఈ క్రమంలో వారు(రైతులు) కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి? ఒకవేళ కొత్త డిమాండ్స్ వినిపించినా వాటిని పరిశీలించేందుకు, రాష్ట్రాలతో చర్చించేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఇప్పటికీ రైతులతో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వారు మాతో చర్చలకు రావాలి. రైతులు ప్రతిపాదించిన వాటికి చాలావరకు మేము అంగీకరించాము. అయితే నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించవద్దని నేను రైతు సంఘాలను కోరుతున్నాను'
--అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి
'డ్రోన్లు పంపంకండి'
హరియాణా భూభాగంలోని శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులను నిలువరించేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్‌ను వినియోగించడంపై పంజాబ్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పటియాలా డిప్యూటీ కమిషనర్ షోకత్ అహ్మద్ పర్రే, అంబాలా డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇకపై పంజాబ్ భూభాగంలోని అంబాలా-శంభు బోర్డర్లోకి డ్రోన్లను పంపిచకూడదంటూ అందులో కోరారు.