తెలంగాణ

telangana

దిల్లీలో కాంగ్రెస్‌ 'ఆప్‌'సోపాలు- ఒకరి తర్వాత మరొకరు జంప్- పెద్ద తలనొప్పే! - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 6:40 AM IST

Updated : May 2, 2024, 9:43 AM IST

Delhi Congress Party : తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తయారైంది దిల్లీ కాంగ్రెస్‌ పరిస్థితి. దేశ రాజధానిలో గతఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈసారి ఆమ్‌ఆద్మీ పార్టీతో హస్తం పార్టీ జతకట్టింది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న దిల్లీ కాంగ్రెస్‌ నేతలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాల బాటపట్టడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

Delhi Congress Party
Delhi Congress Party

Delhi Congress Party :లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీతో పొత్తు కాంగ్రెస్‌లో అగ్గిరాజేసినట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజుల ఆ పార్టీ నేతల రాజీనామాలు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్‌ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయగా మరో ఇద్దరు నేతలు అదేబాట పట్టారు. ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తు కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు.

నిత్యం అవమానాలే!
పశ్చిమ దిల్లీ పార్లమెంట్‌ స్థానం పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే నీరజ్‌ బసోయా రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తు ఇష్టం లేదన్న ఆయన, కూటమి కారణంగా దిల్లీలో కార్యకర్తలు నిత్యం అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఆత్మాభిమానం ఉన్న నేతగా పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనలాంటి సాధారణ మనిషికి సోనియా ఎన్నో అవకాశాలు కల్పించారని, అందుకు ధన్యవాదాలని ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో నీరజ్‌ బసోయా పేర్కొన్నారు.

రాజీనామా చేసిన మరో కాంగ్రెస్‌ నేత, వాయవ్య దిల్లీ పార్లమెంట్‌ స్థానానికి పార్టీ పరిశీలకుడైన నసీబ్‌ సింగ్‌, దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కొత్త అధ్యక్షుడు దవేందర్‌ యాదవ్‌ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇప్పటివరకు ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు దిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని మండిపడ్డారు.

ఇటీవల కాంగ్రెస్‌ దిల్లీ శాఖ అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఆప్‌తో పొత్తును దిల్లీ శాఖ అంగీకరించలేదని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి ఆరోపణలు చేసి ఆమ్‌ఆద్మీ పార్టీ ఏర్పాటైందని, అలాంటి పార్టీతో పొత్తు వద్దని దిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు దిల్లీ ఇన్‌ఛార్జి అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

పార్టీకి తలనొప్పిగా!
పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ, రెండు స్థానాల్లో అసలు దిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నేతల రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారాయి.

కాంగ్రెస్​ ఉనికిని ఆప్ పూర్తిగా!
మరోవైపు దిల్లీలో కాంగ్రెస్‌-ఆప్‌ కూటమిలో వచ్చిన విభేదాలపై భాజపా కూడా స్పందించింది. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఆప్‌ పూర్తిగా తుడిచి పెట్టేసిందని పేర్కొంది. గతంలో సోనియా గాంధీని, దివంగత దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అరెస్టు చేస్తామని ఆప్‌ ఇచ్చిన హామీని బీజేపీ నేతలు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి లక్ష్యం లేదని అందులో గందరగోళం, విభజన మాత్రమే ఉన్నాయన్నారు. దిల్లీలో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదరగా మొత్తం 7 స్థానాల్లో నాలుగింటిలో ఆమ్‌ఆద్మీ, మూడు చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా మే 25వ తేదీన దిల్లీలోని 7లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది.

Last Updated :May 2, 2024, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details