పల్లెటూరి మేడమ్ ఇంగ్లిష్ పాఠాలు- యూట్యూబ్ ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయం!
Published : Nov 30, 2023, 12:48 PM IST
|Updated : Dec 1, 2023, 8:42 AM IST
Village Woman Teaching English Through Youtube : ఉత్తర్‌ప్రదేశ్.. కౌశాంబి జిల్లా సిరతు నగర పంచాయతికి చెందిన యశోద ఇంటర్ వరకూ చదువుకుంది. అనివార్య కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేసింది. కానీ మంచి అధ్యాపకురాలు కావాలన్న కోరిక మాత్రం యశోదకు బలంగా ఉండేది. తనకు ఆంగ్ల భాషపై ఉన్న పట్టుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇంగ్లీష్ విత్ దేహతీ మేడం ఛానల్ నడుపుతోంది. తన లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆంగ్ల భాష, వ్యాకరణాంశాలు నేర్పిస్తోంది. టెన్సెస్‌ను ఎలా ఉపయోగించాలి? నిస్సంకోచంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలా? రోజూవారీ పనుల్లో ఆంగ్లం వినియోగం వంటి అంశాలపై వీడియోలు అప్‌లోడ్ చేసింది.
ఆంగ్లంపై తనకున్న ప్రావిణ్యాన్ని సబ్‌స్క్రైబర్లకు పంచుతూ వారిని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2లక్షల 88 వేల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఏడాదిలోనే మంచి ప్రజాదరణ పొందింది. యశోద ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదనతో ఆర్థికంగా ఆమె కుటుంబం బలపడినట్లు తెలిపింది. వ్యవసాయ పెట్టుబడికి, ఇంటి అవసరాలకు కష్టాలు తీరినట్లు యశోద తండ్రి చెబుతున్నారు. యశోద ఆంగ్లం నేర్చుకునే సమయంలో చిన్న చిన్న వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉండేదని భర్త రాధే లోది తెలిపారు. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఆర్థిక సమస్యలన్నీ తొలగినట్లు వెల్లడించారు.