High Wind Havoc in Joint Warangal : ఈదురు గాలుల బీభత్సం.. 150కి పైగా ఇళ్లు ధ్వంసం
Published: May 21, 2023, 8:11 PM

High Wind Havoc in Joint Warangal : ఓవైపు వేసవిలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను నానా ఇబ్బందులకు గురిచేశాయి. ఈక్రమంలోనే తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయని బాధితులు వాపోతున్నారు. వరంగల్ నగరంలో చాలా ప్రాంతాల్లో గాలిదుమారానికి చెట్లు, స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కాశీబుగ్గ, చింతల్, జేబీనగర్, అబ్బోనికుంట, చారబౌలి తదితర ప్రాంతాల్లో.. 150కి పైగా కుటుంబాలు వాయుదేవుడి బీభత్సానికి నిలువనీడ లేకుండా పోయింది. మరోవైపు హనుమకొండ జిల్లా పరకాల డివిజన్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి వృక్షాలు నేలకూలాయి. పలుచోట్ల ఇంటి రేకులు పగిలిపోయాయి. శాయంపేట మండలం ప్రగతి సింగారంలో చెట్టుపడి గీత కార్మికుడు అశోక్ దుర్మరణం పాలయ్యాడు. దామెర మండలంలోని సీతారాంపురంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. పరకాలకు నీరందించే చలివాగు ప్రాజెక్టుకు సంబంధించిన కరెంట్ లేక నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. తమపై దయచూపి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.