Pratidwani: లాఠీ న్యాయం... ఖదీర్ విషాదాంతం

By

Published : Feb 20, 2023, 9:23 PM IST

thumbnail

Pratidwani: మెదక్‌లో ఖదీర్‌ఖాన్‌ లాకప్ డెత్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఓ నేరంలో అనుమానితుడిగా ఉన్న ఖదీర్​ ఖాన్​ను మెదక్ పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 రోజుల క్రితం చనిపోయిన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసు తీవ్రతను గుర్తించి డీజీపీ విచారణకు ఆదేశించారు. నిన్న మెదక్ సీఐ, ఎస్​ఐతో పాటు ఖదీర్​ ఖాన్​ను కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్​ను మొత్తం నలుగురిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీచేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు. మృతుడి కుటుంబానికి 50లక్షల ఎక్స్​గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు, మైనార్టీ సంఘాలు ఆందోళనకు దిగుతుంటే.. మరోవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పత్రికల్లో కథనాల ఆధారంగా సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రేపు దీనిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు అసలు ఏ నిబంధనలు పాటించలేదు. ఎవరైనా నిందితుడిని  విచారణ పేరుతో 24 గంటల కంటే ఎక్కువ సేపు స్టేషన్​లో ఉంచరాదని నిబంధన ఉన్నా.. ఎందుకు పాటించలేదు.. పోలీసులు చెబుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్​ ఎందుకిలా తారుమారవుతోంది.. విచారణ పేరుతో కొట్టి అధికారం పోలీసులకు లేదని చట్టాలు చెబుతున్నా.. పోలీసులు ఎందుకు పాటించడం లేదు.. పేదల విషయంలోనే పోలీసులు ఎందుకిలా నిబంధనలు పట్టించుకోవడం లేదు.. చట్టం తమను ఏమీ చేయలేదని ధీమానే కారణమా... లేదంటే పేదలకు చట్టాలపై అవగాహన లేకపోవడమా.. స్టేషన్​లో సీసీ కెమెరాలు ఉండాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పినా... ఆ నిబంధన కూడా ఎందుకు నీరు గారుతోంది... అరెస్టు, పోలీసు కస్డడీలపై పౌరులు ఏం తెలుసుకోవాలి? హక్కుల విషయంలో పౌరులకు ఉన్న రక్షణలు ఏమిటి?.. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వనిలో చర్చిందాం.. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.