Buffaloes Fell Into A Well : దాహం కోసం వెళ్లి.. వ్యవసాయ బావిలో పడిన 20 బర్రెలు
Published: May 17, 2023, 11:07 PM

Buffaloes Fell Into A Well In Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో ప్రమాదవశాత్తు 20 బర్రెలు దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లి వ్యవసాయ బావిలో పడిపోయాయి. తొగర్రాయి గ్రామానికి చెందిన బొంగోని నరసయ్యకు చెందిన 20 బర్రెలను తన పశువుల కాపరి అంజయ్య మేత కోసం బుధవారం ఉదయం గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. కాగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బర్రెలు నీటిని తాగేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు హుటాహుటిన వ్యవసాయ బావి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే సుల్తానాబాద్ పోలీసులకు సైతం సమాచారం ఇవ్వగా ఎస్సై విజయేందర్ అక్కడికి చేరుకొని సిబ్బందితో కలిసి బర్రెలను రక్షించే చర్యలు చేపట్టారు. వ్యవసాయ బావికి ఒకవైపు తవ్వకాలు చేపట్టి తాళ్ల సహాయంతో బయటకు తీయగలిగారు. ఈ ప్రమాదంలో బర్రెలన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. ఒకసారిగా వ్యవసాయ బావిలో బర్రెలు పడిపోవడంతో యాజమాని నరసయ్య బోరున విలపించాడు. బర్రెలను కాపాడిన స్థానికులు పోలీసులకు యాజమాని నరసయ్య కృతజ్ఞతలు తెలిపాడు.