ETV Bharat / sukhibhava

బీపీ పరీక్ష సమయంలో పొరపాట్లు చేయొద్దు

author img

By

Published : Sep 23, 2020, 10:28 AM IST

don't do mistakes while testing bp
‘బీపీ’ పొరపాట్లు చేయొద్దు

బీపీ పరీక్ష చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా కూర్చోకపోవడం వల్ల కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశముందంటున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకోండి.

రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో సరిగా కూర్చోవటం వంటివీ ముఖ్యమే. వీపు కుర్చీకి ఆనకపోవటం, పాదాలు నేలకు తగలకపోవటం వంటి చిన్న చిన్న పొరపాట్లతోనూ రక్తపోటు ఫలితాలు తారుమారు కావొచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది.

మూత్రం పోశాకే: మూత్రాశయం నిండుగా ఉంటే రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉండొచ్చు. మూత్రం పోశాకే రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మేలు.

పాదాలు నేలకు ఆనాలి: పాదాలు పూర్తిగా నేలకు ఆనకపోయినా, కుర్చీ వెనక భాగానికి వీపును తాకించి నిటారుగా కూర్చోకపోయినా రక్తపోటు ఫలితాలు 6.5 ఎంఎం హెచ్‌జీ వరకు ఎక్కువగా నమోదు కావొచ్చు.

కాలు మీద కాలు వద్దు: కాళ్లు ఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు పరీక్ష చేస్తే రక్తపోటు 2-8 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు.

మౌనంగా, ప్రశాంతగా: రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు 10 ఎంఎం హెచ్‌జీ మేరకు పెరిగే అవకాశముంది.

దుస్తులపై పట్టీ వద్దు: రక్తపోటు పరికరం పట్టీ దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు. దుస్తుల మీదుగా పట్టీ బిగిస్తే రక్తపోటు ఎక్కువగా చూపించొచ్చు. అలాగే చేతికి తగిన సైజు పట్టీ ఉండేలా చూసుకోవాలి. పట్టీ సైజు చాలా తక్కువగా ఉన్నట్టయితే బీపీ 2-10 ఎంఎం హెచ్‌జీ వరకు పెరగొచ్చు.

గుండెకు సమానంగా చేయి: పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. సమాన ఎత్తులో లేకపోయినా, చేయి కింద దన్ను లేకపోయినా రక్తపోటు ఫలితం 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా చూపించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.