ETV Bharat / sukhibhava

శరీరాన్ని ఉక్కులా మార్చే ఐరన్ కథ

author img

By

Published : Jun 13, 2021, 11:03 AM IST

iron is an essential element for body
శరీరాన్ని ఉక్కులా మార్చే ఐరన్ కథ

శాకాహారులకు ఐరన్‌ లోపం ముప్పు ఎక్కువ. మాంసం, చేపలు, చికెన్‌ వంటివి తక్కువగా లేదూ పూర్తిగా తిననివారిలో దీని లోపం అధికంగా కనిపిస్తుంటుంది. మనల్ని ఉక్కు మనిషిగా మార్చే ఈ ఐరన్ ఆవశ్యకత గురించి తెలుసుకోండి.

ఐరన్‌ మనల్ని నిజంగానే ఉక్కు మనుషులుగా మారుస్తుంది! ఇది ఒంట్లో తగినంత లేకపోతే శరీరం చతికిల పడిపోతుంది మరి. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్‌ అనే ప్రోటీన్ల తయారీకిది అత్యంత అవసరం. మనం శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్‌ను ఎర్ర రక్తకణాలు అన్ని అవయవాలకు చేరవేస్తుంటాయి కదా. ఈ ప్రక్రియలో ఎర్ర రక్తకణాలకు సాయం చేసేది హిమోగ్లోబినే. ఇక మయోగ్లోబినేమో కండరాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంటుంది. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్‌ తోడ్పడుతుంది. అందుకే ఐరన్‌ ఆవశ్యకత గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

రక్తహీనత లక్షణాలు ఇవీ..

ఐరన్‌ చాలా కీలకమైంది కాబట్టే శరీరం దీన్ని కండరాలు, ఎముకలు, కాలేయం వంటి భాగాల్లో నిల్వ చేసుకొని పెట్టుకుంటుంది. ఎప్పుడైనా ఐరన్‌ కాస్త తగ్గితే వీటి నుంచి తీసుకొని ఉపయోగించుకుంటుంది. అందుకే ఐరన్‌ మోతాదులు తగ్గుతున్నప్పుడు మొదట్లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అదేపనిగా తగ్గుతుంటే మాత్రం ఎర్ర రక్తకణాల సైజూ తగ్గుతూ వస్తుంది. దీంతో హిమోగ్లోబిన్‌ను మోసుకెళ్లే శక్తీ క్షీణిస్తుంది. ఫలితంగా అవయవాలు, కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందక చిన్న పనులకే చేతులెత్తేస్తుంటాయి. దీన్నే ఒక రకమైన రక్తహీనత అంటారు. దీని బారినపడ్డవారిలో అలసట, బలహీనత, తల తిరిగినట్టు అనిపించటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె వేగం పెరగటం, చేతులు చల్లబడటం, తలనొప్పి, జీర్ణ సమస్యల వంటివీ వేధించొచ్చు. రోగనిరోధకశక్తి బలహీన పడటం వల్ల తరచూ జబ్బుల బారినపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతలు తరచూ హెచ్చుతగ్గులకు లోనుకావచ్చు. ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చు. ఐరన్‌ లోపంతో తలెత్తే రక్తహీనత మూలంగా పిల్లల్లో గ్రహణశక్తి క్షీణించి చదువుల్లోనూ వెనకబడిపోవచ్చు.

ఐరన్‌ ఎందుకు తగ్గుతుంది?

శాకాహారులకు ఐరన్‌ లోపం ముప్పు ఎక్కువ. మాంసం, చేపలు, చికెన్‌ వంటివి తక్కువగా లేదూ పూర్తిగా తిననివారిలో దీని లోపం అధికంగా కనిపిస్తుంటుంది. ప్రమాదాల్లో గాయపడినప్పుడు రక్తాన్ని కోల్పోవటం.. జీర్ణాశయంలో, పెద్దపేగులో పుండ్లు.. అజీర్ణం వంటివీ దీనికి దారితీయొచ్చు. పురుషుల్లో కన్నా మహిళల్లో.. ముఖ్యంగా నెలసరి ఆరంభమైన తర్వాత, గర్భధారణ సమయంలో ఐరన్‌ లోపం తలెత్తే అవకాశముంది. అంతేకాదు, వృద్ధుల్లో తిండి తినటం తగ్గుతున్నకొద్దీ ఐరన్‌ స్థాయులూ తగ్గుతుంటాయి.

ఆడవారికి మరింత ఎక్కువే కావాలి

మగవారికైతే రోజుకు 8 మి.గ్రా. ఐరన్‌ అవసరం. అదే ఆడవారికైతే ఎక్కువే కావాలి. ఆడవారిలో దీని అవసరం వయసులను బట్టి ఆధారపడి ఉంటుంది. 19-50 ఏళ్ల వయసువారికి రోజుకు సుమారు 18 మి.గ్రా. ఐరన్‌ అవసరం. గర్భిణులకైతే 27 మి.గ్రా., పాలిచ్చే తల్లులకు 10 మి.గ్రా. కావాలి. ఇక 50 ఏళ్లు దాటితే పురుషులతో సమానంగా.. అంటే రోజుకు 8 మి.గ్రా. సరిపోతుంది. మనదేశంలో 15-49 ఏళ్ల బాలికలు, మహిళల్లో సుమారు 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అంచనా. దీనికి ఐరన్‌ లోపమే ప్రధాన కారణం.

శాకాహారులు మరింత ఎక్కువగా తీసుకోవాలి

మాంసం, జంతు కాలేయం, చేపలు, పీతలు, రొయ్యలు, చికెన్, చిక్కుళ్లు, శనగలు, ఉలవలు, రాజ్మా, సోయాబీన్స్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. ప్రస్తుతం ఐరన్‌ను జతచేసిన బ్రెడ్, అల్పాహారాల వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే మన శరీరం జంతు ప్రొటీన్‌ పదార్థాల్లోని ఐరన్‌ను తేలికగా గ్రహిస్తుంది. అదే కూరగాయలు, ఆకుకూరల్లోని ఐరన్‌ను అంతగా శోషించుకోలేదు. అందువల్ల మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు మరింత ఎక్కువ మొత్తంలో.. అంటే మగవారు ఆహారం ద్వారా రోజుకు 14 మి.గ్రా., 19-50 ఏళ్ల మహిళలు 32 మి.గ్రా. ఐరన్‌ను లభించేలా చూసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. అలాగే విటమిన్‌ సితో కూడిన నారింజ, బత్తాయి, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ వంటివి అధికంగా తీసుకోవటం మంచిది. శరీరం ఐరన్‌ను బాగా గ్రహించుకునేలా విటమిన్‌ సి తోడ్పడుతుంది.

ఐరన్‌ మాత్రలు, సిరప్‌లు ఎవరికి?

మగవారికి, మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టిన మహిళలకు చాలావరకు మాత్రలు, సిరప్‌ల రూపంలో ఐరన్‌ తీసుకోవాల్సి అవసరముండదు. మిగతావారిలోనూ చాలామందికి ఆహారం ద్వారానే తగినంత లభిస్తుండొచ్చు. రక్తహీనత బారినపడ్డవారికైతే మాత్రలు, సిరప్‌ల అవసరముండొచ్చు. అయితే ఐరన్‌ మితి మీరితే కడుపు నొప్పి, మలబద్ధకం, వికారం, విరేచనాలు, తల తేలిపోతున్నట్టు అనిపించటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. శరీరం జింక్‌ను గ్రహించుకోవటమూ తగ్గిపోతుంది. అందువల్ల ఐరన్‌ మాత్రలను డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి. సొంతంగా కొనుక్కొని వేసుకోవటం తగదు.

గర్భిణులకైతే..?

గర్భిణులకు ఐరన్‌ మరింత ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది. పిండం సరిగా ఎదగటానికి, గర్భిణికి ఇది అత్యవసరం. ఐరన్‌ తగినంతగా లేకపోతే నెలలు నిండకముందే కాన్పు కావొచ్చు. బిడ్డ తక్కువ బరువుతోనూ పుట్టొచ్చు. బిడ్డ మెదడు ఎదుగుదల సైతం కుంటుపడొచ్చు. అందుకే డాక్టర్లు తరచూ రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పరీక్షిస్తూ.. అవసరాన్ని బట్టి ఐరన్‌ మాత్రలు సూచిస్తుంటారు.

  • శిశువుల్లో, మూడేళ్లలోపు చిన్నారుల్లో సుమారు 10% మందిలో ఐరన్‌ తగినంతగా ఉండదు. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లోనైతే ఒంట్లో ఐరన్‌ నిల్వలు అంతగా ఉండవు కూడా. నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లల్లోనూ కొద్ది నెలలకు సరిపడినన్ని నిల్వలే ఉంటాయి. దీన్ని భర్తీ చేయకపోతే ప్రవర్తన, ఏకాగ్రత సమస్యలు తలెత్తొచ్చు. కాబట్టి అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించి పిల్లలకు ఐరన్‌ సిరప్‌ల అవసరముందేమో తెలుసుకోవటం మంచిది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.