ETV Bharat / state

YADADRI PRASADAM: అధునాతన యంత్రాలతో యాదాద్రి ప్రసాదం..!

author img

By

Published : Aug 29, 2021, 11:45 AM IST

preparation-of-yadadri-prasadam-with-machines
అధునాతన యంత్రాలతో యాదాద్రి ప్రసాదం..!

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ తరహాలో... యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను యంత్రాల ద్వారా తయారు చేసేందుకు యాడా సిద్ధమైంది. అందులో భాగంగానే ముంబయి, పుణేల నుంచి కోట్ల రూపాయలు పెట్టి యంత్రాలను కూడా తెప్పించారు.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ప్రత్యేక చర్యలు తీసుకొంటోంది. స్వామి దర్శనానంతరం... భక్తులంతా లడ్డూ ప్రసాదాలు కొనే చోటే ఉంటారు. యాదగిరి గుట్ట లడ్డూకి అంత ప్రత్యేకత ఉంది మరి. అందుకే... భక్తలు ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసే ప్రసాదాలను యంత్రాల ద్వారా తయారు చేసేందుకు యాడా యంత్రాంగం శ్రమిస్తోంది.

ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్య భారీగానే ఉంటుందనే ముందస్తు ఆలోచనతో... వారికి ప్రసాదాలు సమకూర్చేందుకు యాడా సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ సూచనలతో... రూ. 13 కోట్ల వ్యయంతో ముంబయి, పుణే నుంచి ప్రసాదాలను తయారుచేసే యంత్రాలను తెప్పించారు. వాటిని హరే రామ హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయపాత్ర పర్యవేక్షణలో బిగిస్తున్నారు.

అధునాతన యంత్రాలతో యాదాద్రి ప్రసాదం..!

యంత్రాల వద్ద సరుకులుంచితే.. కౌంటర్ల వద్దకు ప్రసాదమొస్తుంది..

ప్రసాదాల తయారీలో వినియోగించే సరకులను యంత్రాల చెంతకు చేర్చితే... అవసరాలకు తగ్గట్లు అవే ప్రసాదాలను సిద్ధం చేస్తాయి. సిద్ధమైన ప్రసాదాలను కన్వేయర్ బెల్టుల ద్వారా విక్రయ కౌంటర్ల చెంతకు చేరుస్తారు. ఇందుకు కన్వేయర్ బెల్టులు, విక్రయ కౌంటర్లు ఏర్పాటయ్యాయి. యంత్రాలు పనిచే సేందుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనులను కూడా పూర్తిచేశారు. ప్రసాదాలను నిల్వ చేసే ట్రేలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసే ప్రత్యేక యంత్రాలను కూడా అక్కడ కొలువుదీర్చారు.

తుది దశకు చేరిన పనులు

హరేరామ హరేకృష్ణ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ప్రసాదాల తయారీ యూనిట్ల ఖరీదు బిగింపు కొనసాగుతోంది. కొండపైన హరి, హరుల ఆలయాల మధ్య నిర్మించిన ప్రత్యేక భవన సముదాయంలో ప్రసాదాల తయారీ చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి గతేడాది జూన్​లో మొదలైన పనులు తుదిదశకు చేరాయి. కొన్నాళ్లపాటు అక్షయపాత్ర వారి పర్యవేక్షణ ఉంటుంది. మా సిబ్బందికి యంత్రాలు వినియోగించే తీరుపై శిక్షణ ఇప్పిస్తున్నాం. - కిషన్ రావు, యాడా వైస్ చైర్మన్

రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు లడ్డూలను తయారు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉందని అధికారులు తెలిపారు. వాటి పనితీరును మరోవారంలోగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

ఇదీ చూడండి: HYPERACTIVE KIDS: అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.