ETV Bharat / state

పట్టభద్రులు పల్లా వైపే ఎందుకు మొగ్గుచూపారు..?

author img

By

Published : Mar 21, 2021, 2:47 PM IST

palla rajeshwar reddy
పట్టభద్రులు పల్లా వైపే ఎందుకు మొగ్గుచూపారు..?

హోరాహోరీ పోరును తలపించిన నల్గొండ-ఖమ్మం-వరంగల్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్నితెరాస తిరిగి కైవసం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో పల్లా రాజేశ్వర్​రెడ్డి మళ్లీ విజయం సాధించారు. నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన లెక్కింపులో ఫలితం అనుకూలంగా రావడం వల్ల గులాబీ శ్రేణుల ఆనందం అంబరాన్నంటుతోంది. మరి పట్టభధ్రులు పల్లాకు పట్టం కట్టడానికి కారణాలేంటంటే..?

మనమే గెలుస్తాం.. అయినా అలసత్వంగా ఉండొద్దన్న కేసీఆర్​ హెచ్చరికలు.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడి ప్రణాళిక, మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ముమ్మర ప్రచారం... తెరాస విజయానికి బాటలు వేశాయి. దాంతోపాటు మూడు జిల్లాల్లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి సుడిగాలి పర్యటనలు.. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానాన్ని అధికార పార్టీ ఖాతాలో వేశాయి. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న ప్రకటన, లక్షా 31 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పడం, లెక్కలతో సహా వివరించడం, మరో 50 వేల ఖాళీల భర్తీ ప్రకటనా కలిసివచ్చాయి. ఇతర సమస్యలపై వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దిద్దుబాటు చర్యలు తీసుకోవడం వల్ల వ్యతిరేకత స్థాయి తగ్గింది.

ప్రశ్నించే గొంతుక కాదు..

ప్రశ్నించే గొంతుక కాదు.. పరిష్కరించే గొంతుకనవుతా అంటూ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి.. మూడు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశాలు నిర్వహించారు. తెరాసకు ఓటేస్తే కలిగే ప్రయోజనాలను వివరించి.. అనుకూల ఓట్లను రాబట్టడంలో విజయం సాధించారు.

తెరాస పోల్​ మేనేజ్​మెంట్..

అన్నింటికీ మించి తెరాసకు తెలిసిన పోల్​ మేనేజ్​మెంట్ ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో నెగ్గకపోయినా.. కావాల్సినంత మెజార్టీ తెచ్చుకోవడం వల్ల పల్లాకు గెలుపు సునాయాసమైంది. ఇదే సమయంలో.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కాలన్న ప్రత్యర్థుల వ్యూహం బెడిసికొట్టింది. అధికార పక్ష అభ్యర్థికి దీటుగా.. రెండో ప్రాధాన్యత ఓట్లను తెచ్చుకోవడంలో విఫలమయ్యారు.పేరుకే పట్టభద్రుల ఎన్నికైనా.. శాసనసభ ఎన్నికల స్థాయిని తలపించింది. పోటాపోటీ ప్రచారాలు.. పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎన్నికల సమరం ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

కమలానికి భంగపాటు..

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల విజయాలతో జోరుమీదున్న కమల దళానికి.. ఈ ఎన్నికలు ఊహించని భంగపాటు కలిగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపి.. గులాబీ నేతలను ఇరుకున పెట్టాలనుకున్న భాజపా నేతల వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్న రీతిలో పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారు కమలనాథులు. తొలి నుంచి ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్​రెడ్డి.. నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. గెలుపుపై అతివిశ్వాసం.. పట్టభద్రుల మద్దతు పొందేందుకు అవసరమైన వ్యూహరచనలో వైఫల్యం, కాషాయ నేతలకు ఓటమి తెచ్చిపెట్టింది.

అదే కోదండరాంకు మైనస్​..

తెలంగాణ సాధనలో ఎంతో కృషి చేసినా.. సుపరిచితుడిగా, మేథావిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విజయం సాధించలేకపోయారు. ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతుతో గెలుపొందాలన్న కోదండరాం ఆశలు నెరవేరలేదు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో కోదండరాం.. విజయం సాధిస్తారన్న విస్తృత ప్రచారమే మిగిలింది. సభలు, సమావేశాలు నిర్వహించి కోదండరాం ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించగలిగే క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింటైంది. రెండో స్థానంలోనైనా ఉంటారని భావించినా.. తొలిరౌండ్​ నుంచీ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

అంచనాలకు మించి..

తొలి నుంచి రెండో స్థానంలో నిలిచి.. తెరాస అభ్యర్థికి గట్టిపోటీనిచ్చిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్​ మల్లన్న విజయ తీరాన్ని చేరుకోలేకపోయారు. రెండో స్థానానికే పరిమితమయ్యారు. అందరి అంచనాలకు మించి ఓట్లు తెచ్చుకున్నారు.

ముందు నుంచే ఆశలు వదిలేశారు!

ఈ స్థానంపై ముందు నుంచే ఆశలు వదులుకున్న కాంగ్రెస్​.. తప్పదు అన్నట్లుగా బరిలో నిల్చుంది. అభ్యర్థి ఖరారు ఆలస్యం కావడం, శ్రేణుల మధ్య సమన్వయలోపం, స్థానికుడు కాదన్న విమర్శ, నామమాత్రపు ప్రచారం.. ఆ పార్టీ అభ్యర్థి రాములునాయక్ ఓటమికి కారణమయ్యాయి.

పోలింగ్​ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలిరావడం, గతం కంటే అత్యధికంగా 76 శాతం పోలింగ్​ నమోదుకావడంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని.. తమకు లాభిస్తుందని విపక్షాలు ఆశలు అంచనాలకే పరిమితమయ్యాయి.

గులాబీ శ్రేణులకు మహదానందం..

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల కొంత నిరాశకు గురైన గులాబీ శ్రేణులకు ఈ విజయం మహదానందం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు స్థానాలను కైవసం చేసుకోవడం వల్ల గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.

ఇద్దరూ.. ఓరుగల్లు బిడ్డలే

పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరూ ఓరుగల్లు బిడ్డలే కావడం విశేషం. పల్లా రాజేశ్వర్​రెడ్డి వరంగల్​ అర్బన్​ జిల్లా వేలేరు మండలం శోడషపల్లికి చెందినవారు కాగా.. వాణీదేవి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె.. వరంగల్​ అర్బన్​ జిల్లా వంగర గ్రామానికి చెందినవారు.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.