ETV Bharat / state

Road accidents in Warangal Today : నెత్తిరోడిన రహదారులు.. అసువులుబాసిన రక్తసంబంధీకులు

author img

By

Published : May 22, 2023, 1:08 PM IST

Road accidents
Road accidents

Six people died in road accidents at Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురి ప్రాణాలు బలిగొన్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో నలుగురు అన్నదమ్ములు, తాత మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Brothers Killed in Huzurabad Road Accident Today : వరంగల్ ఉమ్మడి జిల్లాలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు మూడు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం అనంత సాగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అన్నదములు అసువులు బాసారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణ ఈ ప్రమాదంలో మృతి చెందారు.

అన్నయ్యను కాజీపేటలో ట్రైన్ ఎక్కించడానికి తమ్ముడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వెళ్లే రోడ్డువైపు వెళ్తుండగా గుర్తు తెలియని బైక్​ను ఢీకొట్టడంతో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చేతికందివచ్చిన కొడుకుల జీవితాలు అర్ధాంతరంగా ముగియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో తమ పెద్ద కుమారుడికి పెళ్లి చేద్దామనుకుంటుండగా ఈ ఘటన జరగడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

Road accident in Bhupallipally : భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత సమ్మయ్య, మనవరాలు అక్షిత మృతి చెందారు. వీరు వెళ్తున్న బైక్​ను హనుమకొండ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరూ బస్సు కింద పడి ప్రాణాలొదిలారు. గణపురం మండలం సీతారాంపురానికి చెందిన సమ్మయ్య.. తన మనవరాలిని బొడ్రాయ్ పూజలకోసం తన కుమార్తె ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Brothers Killed in Bhupalpally Road Accident Today : భూపాలపల్లి జిల్లాలోనే జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణలు కోల్పోయారు. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద కారు బోల్తా పడి వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన చెందిన అన్నదమ్ములు ఆశిష్, అభిషేక్​లు మృత్యువాత పడ్డారు. టేకుమట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు చోట్ల రక్త సంబంధీకులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలతో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది.

వరుస రోడ్డు ప్రమాదాలు: గత వారం రోజులుగా రాష్ట్రంలో నెలకొంటున్న వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న మెదక్​ జిల్లాలో బంధువుల పెద్దకర్మకు వెళ్తుండగా.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం రోజున గద్వాల్​ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. తాజాగా వరంగల్​ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్తే క్షేమంగా తిరిగి వస్తారో లేదోనని ఆ ఇంట్లో వారంతా ఊపిరి బిగపట్టుకుని వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.