ETV Bharat / state

One Year For Vaccination: దేశంలో టీకా ప్రక్రియ మొదలై నేటికి ఏడాది..

author img

By

Published : Jan 16, 2022, 5:30 AM IST

One Year For Vaccination: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను ఎదుర్కొంటూ... దేశంలో టీకా ప్రక్రియ ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో మొదలైన వ్యాక్సినేషన్‌... సంవత్సర కాలంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ... నేడు బూస్టర్‌ డోసు అందించే వరకూ చేరుకుంది.

Vaccination
Vaccination

One Year For Vaccination: 2021 జనవరి 16... ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టినరోజు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ... ఆశాదీపంలా దేశంలో టీకా ప్రక్రియ ప్రారంభమైంది. టీకాపై ఎన్నో అపోహలు, భయాలు నెలకొన్న సమయంలో... విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించడం మొదలుపెట్టారు.

ప్రపంచంలోనే రికార్డ్...

ఎన్నో అనుమానాల నడుమ మొదలైన ప్రక్రియ... ఏడాదిలో ఎన్నో విజయాలను నమోదుచేసింది. వ్యాక్సినేషన్‌ మొదలై నేటికి సంవత్సరం పూర్తవుతున్న వేళ 156 కోట్ల మైలురాయిని అధిగమించింది. అందులో 90కోట్ల మందికిపైగా మొదటి డోసు, 65కోట్ల మందికి పైగా రెండో డోసు... 42లక్షల మందికి ప్రికాషనరీ డోసును అందించి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పింది.

టీకాల కొరత వేధించినా...

తొలుత ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు జనవరి 16, 2021న టీకాలు అందించడం ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులకు మార్చి 1 నుంచి టీకాలు అందించారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ... మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు అందించడం మొదలుపెట్టారు. తొలుత కొంతమేర టీకాల కొరత వేధించినా ఆ తర్వాత... ఆ పరిస్థితిని పూర్తిగా అధిగమించారు. 100 శాతం మొదటి డోసు పూర్తిచేయడమే లక్ష్యంగా... గతేడాది నవంబర్‌లో ఇంటింటికీ తిరిగి టీకా ఇచ్చే ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు.

భారత్‌ బయోటెక్‌ బాలల టీకాకు అనుమతి లభించడంతో ఈనెల 3 నుంచి 15నుంచి 18ఏళ్ల వారికి టీకా ఇవ్వడం మొదలు పెట్టారు. పదో తేదీ నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రికాషనరీ డోసునూ అందిస్తున్నారు.

మహాయజ్ఞంలా...

రాష్ట్రంలోనూ టీకా ప్రక్రియ మహాయజ్ఞంలా సాగుతోంది. ఇప్పటి వరకు 5కోట్ల 2లక్షలకు పైగా డోసులను పంపిణీ చేశారు. అందులో 2కోట్ల 94లక్షలకు పైగా మొదటి డోసు, 2కోట్ల 7లక్షలకు పైగా రెండో డోసు అందించారు. ఐదారు జిల్లాలు మినహా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ మొదటి డోసు 100శాతం పూర్తయింది. ప్రికాషనరీ డోసునూ లక్షా 21వేల మందికి పైగా అందించారు. 15నుంచి 18ఏళ్ల వారు 18లక్షల 41వేల మంది ఉండగా... ఇప్పటికి 8లక్షల 86వేల మందికి టీకాలు అందించారు. ఇదే రీతిన టీకా ప్రక్రియ జోరుగా కొనసాగిస్తామని ఆరోగ్య శాఖ చెబుతోంది.

మొదట్లో భయపడినా...

ఆదిలో టీకా వేసుకునేందుకు జనం కొంత జంకినా... ఇప్పుడు చాలా మేరకు అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. కరోనా వచ్చిన నాటి నుంచి ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటికీ కొంతమంది రెండో డోసుకు వెనకడుగు వేయడంపై ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పక రెండు డోసులు తీసుకోవాలని పిలుపునిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.