ETV Bharat / state

Mini lift irrigation: రైతుల పాలిట వరం.. చిన్న తరహా ఎత్తిపోతల పథకం

author img

By

Published : Feb 27, 2022, 7:43 PM IST

Mini lift irrigation
చిన్న తరహా ఎత్తిపోతల పథకం

Mini lift irrigation: ఎన్నో ఏళ్లుగా బీడు భూములుగా ఉన్న పొలాల్లో ఇప్పుడు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు రైతుల పాలిట వరంగా మారాయి. కృష్ణా జలాల ప్రవాహంతో వనపర్తి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Mini lift irrigation: ఏళ్ల తరబడి నిరాశలో కూరుకుపోయిన వనపర్తి జిల్లా రైతులు ప్రస్తుతం కృష్ణా జలాలు పొలాల్లో ప్రవహించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5.42 కోట్ల వ్యయంతో చేపట్టిన 54 చిన్నతరహా ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో జిల్లాలోని ఏడు మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో 5,260 ఎకరాలు ప్రస్తుతం సాగులోకి వచ్చాయి.

జిల్లాలోని కొల్లాపూర్, పానగల్ మండలాల్లో మినీ లిఫ్టులను ఏర్పాటుచేశారు. వీటితో వేల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. ప్రతీ గ్రామంలో మిట్ట ప్రాంతాల్లోని వందల ఎకరాలకు కాలువల ద్వారా సాగు నీరందించడం సాధ్యంకాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... చిన్న తరహా ఎత్తిపోతలను ఏర్పాటు చేయించారు. సమీపంలోని చెరువులు, కుంటలు, కాలువల్లో మోటార్లను ఏర్పాటు చేసి పైపులైన్ల ద్వారా కుంటలను నింపి పొలాలకు నీరు మళ్లిస్తున్నారు. తద్వారా వేల ఎకరాలకు నీరందుతోంది.

రైతుల పాలిట వరం

భూములు పనికి రావనుకున్న రైతులకు జిల్లాలో చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిర్మించడం వరంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా బీడుగా ఉన్న పొలాలు ప్రస్తుతం ఏడాదికి రెండు పంటలు పడి రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సాగునీటి వనరుల అభివృద్ధితో జిల్లాలో సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా పెరుగుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా కాలువల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు నీరందుతోంది. అవసరమైన చోట్ల కాలువలు తవ్వించి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపారు. ఈ క్రమంలో పలువురు రైతులు తమ పొలాలు ఎత్తు ప్రాంతాల్లో ఉన్నాయని, వాటికి సాగునీటి వసతి కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

వేల ఎకరాలకు సాగునీరు

ఒక్క మండలంలోనే 23 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ వేశారు. జిల్లాలోని పెద్దమందడి మండలలోనే మొత్తం 20 చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 23 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మించి సమీపంలోని కుంటలను నింపడంతో దాదాపు 1800 ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీరందుతోంది. దీంతో ఎప్పుడూ వర్షాధార పంటలపై ఆధారపడే అన్నదాతలు ఇప్పుడు రెండుసార్లు వరి సాగు చేస్తున్నారు.

వనపర్తి జిల్లాలో చిన్న తరహా ఎత్తిపోతల పథకం

'కల్వకుర్తి ఎత్తిపోతలకు అనుసంధానం చేసిన బుద్ధారం కుడికాలువ పెద్దమందడి మండలం మీదుగా ఖిల్లాఘనపురం మండలానికి వెళ్తోంది. కాలువకు అనుసంధానంగా ఉన్న గొలుసుకట్టు కాలువల ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలు కృష్ణా జలాలతో పూర్తిగా జలకళ సంతరించుకున్నాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో మిట్ట ప్రాంతంలోని కుంటలకు నీరు చేరకపోవడంతో దాదాపు 300 ఎకరాల సాగు భూమి ఇంకా నిరూపయోగంగా ఉంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసు కెళ్లాం. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తన సొంత నిధులతో గ్రామంలో అయిదు చిన్నతరహా ఎత్తిపోతలు ఏర్పాటు చేయించారు. దీంతో మల్లారెడ్డికుంట, ఎల్లారెడ్డికుంట, మాసిరెడ్డి కుంటలు నిండాయి. ప్రస్తుతం మెట్ట ప్రాంతంలో ఉన్న 250 ఎకరాల్లో ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నాం.- వనపర్తి జిల్లా రైతులు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.