ETV Bharat / state

ఆ ఇంట్లో ఒకరిగా మారిన ఓ ఉడుత కథ..!

author img

By

Published : Oct 24, 2021, 3:07 PM IST

Updated : Oct 24, 2021, 4:44 PM IST

squirrel as a family member
squirrel as a family member

మీ ఇంట్లో ఎంతమందిఉ న్నారు అనడిగితే నలుగురు అంటారు ఆకుటుంబ సభ్యులు. మరి ముగ్గురే కనిపిస్తున్నారు..? నాలుగో వ్యక్తి ఎవరని అడిగిన వారికి... వారు చూపించిన దానిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. అవును ఆ ఇంట్లో నాలుగో ప్రాణంగా... ఆ ఇంటి అందరికి ఆరోప్రాణంగా మారిందో ఉడుత. వారిలో ఒక్కరిగా కలిసిపోయిన ఆ ఉడుతను చూసిన వారు దాని కథను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..

కొమ్మల మధ్య గెంతుతూ.. ఆకుల నడుమ ఊగుతూ.. రెప్పపాటులో మాయమయ్యే ఉడుతను ఇష్టపడనివారుండరు. చప్పున వినపడగానే.. చప్పున పారిపోయే ఉడుతను పట్టుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఊచ్​ అనగానే తుర్రుమనే ఉడుత ఆ ఇంట్లో ఓ సభ్యురాలిగా కలిసిపోయింది. కొమ్మలమీద గెంతే ఉడుత.. వారి భుజాలపై ఆడుతూ.. చేతులపై తిరుగుతూ ఉంటుంది. కాయలు, ధాన్యాలు తినే ఉడుత.. ఆ ఇంట్లో పాలు, పళ్లు, అన్నము తింటుంది. సహజంగా జంతు ప్రేమికులు కుక్కులను, పిల్లులను, పక్షులను పెంచుతుండడం మనమందరం చూసుంటాం. కానీ సూర్యాపేట జిల్లా జనగామ కూడలి వద్ద ఉంటున్న ఓ కుటుంబం ఉడుతను పెంచుకుంటున్నారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానికి భావిస్తున్నారు.

భుజాలపై గెంతుతూ..
భుజాలపై గెంతుతూ..

ఇంతకీ ఆ ఉడుత ఎలా వచ్చిందంటే..

జనగా సెంటర్లో టీస్టాల్​ నడుపుతున్న దంపతుల కుమారుడు అస్లాం ఏడోతరగతి చదువుతున్నాడు. అస్లాంకు చిన్ననాటి నుంచి జంతువులు, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే ఓ రోజు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా.. ఓ చెట్టుపై నుంచి తీవ్రగాయాలతో కిందపడిన ఉడుతను చూశాడు. కాకుల దాడిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఉడుతపిల్లను చేరదీసి ఇంటికి తీసుకెళ్లాడు.

తీవ్రగాయాలపాలైన ఉడుత పిల్లను బతికించమని తల్లిని కోరాడు. అది బతకదని వదిలేయమని చెప్పినా.. వినలేదు. కుమారుడి బాధను చూసి ఆ ఉడుతపిల్ల గాయాలకు పసుపురాసి.. ఆహారం పెట్టి ప్రాణం నిలబెట్టారు. కొన్ని రోజులకు అది కోలుకుని... ఆ ఇంట్లోనే ఉంటూ వారిలో ఒకరిగా కలిసి పోయింది.

జేబునుంచి పాకుతూ..
జేబునుంచి పాకుతూ..

ప్రత్యేక వసతి...

తమ కుటుంబంలోకి అతిథిగా వచ్చిన ఉడుతకోసం ఆ బాలుడు ప్రత్యేకంగా ఓ పెట్టెను తయారు చేయించాడు. ఆహారం తిన్న తర్వాత అది అందులోనే పడుకుంటుంది. ఆకలి వేసినప్పుడు అరుస్తుంది.. ఆపిల్​, పాలు, అన్నం ఏది పెడితే అది తింటుంది. వారు ఎక్కడికి వెళ్లినా దానిని తీసుకెళ్లకుండా ఉండరు. వారిలో ఒకరిగా మసులుతున్న ఆ ఉడుతను విడిచి వారు ఉండరు.

ఆహారం తినిపిస్తున్న బాలుడు
ఆహారం తినిపిస్తున్న బాలుడు

పొద్దు మొదలయ్యేది దానితోనే..

ఆ ఉడుతను ఆ బాలుడు తలవద్ద పెట్టుకునే పడుకుంటాడు. ఉదయాన్నే లేచిన వెంటనే దానికి ఏమి కావాలో చూసిన తర్వాతే ఆ కుటుంబ సభ్యులు మిగతా పనులు చేసుకుంటారు. ఇంట్లో ఉన్న సమయాల్లో విడిచిపెడతారు.. అది వారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ.. చేతులపై గెంతుతూ.. భుజాల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తుంది.

ఈ పండు అంటే ఉడుతకు ప్రాణం
ఈ పండు అంటే ఉడుతకు ప్రాణం

'మా ఫ్రెండ్స్​తో కలిసి ఆడుకుంటూ ఉండగా ఓ కాకి.. ఉడుత పిల్లను పొడుస్తూ ఉండడం చూశాను. ఆ కాకిని రాయితో కొట్టి తరిమేశాను. గాయపడిన ఉడుత పిల్లను ఇంటికి తీసుకొచ్చి.. పాలు, అన్నం పెట్టాను. అలా మాకు ఉడుత అలవాటైపోయింది. ఆకలైనప్పుడు అరుస్తుంది. పాలు, అన్నం పెట్టగానే తిని పండుకుంటుంది.'

- అస్లాం

'ఈ ఉడుత మా ఇంట్లో మెంబర్​ అయిపోయింది. నోరులేని చిన్న జీవి తమతో కలిసిపోవడం చాలా సంతోషంగా ఉంది.'

- ఖలీమ్​, అస్లాం తండ్రి

'ఆకలేస్తే అరుస్తుంది.. మేం తినే ప్రతీది తింటుంది. ఈ మధ్య ఓ పెళ్లి కోసమని ట్రైన్​లో వెళ్లాం. అక్కడకు ఉడుతనూ తీసుకెళ్లాం. చూసిన వాళ్లు అందరూ ముచ్చటపడ్డారు. సెల్ఫీలు దిగారు. చాలా ఎంజాయ్​ చేశారు.'

- హలీమా, అస్లాం తల్లి

కొమ్మల మధ్యన అప్పుడప్పుడు కనిపించే ఉడుత ఇలా వారి చేతుల మధ్య పెరుగుతుండడం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిని చూసిన వారు దాని వివరాలు అడిగి తెలుసుకోక మానరు.. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దానితో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుంటేనే పట్టించుకోని వారున్న నేటి సమాజంలో ఈ పిల్లాడి సహృదయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఉడుతను అంత దగ్గరగా చూస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇంట్లో ఒకరిగా మారిన ఓ ఉడుత కథ..!

ఇదీ చూడండి: moral stories in telugu: అమ్మలూ మీరు ఇలాగే చేస్తున్నారా.. ఓసారి ఆలోచించండి!

Last Updated :Oct 24, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.