Ponnam Challenge to Harish Rao : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో భూ నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్, సీపీఐ నేతలు సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన నిర్వాసితులను పరామర్శించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే గుడాటిపల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడాలని మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. లేనిపక్షంలో నిర్వాసితులను తీసుకుని హరీశ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి నుంచి మంత్రికి ఏం జరగకుండా తమ కార్యకర్తలు రక్షణ కవచంగా ఉంటారని చెప్పారు. మంత్రి ఆదేశాలతోనే నిర్వాసితులపై లాఠీఛార్జ్ జరిగిందని పొన్నం ఆరోపించారు. దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Ponnam prabhakar visits gudatipally: నిర్వాసితులపై లాఠీఛార్జ్, బలప్రయోగం జరగలేదని సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఐపీఎస్ ఉద్యోగంలో ఉన్న ఆమె విజ్ఞత ఇదేనా అని ప్రశ్నించారు. తెరాస నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు. మంగళవారం రోజున ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చామని.. ఎన్జీటీ కేసు, హైకోర్టు స్టే ఉండగా ట్రయల్ రన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ponnam supports gouravelli oustees : రాజకీయ లబ్ధి కోసమే నిర్వాసితులను బలిపశువులను చేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ రాములు నాయక్, సీఐ రఘుపతి రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇవాళ జరిగే అఖిల పక్షం సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారని.. భేటీ అనంతరం ఆయన గుడాటిపల్లికి వచ్చే అవకాశముందని పొన్నం తెలిపారు.
మరోవైపు కరీంనగ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిర్వాసితులను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. పోలీస్ లాఠీఛార్జ్‌లో గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. వారికి సంఘీభావం ప్రకటిస్తూ.. తెరాస సర్కార్ తీరుపై, సిద్దిపేట జిల్లా పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. గుడాటిపల్లిలో గౌరవెల్లి భూనిర్వాసితుల పోరాటానికి తాము మద్దతిస్తామని చెప్పారు.
సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి భూనిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిర్వాసితులు తేల్చిచెప్పారు.