ETV Bharat / state

BANDI SANJAY: 'ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారు'

author img

By

Published : Jun 28, 2021, 4:00 PM IST

'ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారు'
'ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారు'

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మరోసారి విమర్శలు చేశారు. ఎన్నికలు వస్తే తప్ప సీఎం కేసీఆర్​కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకురారని మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమే చేస్తారంటూ దుయ్యబట్టారు.

'ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారు'

ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్​కు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గుర్తుకు వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. హామీలపై తనకు తానే సమీక్ష చేసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆయన పర్యటించారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కరోనా సమయంలో వందలాది మంది చనిపోయినా.. సీఎం కేసీఆర్​ ఏ ఒక్క రోజూ కొవిడ్​ జాగ్రత్తలపై మాట్లాడలేదని బండి విమర్శించారు. వైరస్​ ఆయనకు సోకే వరకు దాని తీవ్రత ఆయనకు తెలియలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చింది తప్ప... రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ తన సొంత నిధుల నుంచి ఖర్చు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేసినా కమీషన్ల కోసమే చేస్తారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన అవినీతికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో భాజపా తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు.

ఎప్పడూ ఫామ్​హౌజ్​ వదిలి రాని సీఎం ఇప్పుడు బయటకు వస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అధికారం చేపట్టిన ఏడు సంవత్సరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రజలు గుర్తుకొచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గుర్తుకొచ్చారు. వారి సమస్యలు గుర్తుకొచ్చాయి. రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, పోడు సమస్యలపై హామీలన్నీ ఏమయ్యాయి. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తుకువస్తారు. తెరాస ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తాం.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: bandi sanjay: 'పీవీని కాంగ్రెస్‌ అవమానించింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.