ETV Bharat / state

government school: చెట్లకింద చదువులు.. వానొస్తే ఇంటికి పరుగులు..

author img

By

Published : Jul 5, 2022, 4:24 PM IST

ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ పాఠశాల

government school: చినుకు పడిందంటే చాలూ.. బడి నుంచి పరుగులు తీసే ఆ విద్యార్థులకు.. ఇక వానాకాలం గురించి పాఠాలు అక్కర్లేదు. మండే ఎండలో చదువులు సాగించే ఆ పిల్లలకు 'సూర్యోదయం-సూర్యాస్తమయం' అంటూ పేజీలకొద్దీ వివరించాల్సిన పనిలేదు. ఉదయం వచ్చింది మొదలు సాయంత్రం గంట కొట్టే వరకు చెట్ల కిందే చదువులు సాగించే వారికి.. వృక్షాల గొప్పతనం వర్ణించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏసీ రూమ్‌లు, డిజిటల్‌ క్లాస్‌లంటూబయట ప్రైవేటు పాఠశాలలు హడావిడి చేస్తుంటే.. ఇంకా చెట్ల నీడలోనే చదువులు సాగుతున్నాయనటానికి నిదర్శనంగా నిలుస్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వపాఠశాల.

చెట్లకింద చదువులు.. వానొస్తే ఇంటికి పరుగులు..

government school: శిథిలావస్థకు చేరిన తరగతి గదులు.. ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు.. ఎవరిని కాటేస్తాయో తెలియని విషపురుగులు.. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు సాగిస్తున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. శతాబ్ద చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. గతమెంతో ఘనకీర్తి ఉన్నా.. నేడెంతో అపకీర్తి అన్నట్లుగా మారింది.

వందేళ్ల క్రితం నాటి ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది. ఇప్పటికే చాలా వరకు గోడలు కూలిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. కిటికీలు, తలుపులు సైతం లేకపోవటంతో.. తరగతి గదులు చీమలు, పందికొక్కులు, పాములకు నిలయాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో బడిలో చదువులు కొనసాగించలేక ఆవరణలోని చెట్ల కిందే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేసవిలో తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు.. ఇక వర్షాకాలం వచ్చిందంటే చదువును మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో ఈ పాఠశాల మరమ్మతులకు ప్రతిపాదించినా ఇప్పటికి ఎలాంటి అడుగులు పడలేదు. ఫలితంగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పక ఇటువంటి పరిస్థితుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బయట హంగు ఆర్భాటాలతో ప్రైవేటు పాఠశాలలు హడావిడి చేస్తున్న సమయంలో.. ఆ స్థాయిలో డబ్బులు వెచ్చించలేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డల జీవితాలతో చెలగాటమాడకుండా సర్కార్‌ వెంటనే దృష్టి సారించి, బడిని బాగుచేయాలని వారు కోరుతున్నారు.

"ఎండ వస్తే తరగతి గదిలో మేమంతా పక్కకు కూర్చోవాలి. వర్షం పడితే మాకు ఇబ్బందులు తప్పవు. మా పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించాలి." - విద్యార్థులు

"మొత్తం 15తరగతులు ఉన్నాయి. అందులో చాలా వరకు శిధిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వస్తే పిల్లలను ఇంటికి పంపిచాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది విద్యార్థులు బడికి రాలేక వేరే పాఠశాలలో చేరుతున్నారు." -గుండప్ప ప్రధానోపాధ్యాయుడు

ఇదీ చదవండి: damaged roads: ఇందూరు రోడ్ల దుస్థితి.. ఇంతింత కాదయా..!

రాహుల్​ గాంధీపై ఆ వీడియోలు.. టీవీ యాంకర్​ అరెస్టుపై రెండు రాష్ట్రాల వార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.