ETV Bharat / state

ధరణి తెచ్చిన చిక్కులు.. అన్నదాతలకు తప్పని తిప్పలు

author img

By

Published : Feb 20, 2022, 5:10 PM IST

Farmers  problems with Dharani Portal, rythu bandhu problems
ధరణి తెచ్చిన చిక్కులు.. అన్నదాతలకు తప్పని తిప్పలు

Farmers problems with Dharani Portal : ధరణి పోర్టల్​లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ తప్పిదం ఏమీ లేకున్నా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని అంటున్నారు. మీ సేవా కేంద్రాల్లో అన్ని పత్రాలతో దరఖాస్తులు చేసుకున్నా... ఎలాంటి కారణం చూపకుండానే వాటిని తిరస్కరిస్తుండటంతో ఎంత కాలం ఇలా తిరగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Farmers problems with Dharani Portal : ధరణిలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో సంగారెడ్డి జిల్లాలోని రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో అన్ని పత్రాలతో దరఖాస్తులు చేసుకున్నా... ఎలాంటి కారణం చూపకుండానే వాటిని తిరస్కరిస్తుండటంతో కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ అడుగుతున్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను అన్నదాతలు వేడుకుంటున్నారు. కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో భూమిని అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. భూ విస్తీర్ణంలో వ్యత్యాసం, కొందరి పేర్లు తప్పుగా నమోదవడం తదితర కారణాలతో రైతు బంధుకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేడుకుంటున్న రైతులు

సంగారెడ్డి జిల్లాలోని రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ధరణి అందుబాటులోకి వచ్చాక తమ కష్టాలు రెట్టింపు అయ్యాయని కొందరు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం రోడ్లు, ప్రాజెక్టులు కోసం కొంత భూమిని సేకరిస్తే.. ఇప్పుడు ఆ సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భూమిని అమ్ముకోలేక పోతున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.

రైతుబంధు కూడా వస్తలేదు..

ధరణిలో వివరాలు నమోదు చేసే సమయంలో కొందరు రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం పాసు పుస్తకాల్లో నమోదైంది. మరికొందరి పేర్లు తప్పుగా ఉన్నాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూమి అసలు చేర్చనే లేదు. ఈ నేపథ్యంలో రైతుబంధు కూడా అందుకోలేకపోతున్నారు. తమ సమస్య తీర్చాలని మీసేవా కేంద్రాల్లో నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా... ప్రయోజనం లేదని చెబుతున్నారు. కనీసం తమ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారోననే విషయం కూడా అధికారులు చెప్పడం లేదని వాపోతున్నారు.

ప్రజావాణికి తరలివస్తున్న రైతులు

సంగారెడ్డి కలెక్టర్​ హనుమంతరావు.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకూ ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఆయన మీద కూడా పని భారం ఎక్కువైంది.ఈ కారణంగా దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని అధికారవర్గాలు అంటున్నాయి. తహసీల్దార్ల చుట్టూ తిరిగి అలసిపోతున్న రైతులు.. ప్రతి సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించే ప్రజావాణికి బారులు తీరుతున్నారు. ఉన్నతాధికారులైనా తమ గోడు వింటారనే గంపెడాశతో ఇక్కడికి వస్తున్నా... తమకు ఉపశమనం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా భూమి కొంత రోడ్డుకు పోయింది. నాలుగు గుంటల భూమి పోయింది. మాకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే... మొత్తమే తీసేశారు. మాకు రైతుబంధు వస్తలేదు. లోను కూడా వస్తలేదు. ధరణిలో లేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నాం. మీసేవాలో దరఖాస్తు చేస్తున్నా కూడా అవడం లేదు.

-సంగయ్య, బాధిత రైతు

మా అమ్మమ్మ భూమిని వేరేవాళ్ల పేరుమీద తప్పుగా రిజిస్టర్ చేశారు. మేం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. అయితే సాంకేతిక లోపం అంటూ వాళ్ల పేరు మీద నుంచి తీసేశారు. కానీ మా పేరున ఇంకా నమోదు కాలేదు. ఆన్​లైన్​లో కూడా చూపించడం లేదు. రెండేళ్ల నుంచి తిరుగుతున్నాం. మాకు రైతు బంధు కూడా వస్తలేదు. పాస్ బుక్ కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.

-బాధితురాలు మణెమ్మ మనవడు

నా భూమి ధరణిలో ఎకరం 20 గుంటలు నమోదు కాలేదు. కొత్త పాస్ పుస్తకం వచ్చినప్పటి నుంచి అది రికార్డుల్లో లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా పరిష్కారం కాలేదు. రైతు బంధు కూడా వస్తలేదు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నా.

-ఎం. వీరన్న, బాధిత రైతు

మా భూమి 2016 నుంచి మిస్సింగ్​లో ఉంది. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. తహసీల్దార్ కార్యాలయాల నుంచి కలెక్టరేట్​ వరకు తిరుగుతున్నాం. అయినా కూడా మా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

-కృష్ణ, బాధిత రైతు

ధరణి తెచ్చిన చిక్కులు.. అన్నదాతలకు తప్పని తిప్పలు

ఇదీ చదవండి : 'తెలంగాణలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.