ETV Bharat / state

CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'

author img

By

Published : Feb 21, 2022, 4:37 PM IST

Updated : Feb 21, 2022, 5:19 PM IST

CM KCR
CM KCR

16:33 February 21

బంగారు భారత్‌ తయారు చేసుకుందాం: సీఎం కేసీఆర్

'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'

CM KCR National Politics: భారతదేశం బాగుకోసమే తాను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారు భారత్‌ను తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లోనూ ప్రముఖపాత్ర పోషించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారుచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని... విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని సభలో సీఎం స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలని ఆయన కోరారు.

"బంగారు భారత్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారు. విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేసుకుందాం"

-- సీఎం కేసీఆర్

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన..

CM KCR Narayankhed Tour: అంతకుముందు పర్యటనలో భాగంగా నారాయణ్‌ఖేడ్‌ చేరుకున్న సీఎం కేసీఆర్.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం తెరాస ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. గతంలో నారాయణఖేడ్‌ చాలా వెనకబడి ఉండేదని సీఎం గుర్తుచేసుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టారని కొనియాడారు. జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేదన్న సీఎం... ఈ ఎత్తిపోతల ద్వారా నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు.

"తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదు. కేసీఆర్‌ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా.. అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అంధకారం అలుముకుంటుందని అవాస్తవాలు ప్రచారం చేశారు. అప్పడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది. తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి"

-- సీఎం కేసీఆర్‌

ఏడాదిన్నరలోపు ప్రాజెక్టుల పూర్తి...

CM KCR ON PROJECTS: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాలకు నీరందాలని సీఎం ఆకాంక్షించారు. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలని సూచించారు. గజ్వేల్‌ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయన్న ఆయన... ఈ ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌కు 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తానని కూడా భరోసానిచ్చారు. మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు చొప్పున నిధులు ఇస్తామన్నారు.

"సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ. 140 కోట్ల నిధులు మంజూరు చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తాం. నిధులు విడుదల చేస్తూ రేపు జీవోలు జారీ చేస్తాం. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రైతు బంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. రైతులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం"

-- ముఖ్యమంత్రి కేసీఆర్

ఇదీ చూడండి: Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం

Last Updated :Feb 21, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.