ETV Bharat / state

Cyber Yodha On Cyber Crimes: సైబర్‌ యోధ.. ఇకపై మోసాలకు అడ్డుకట్ట..!

author img

By

Published : Jul 20, 2021, 7:22 PM IST

Cyber Yodha On Cyber Crime
సైబర్‌ యోధ

అంతర్జాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ తరగతులు, ఈ కామర్స్‌లో రోజురోజుకు క్రయ విక్రయాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే అవగాహనలేమీ, అత్యాశ వల్ల చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. సైబర్ నేరాలు (cyber crimes) విపరీతంగా పెరిగిపోతుండటంతో వాటిని ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. కేవలం పోలీసు శాఖనే కాకుండా... ప్రజల భాగస్వామ్యంతో సైబర్ నేరాలు తగ్గించడానికి పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే రాచకొండ కమిషనరేట్ పరిధిలో "సైబర్ యోధ" (Cyber Yodha) నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం సాంకేతికత పెరగడం వల్ల దేశంలో సరాసరి ప్రతి కుటుంబానికి మొబైల్‌ ఫోన్‌(mobile phone) అందుబాటులో ఉంది. అందులో సగానికి పైగానే అంతర్జాలం(Internet) వినియోగిస్తున్నారు. ప్రతి విషయాన్ని గూగుల్‌లోనే తెలుసుకోవడం పరిపాటి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా ఈ-కామర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వీటి అవసరంతో అంతర్జాల వినియోగం బాగా విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది నుంచి అంతర్జాల వినియోగదారుల సంఖ్య మరింత ఎక్కువైంది.

కొవిడ్ కారణంగా విద్యార్థులకు సైతం ఆన్‌లైన్ పాఠాలే కొనసాగుతున్నాయి. బయట కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిలో కంప్యూటర్ ముందు కూర్చొని కాలక్షేపం కోసం వీడియోగేమ్‌లు ఆడటం, కొంతమంది యువత అశ్లీల వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి మోసాలకు పాల్పడుతున్నారు. ఏడాదిన్నరగా సైబర్ మోసాల ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఉండి సైబర్ మోసాలు చేసే నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బిహార్‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్ల ముఠాలు ఎక్కువగా బ్యాంకు, బీమా, బహుమతి, ఉద్యోగం, ఓఎల్ఎక్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క నేరగాడిని అక్కడికి వెళ్లి పట్టుకొని వచ్చే లోపు మరో నేరగాడు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి నేరాలను నియంత్రించేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో "సైబర్ యోధ" (Cyber Yodha) కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అవగాహన కల్పించేందుకే 'సైబర్‌ యోధ'

సైబర్ నేరగాళ్లు సైతం సాంకేతికంగా పోలీసుల కంటే ఎంతో ముందుంటున్నారు. పోలీసులు ఆ మోసాలను గుర్తించి తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించే లోపు మరో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అధిగమించడానికే పోలీసులు ఇప్పుడు సమాజంలో సైబర్ మోసాల పట్ల ఉద్ధతంగా అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. కేవలం పోలీసులే కాకుండా... ప్రజల్ని భాగస్వాములను చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 'సైబర్ యోధ' పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమాజంలోని విభిన్న వర్గాల వారిని ఎంపిక చేసి వాళ్లకు సైబర్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

సైబర్‌ యోధకు ఎంపికైన వారికి శిక్షణ

సైబర్ యోధ (Cyber Yodha) కార్యక్రమానికి శిక్షణ కోసం దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌తో తో పాటు సైబర్ నేరాలపై కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా 110 మందిని ఎంపిక చేశారు. వాళ్లలోనూ విభిన్న వర్గాలకు చెందిన వాళ్లున్నారు. కేవలం విద్యార్థులే కాకుండా ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. 21 మంది విద్యార్థులు, 31 మంది ఐటీ ఉద్యోగులు, 6 మంది పదవీ విరమణ పొందిన వాళ్లు, 33 మంది సమాజానికి చెందిన వాళ్లు, ఇద్దరు రక్షణ రంగ ఉద్యోగులున్నారు. ఎంపికైన వారికి 40 గంటల పాటు ఎండ్ నౌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.

సైబర్‌ నేరాల తీరుపై అవగాహన

వీరికి కేవలం సైబర్ నేరాలపైనే కాకుండా... మానసిక నిపుణులు, న్యాయ నిపుణులతోనూ శిక్షణ ఇప్పించారు. సైబర్ నేరాలు జరిగే తీరు, పోలీసులు తీసుకునే చర్యల గురించి సైబర్ యోధలకు వివరించారు. నేరుగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి... ఏ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.. ఎక్కువగా ఏ విధానంలో సైబర్ మోసాలు జరుగుతున్నాయనే విషయాలను వివరించారు. సైబర్‌ క్రైమ్ సెక్షన్లు, నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు ఉపయోగించే సాంకేతిక విధానం గురించి అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకు సైబర్ యోధ సర్టిఫికెట్లు అందించారు. వీరు పాఠశాలలు, కళాశాలలు, కాలనీలకు వెళ్లి సమాజంలో సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించనున్నారు.

రాబోయే రోజుల్లో సైబర్ మోసాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఈ మోసాల బారిన పడకుండా సమాజంలో ఉన్న వాళ్లనే సైబర్ యోధలుగా తీర్చిదిద్ది వారితోనే సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉంది. ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించించేందుకు కృషి చేస్తున్నాం. - మహేశ్‌ భగవత్‌, రాచకొండ సీపీ

ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది. డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాలం వినియోగంతో సైబర్‌ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. అందువల్ల వీటి బారిన పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన అవసరం. సైబర్‌ యోధ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్‌శాఖ చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం.- జయేశ్ రంజన్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి

ఇదీ చూడండి: CP Anjani kumar: జోకర్‌ మాల్‌వేర్‌ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.