ETV Bharat / state

Gulab Cyclone Effect: జిల్లాల్లో గులాబ్​ ఎఫెక్ట్​.. పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు

author img

By

Published : Sep 28, 2021, 5:09 PM IST

Updated : Sep 28, 2021, 9:56 PM IST

Gulab Cyclone Effect in telangana districts
Gulab Cyclone Effect in telangana districts

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నించినవారు కొందరు అందులో పడగా.. కొందరు బయటపడగా.. మరికొందరు గల్లంతయ్యారు.

జిల్లాల్లో గులాబ్​ ఎఫెక్ట్​.. పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు

రాష్ట్రంపై గులాబ్​ తుపాను ప్రభావం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. రహదారులన్నీ జలమయం కావటంతో రాకపోకలు నిలిపేశారు. పలుచోట్ల స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నిజామాబాద్​లో..

నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నిజామాబాద్ నగరంలో లోతట్టు కాలనీల్లోని ఇళ్లు నీటమునిగాయి. బస్టాండ్ రోడ్డు, బోధన్ రోడ్డులో నిజామాబాద్- బోధన్ ప్రధాన రహదారి నీట మునిగింది. ఆర్మూర్ రోడ్డులో కంఠేశ్వర్ రైల్వే కమాన్, మనిక్ భండార్, హైదరాబాద్ రోడ్డులోనూ నీళ్లు రోడ్డుపై చేరాయి. రుద్రూర్-బొప్పాపూర్ వెళ్లే మార్గంలో రోడ్డుపై నుంచి నీరు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపోయాయి. కందకుర్తి వద్ద వంతెనను ఆనుకొని గోదావరి ప్రవహించింది. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల రోడ్డు, సాయిబాబా రోడ్డు, అడ్లూరు రోడ్డు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో భారీ వర్షానికి 10 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కప్పల వాగు ప్రవాహానికి పెద్ద వాల్గోట్​లో వైకుంఠ ధామం నేలకూలింది. బోధన్ మండలం కాజాపూర్​లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ నీట మునిగాయి. నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టులు గేట్స్ తెరవడంతో మంజీర నదిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. లోలేవల్ వంతెన పైనుంచి నీటి ప్రవహిస్తుండటంతో... అధికారులు మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు.

కామారెడ్డిలో...

కామారెడ్డి మండలం లింగాపూర్ చెరువు అలుగు ప్రవాహంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో పాటు కొట్టుకుపోయాడు. మాచారెడ్డి మండలం పరిధ్ పేట చెరువు మత్తడిలో చిక్కుకుపోయిన ఆటోను, ప్రయాణికులను స్థానికులు కాపాడారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని వాగు ప్రవాహంలో సెంట్రింగ్ చెక్కలతో వెళుతున్న వాహనం చిక్కుకోగా... ట్రాక్టర్, తాళ్ల సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. నిజామాబాద్ శివారులోని ఖానాపూర్ రహదారిపై వాగులో స్కూటీతో పాటు పడిపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. కామారెడ్డి శివారులో ముత్తకుంట వద్ద లోలెవల్ వంతెనపై లారీ చిక్కుకుపోయింది. ట్రాక్టర్ సాయంతో బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది.

రాజన్న సిరిసిల్లలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల- కరీంనగర్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద ఉద్ధృతి కొనసాగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బోనాల పెద్ద చెరువు పొంగి పొర్లడంతో... పట్టణంలోని వెంకంపేట, అంబికానగర్, అశోక్ నగర్, సంజీవయ్య నగర్... శాంతి నగర్, అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో... వరద నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షాలతో సమీకృత నూతన కలెక్టరేట్ జలదిగ్బంధమైంది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. నిలిచిన నీటితో కలెక్టరేట్‌లోకి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాక్టర్ ద్వారా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సిబ్బందితో కలిసి ట్రాక్టర్​లో బయటకు రావాల్సి వచ్చింది.

సూర్యాపేటలో...

సూర్యాపేట జిల్లాలో కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో అనంతగిరి-కోదాడ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. చింతలపాలెం మండలం బుగ్గ మాదారం వద్ద లోలెవల్ వంతెన దాటే క్రమంలో లారీ వాగులో ఒకవైపునకు ఒరిగింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. భువనగిరి జిల్లాలోమూసీ నదికి వరద పోటెత్తింది. లోలేవల్ వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకకపోకలు నిలిపివేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో మునుగోడులోని పెద్ద చెరవు అలుగుపారుతోంది.

మెదక్​లో..

మెదక్‌లో భారీ వర్షాలతో గాంధీ నగర్, ద్వారక కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్లు చేరాయి. బృందావన్ కాలనీ చెరువును తలపిస్తోంది. ఎప్పుడు వర్షం పడినా తమ పరిస్థితి ఇంతేనని, నాయకులు పట్టించుకుని తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. హల్దీవాగు రాయిన్ పల్లి ప్రాజెక్టు, పోచారం డ్యామ్ గ్రామాల్లోని పెద్ద చెరువులు అలుగు పారుతున్నాయి. ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో... ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ఆలయ రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

Last Updated :Sep 28, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.