ETV Bharat / state

SRSP Revival Scheme : ఎస్సారెస్పీ పునరుజ్జీవం.. నీటి ఎత్తిపోతలకు సిద్ధం

author img

By

Published : Jul 5, 2023, 10:40 AM IST

Sriramsagar Project
Sriramsagar Project

Sriramsagar Project : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నీటి ఎత్తిపోతలకు సిద్ధమైంది. వర్షాలు లేకపోవడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయింది. వానాకాలం పంటలకు సాగు నీరు అందించడం ఇబ్బందిగా మారింది. సీఎం సూచనతో అధికారులు పునరుజ్జీవన పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమయ్యారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పూర్తయిన తర్వాత తొలిసారిగా నీటిని ఎత్తిపోయనున్నారు.

శ్రీరాంసాగర్​లోకి నీటి ఎత్తిపోతే దిశగా చర్యలు

Godavari water into SRSP by Reverse Pumping : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర ప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫో లేదు. నిల్వ ఉన్నది 20 టీఎంసీలు మాత్రమే. దిగువ మానేరు డ్యాం ఎగువన సుమారు ఆరున్న లక్షల ఎకరాల సాగుకు 50 టీఎంసీలు సాగు నీరు అవసరం. అయితే వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు ఆలస్యమవుతోంది. పోసిన నారుమళ్లు నిత్యం తడుపుతూ, వేసిన నాట్లు ఎండకుండా చూసుకుంటూ అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ సీజన్‌లో రైతులకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేందుకు.. గడువు కూడా ఎంతో దూరంలో లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌లోకి నీటిని ఎత్తిపోయాలని ఆలోచిస్తోంది. దీనివల్ల సాగునీటి ఇక్కట్లు తప్పుతాయని సర్కార్ భావించి.. అందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

మోటార్ల ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు : నీటిపారుదల శాఖ అధికారులు.. సోమవారం ఉదయం గాయత్రి పంపుహౌజ్​ ఒక మోటారును ఆన్ చేసి వరద కాల్వలోకి ఎత్తిపోయడం ప్రారంభించారు. ఈ నీళ్లు రాంపూర్ గ్రామానికి చేరుకున్నాయి. దీని నుంచే నీటి రాక, విద్యుత్‌ సరఫరాను దృష్టిలో ఉంచుకొని మోటార్లను నడపనున్నారు. రాంపూర్ వద్ద పంప్​హౌస్​ నుంచి నీటిని ఎత్తిపోస్తే రాజేశ్వరరావుపేటకు చేరుకుంటాయి. అక్కడి నుంచి ముప్కాల్ వద్దకు గోదావరి జలాలు చేరుతాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్​​ ద్వారా నేరుగా ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయనున్నారు. నాలుగు రోజుల్లో ముప్కాల్ పంపుహౌజ్​ నుంచి శ్రీరాంసాగర్‌లోకి నీరు ఎత్తిపోసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Sriramsagar Project In Nizamabad : ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు కాళేశ్వరం జలాలు దిగువ నుంచి తీసుకొచ్చి ఎత్తిపోసేందుకు పునరుజ్జీవ పథకాన్ని నిర్మించారు. ఎస్సారెస్పీ వరద కాల్వపై మూడు పంపుహౌజ్‌లు నిర్మించారు. వరద కాలువ 73 కిలోమీటర్ల వద్ద రాంపూర్, 34 కిలోమీటర్ల వద్ద రాజేశ్వర్రావు పేట, 0.1 కిలోమీటర్ల వద్ద ముప్కాల్ పంపుహౌజ్‌లు నిర్మించారు. ఒక్కో పంపుహౌజ్​లో 6.5 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు.

వీటిని ఒక రోజు నడిపితే 1 టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించొచ్చు. ప్రస్తుతానికి 0.5 టీఎంసీ మాత్రమే నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది. దీంతో ప్రతి పంపుహౌజ్​ నాలుగేసి మోటారు నడుపనున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను రివర్స్ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలించి సాగుకు నీటిని అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.