ETV Bharat / state

జిల్లాలో విస్తారంగా వర్షాలు.. చరిత్రలో తొలిసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

author img

By

Published : Sep 16, 2020, 4:49 PM IST

heavy rains in narayanapet district
జిల్లాలో విస్తారంగా వర్షాలు.. అలుగులు పోస్తున్న చెరువులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​కు చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి కిందకు 20వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. మక్తల్ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​కు ఏకంగా 20వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో.. చరిత్రలో తొలిసారి ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి కిందకు 20వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న నేరడ్​గోమ్, ఉజ్జెల్లి, వర్కూర్ గ్రామాలకు వెళ్లే దారిలో కల్వర్టుపై నుంచి వరదనీరు పారుతుండటం వల్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక ఉట్కూర్ పెద్ద చెరువు ఉద్ధృత స్థాయిలో అలుగు పారుతుండటం వల్ల.. జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారిపై నుంచి వరదనీరు పారుతుండగా.. రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. ఉట్కూర్ మండలంలోని పెద్దపొర్ల, చిన్న పొర్ల చెరువులు పొంగి, ఊళ్లలోకి వరదనీరు చేరుకుంటున్నాయి. ఉట్కూర్, కొల్లూరు గ్రామాల్లో మట్టిమిద్దెలు కూలిపోయాయి. మాగనూరు మండలం మురార్ దొడ్డి గ్రామంలై సైతం మట్టి ఇళ్లు కూలిపాయాయి. మరోవైపు వర్షాభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులను అలర్ట్ చేశారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు వందలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.