ETV Bharat / state

నకిలీ సంతకాలతో ఇళ్ల పట్టాల విక్రయం..ఓ ప్రజాప్రతినిధి బాగోతం

author img

By

Published : Oct 8, 2020, 11:55 PM IST

Fake House pattas  created by political leader in miryalaguda
నకిలీ సంతకాలతో ఇళ్ల పట్టాల విక్రయం..ఓ ప్రజాప్రతినిధి బాగోతం

ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చి పదేళ్లయినా నిర్మాణాలు చేపట్టక ఖాళీగా ఉన్న స్థలంపై ఓ ప్రజాప్రతినిధి కన్నేశాడు. ఏకంగా మాజీ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించాడు. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ పట్టాలను అమ్ముతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ప్రజాప్రతినిధి బాగోతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో వెలుగుచూసింది.

పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పట్టాలను ఫోర్జరీ సంతకాలతో ఓ ప్రజాప్రతినిధి విక్రయిస్తున్న ఘరానా మోసం వెలుగుచూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో బుడగ జంగాలకు 2010లో ప్రభుత్వం కేటాయించింది. ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో వాటిపై ప్రజాప్రతినిధి కన్నుపడింది. ఏకంగా మాజీ తహాసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి మోసానికి తెరలేపాడు. స్థానిక బుడగజంగాల ప్రజలు ఈటీవీ భారత్​కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బట్టబయలైంది.

భూముల ధరలు పెరగడంతో.....

అవంతిపురంలోని 628 సర్వేనెంబర్​లో 8.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో 243 మంది నిరుపేదలకు 2010లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అదే గ్రామంలో వ్యవసాయ మార్కెట్, మిషన్ భగీరథ శుద్ధి కేంద్రం, గురుకుల పాఠశాల, కళాశాల,బధిర ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో భూముల ధరలు రెక్కలు వచ్చాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన ఓ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో పట్టాలపై ఫోర్జరీ సంతకాలు చేసి పట్టాలు విక్రయించాడు. 2010లో మిర్యాలగూడలో పనిచేసిన తాహసీల్దారు సంతకంతో పట్టాలను రూపొందించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ పట్టాలు పొందిన కొందరు వ్యక్తులు తరచూ అటువైపుగా వెళ్లి స్థలాన్ని పరిశీలిస్తుండటంతో స్థానికంగా వుండే బుడగజంగాల వారికి అనుమానం వచ్చి మీడియాకు సమాచారం అందించారు.

మైనర్​ పేరుతో ఇంటి పట్టా

గతంలో పదేళ్ల వయస్సు ఉన్న బాలిక పేరిట ఇళ్ల పట్టా ఇవ్వడం ఆ ప్రజాప్రతినిధికే సాధ్యమైంది. 2010లో ఇళ్ల పట్టాను కనీస వయసును చూడకుండానే పట్టాలు ఇచ్చారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. దీంతో పాటు వెలుగుచూడని దొంగ పట్టాలు ఎన్ని ఉన్నాయో ఇంకా బయటపడాల్సి ఉంది.

స్థానికుల ఆందోళన:

తమకు న్యాయం చేయాలంటూ బుడగజంగాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఫోర్జరీ సంతకాలతో పట్టాలను అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులను గుర్తించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను చూపిస్తూ భూమి ఇవ్వాలంటూ నిరసన తెలియజేశారు.

మా దృష్టికి రాలేదు: తహాసీల్దార్

"సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు అమ్మకాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదు. ఎవరైనా మోసం చేసి పట్టాలు విక్రయించారని తేలితే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆరు నెలల్లోగా గృహాలు నిర్మించుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ అధికారులకు కేటాయించాం. ఎవరైనా నకిలీ పట్టాలు విక్రయిస్తుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలి."- గణేష్, మిర్యాలగూడ తహసీల్దార్.

ఇదీ చూడండి: 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.