ETV Bharat / state

ప్రాజెక్టు పూర్తి కావస్తోంది.. పరిహారం ఎప్పుడిస్తరు సారూ..

author img

By

Published : Jun 20, 2021, 11:20 AM IST

vattem reservoir, palamuru rangareddy project expatriates
ప్రాజెక్టు పూర్తి కావస్తోంది.. దిక్కుతోచని స్థితిలో నిర్వాసితులు

ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు సేకరించి ఆరేళ్లు గడుస్తోంది. పనులు జోరుగా సాగుతున్నాయి. కానీ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల పునరావాసం చర్యలు మాత్రం... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఇళ్ల స్థలాలు లేవు.. ఉద్యోగాలు లేవు... పునరావాస కేంద్రమూ లేదు. దిక్కుతోచని స్థితిలో... బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇవి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం జలాశయంలో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల కష్టాలు.

ప్రాజెక్టు పూర్తి కావస్తోంది.. దిక్కుతోచని స్థితిలో నిర్వాసితులు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి సాగునీరు అందించాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ సర్కారు... ఆ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదు. పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం వట్టెం వద్ద.. 8 టీఎంసీల సామర్ధ్యంతో జలాశాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ జలాశయం కింద ఆనేఖాన్ పల్లి, అనేఖాన్ పల్లి తండా, కారుకొండ తండా, జీగుట్ట తండా, రాంరెడ్డి పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. 247 ఇళ్లు ముంపులో ఉండగా... 466 కుటుంబాలు నిర్వాసితులవుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వారికి పునరావాసం చూపలేదు. ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు. దీంతో సొంతూళ్లో ఉండలేక, మరోచోటికి వెళ్లిలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆగిన సాగు

వట్టెం జలాశయం పనుల్లో భాగంగా ముంపు గ్రామాల చుట్టూ కట్ట నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ముంపు గ్రామాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమయ్యాయి. రాకపోకలు కష్టంగా మారాయి. వ్యవసాయ భూములు సైతం జలాశయంలోనే కోల్పోవడంతో సాగు ఆగిపోయింది. ఉపాధి కోసం మరోచోటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో దుమ్ము చేరుతోంది. పేలుళ్ల కారణంగా ఇళ్లు కంపిస్తున్నాయి. ముంపు గ్రామాల్లో జీవనం నరక ప్రాయంగా మారింది. అక్కడినుంచి వెళ్లిపోయి వేరేచోట ఉందామంటే... ప్రభుత్వం ఇళ్ల స్థలాలు చూపలేదు. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ అక్కడే వెల్లదీస్తున్నారు నిర్వాసితులు.

ఉద్యోగం, ఇళ్లు ఇస్తామని...

ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపినప్పుడు పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం, రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రజాప్రతినిధులు చెప్పారని.. అవేవీ అమలుకు నోచుకోలేదని నిర్వాసితులు ఆరోపించారు. భూములు, ఇళ్లకు ఏకకాలంలో పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని చెప్పారన్నారు. ప్రాజెక్టు పూర్తి అవుతున్నా పునరావాసం దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాసం కోసం ఇచ్చే పరిహారంలో ఇళ్ల నిర్మాణం కోసమని ఆరున్నర లక్షలు పట్టుకున్నారని, ఇప్పుడు ఇళ్లు తమనే నిర్మించుకోవాలని చెబుతున్నారని కొంతమంది రైతులు చెబుతున్నారు.

వసతులు కల్పించాలి

అంజనగిరి జలాశయానికి అరకిలోమీటరు దూరంలోనే ఓ గుట్ట ప్రాంతంలో 60 ఎకరాల్ని పునరావాస కేంద్రం కోసం సేకరించారు. గుట్టను చదును చేసి అక్కడ నిర్వాసితులకు స్థలాలు కేటాయించాల్సి ఉంది. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీలైనంత త్వరగా పునరావాస కేంద్రంలో మౌలిక వసతులను కల్పించి, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ వెల్లడించారు. టెండర్లు పూర్తవ్వగానే పనులు మొదలవుతాయని తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయడంపై దృష్టిసారించిన తెలంగాణ సర్కారు.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సైతం సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. సర్వం కోల్పోయిన నిర్వాసితుల త్యాగానికి తగిన గౌరవం దక్కాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: ఏపీ డీజీపీ పేరుతో నకిలీ ఖాతా.. దర్యాప్తులో సహకరించని ట్విటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.