ETV Bharat / state

'బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకోవడమే మిగిలి ఉంది'

author img

By

Published : Dec 16, 2022, 6:51 AM IST

Updated : Dec 16, 2022, 9:31 AM IST

'బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకోవడమే మిగిలి ఉంది'
'బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకోవడమే మిగిలి ఉంది'

BJP Public Meeting in Karimnagar : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యాత్ర ముగింపు బహిరంగ సభ.. సింహగర్జన జరిగిన స్థలంలోనే పెట్టి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రను కొనియాడిన పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. యాత్ర కొనసాగించాలని సూచించారు. మరోసారి హైదరాబాద్‌లో బండి సంజయ్‌ పాదయాత్ర చేయనుండగా.. ఐదో విడతలో అందిన వినతిపత్రాల ఆధారంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నారు.

'బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకోవడమే మిగిలి ఉంది'

BJP Public Meeting in Karimnagar : టీఆర్‌ఎస్‌ కాస్తా.. బీఆర్‌ఎస్‌గా మారిందని.. అతి త్వరలోనే ఆ పార్టీకి వీఆర్‌ఎస్‌ తప్పదని.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో గురువారం నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. కరీంనగర్‌ జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు అంజన్న ఆశీర్వాదాలు తనతోపాటు పార్టీకి అందాలని కోరుతున్నానన్నారు. ప్రజా సంగ్రామయాత్రకు మంచి స్పందన లభించిందని, బండి సంజయ్‌ లాంటి మంచి నాయకుడు మీకు దొరికారని ప్రజల్ని ఉద్దేశించి అన్నారు.

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర 1403 కి.మీ. మేర 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 120 రోజుల పాటు కొనసాగిందని.. దీన్ని ఎవరు ఆపాలని చూసినా ఆగదని స్పష్టం చేశారు. తన రాకను కూడా కొందరు అడ్డుకోవాలని చూశారని.. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. అందుకే బీజేపీ ‘సాలుదొర- సెలవు దొర’ అనే నినాదాన్ని అందుకుందని చెప్పారు. మోదీ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుంటే.. కేసీఆర్‌ ఏలుబడిలో అవినీతి, అరాచక, ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్‌ పాలనకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్‌లాగే ఆయన కుమార్తె కూడా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా దర్యాప్తు సంస్థలను ఇంటికి రప్పించుకుని విచారణ జరిపించుకున్నారని.. బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్‌ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

...

తెలుగులో సామెత చెప్పి.. ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందనేలా’ కేసీఆర్‌ వైఖరి ఉందని ఆ సామెతను నడ్డా తెలుగులో చెప్పి.. సభికుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. దళితుడికి సీఎం పదవి, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఏకకాలంలో రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచితవిద్య తదితర హామీలన్నిటినీ కేసీఆర్‌ విస్మరించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఆయన కుమార్తె, కుమారుడు, అల్లుడు తప్ప.. ఎవరూ కనిపించడంలేదన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా పేదల భూములను బీఆర్​ఎస్ నాయకులు లాక్కునే అవకాశాన్ని సీఎం కల్పించారని ఆరోపించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

...

కేంద్ర నిధుల్ని దారి మళ్లిస్తూ.. కేంద్రం ఇచ్చే నిధులన్నిటినీ పేర్లు మార్చి దారి మళ్లిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నడ్డా తప్పుపట్టారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద.. హర్‌ఘర్‌ జల్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి పథకానికి నిధులిస్తే సీఎం ఇక్కడ పేరు మార్చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 1.50 లక్షల వెల్‌నెస్‌ సెంటర్లను అన్ని సౌకర్యాలతో తాము ఏర్పాటు చేస్తే.. ఇక్కడ మాత్రం బస్తీ దవాఖానాల పేరిట నెలకొల్పారన్నారు. ఇదంతా కేసీఆర్‌ నకిలీ వ్యవహారమని ఎద్దేవా చేశారు. అయిదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.104 లక్షల కోట్లతో 4,996 కి.మీ.ల మేర జాతీయ రహదారుల్ని నిర్మించామన్నారు.

...

కాళేశ్వరంపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధం: కాళేశ్వరం ప్రాజెక్టు లొసుగులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సవాలు విసిరారు. వరదల్లో కూరుకుపోయిన కన్నెపల్లి, అన్నారం పంపులకు మరమ్మతులు చేయించలేదన్నారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మొదట్లో బస్సుల్లో ప్రజల్ని తీసుకెళ్లిన సీఎం.. ఇప్పుడు అక్కడికి ఎవరినీ ఎందుకు వెళ్లనివ్వడంలేదో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అటుకులు బుక్కిన కేసీఆర్‌కు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత పోటీ చేయకుంటే.. తనపై నిజామాబాద్‌లో కేసీఆర్‌ పోటీ చేయాలని సవాలు విసిరారు.

మరోసారి హైదరాబాద్‌లో సంజయ్‌ పాదయాత్ర: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర అయిదు విడతలు పూర్తికాగా తదుపరి యాత్ర హైదరాబాద్‌లో చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సంజయ్‌కు పాదయాత్రలో ఇప్పటివరకు 15 వేల పైచిలుకు వినతిపత్రాలు ప్రజల నుంచి అందాయి. వీటన్నిటినీ యాత్ర ఇన్‌ఛార్జి గంగిడి మనోహర్‌రెడ్డి డిజిటలైజేషన్‌ చేయిస్తున్నారు. అధికంగా రెండు పడకగదుల ఇళ్లు, కోల్పోయిన భూములకు పరిహారం, రుణమాఫీ భారం, నిరుద్యోగం వంటి అంశాలపై వినతులు అధికంగా వచ్చినట్లు గుర్తించారు.

నిరుద్యోగం, కాలుష్యం, కార్మికులు, రైతులు, సామాజికవర్గాలు, భూనిర్వాసితులకు అందని నష్టపరిహారం.. ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ప్రభుత్వం నుంచి వారు కోరుకుంటున్న అంశాలను విభజిస్తూ డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ అంశాల ఆధారంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

ఇవీ చదవండి: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారు: బండి సంజయ్

KGFలో మళ్లీ పసిడి వేట.. తెరుచుకోనున్న కోలార్​ గోల్డ్ ఫీల్డ్స్​ తలుపులు!

Last Updated :Dec 16, 2022, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.