ETV Bharat / state

బరువు తగ్గాలనుకుంటున్నారా?... అయితే ఇవి పాటించండి!!

author img

By

Published : Feb 9, 2020, 4:26 PM IST

Want to lose weight? ... but follow these !!
బరువు తగ్గాలనుకుంటున్నారా?... అయితే ఇవి పాటించండి!!

పాతికేళ్ల వయసుకే ఇంత బరువా! కాస్త తగ్గితే మంచిది. పెళ్లికి ముందే ఇంత బొజ్జా.! సిక్స్‌ప్యాక్‌ సాధించకపోయినా కొంచెం తగ్గించుకోవాలి. పాతికేళ్ల వయసుకే భయపెడుతున్న రూపం. పెళ్లిపీటలు ఎక్కేందుకు అడ్డుపడుతున్న ఊబకాయం. వెరసి ఇప్పటి యువత నాజూకుగా కనిపించేందుకు కసరత్తుల బాట పడుతున్నారు. గంటల కొద్దీ వ్యాయామానికి కేటాయిస్తున్నారు. మారిన జీవనశైలితో ముసురుకుంటున్న వ్యాధుల ముప్పు భయం కూడా కసరత్తుల వైపు అడుగులు వేయిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

బరువు తగ్గాలని.. కండలు పెంచాలనే తపనతో అధికశ్రమ.. మితాహారం తీసుకుంటూ నీరసిస్తున్న వారు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఐటీ ఉద్యోగి ఒకరు పొట్ట చుట్టూ కొవ్వు కరిగించుకునేందుకు జిమ్‌లో చేరాడు. అరగంట నుంచి గంటన్నర వరకూ సాధన పెంచాడు. ఒకరోజు కసరత్తు చేస్తూ అకస్మాత్తుగా పడిపోయాడు. నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు నిర్ధారించారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

మాదాపూర్‌లోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతి. ఆరోగ్యసూత్రాలు, వ్యాయామ నియమాలను యాప్‌, యూట్యూబ్‌లో చూస్తూ సాధన చేసింది. స్నేహితురాలి సూచనతో కేవలం పండ్లు, మజ్జిగ తీసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా దాని ప్రభావం మూత్రపిండాలపై పడింది. ఆహారంలో కాల్షియం, పొటాషియం తగ్గడం వల్ల సమస్య తలెత్తినట్టు వైద్యులు పేర్కొన్నారు.

ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

లావుగా ఉండడంతో పక్కవారిలా తానూ అందంగా కనిపించాలనే ఉద్దేశంతో శరీరతత్వానికి విరుద్ధంగా కఠిన నియమాలు పాటిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమస్యను అధిగమించేందుకు వ్యాయామం.. పోషకాహారం రెండింటినీ సమన్వయం చేసుకోవాలని వ్యాయామ శిక్షకుడు మహ్మద్‌ ఆదిల్‌ సూచించారు. బరువు తగ్గేందుకు రోజూవారీ ఆహారంలో కొన్ని నిబంధనలు పాటిస్తూ.. కేలరీలను కరిగించేందుకు అరగంట నుంచి గంటసేపు నచ్చిన అంశం ద్వారా శారీరకశ్రమ చేయాలంటున్నారు.

కొవ్వు కరిగించేదెలా

రోజూ ఐదారు కి.మీ.నడుస్తున్నా.. కిలో బరువైనా తగ్గట్లేదు. నెలనుంచి వ్యాయామం చేస్తున్నా పొట్టవద్ద పేరుకున్న కొవ్వు ఎప్పటిలాగే ఉంది. అధికశాతం మందిలో ఇదే సందేహం. వేగంగా వ్యాయామ సాధన చేయడమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఊపిరితిత్తులు, గుండె చురుగ్గా పనిచేస్తాయి. కేలరీలు అధికమొత్తంలో ఖర్చవుతాయి. ఒంట్లోని కొవ్వు శారీరక శ్రమ చేసిన సమయంలో చెమట, కార్బన్‌డయాక్సైడ్‌, మూత్ర రూపంలో బయటకెళ్లిపోతుంది. చెమట ఎక్కువ పట్టినంత మాత్రాన ఎక్కువ కష్టపడినట్టుగా భావించకూడదు.

తగ్గినా.. పెరిగినా ప్రమాదమే

  1. ఒళ్లు తగ్గేందుకు అధికశాతం వ్యాయామం చేస్తుంటారు. సన్నబడేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తుంటారు. ఉత్సాహం కోల్పోయి కొద్దినెలలకే కసరత్తు మానేస్తుంటారు. అయితే వ్యాయామం చేస్తూ కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, మినరల్స్‌, విటమిన్స్‌ అన్నీ సమపాళ్లలో లభించే ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గి ఉత్సాహంగానూ ఉండగలరు.
  2. బరువుకు తగినట్టుగా ప్రొటీన్‌, కొవ్వులు ఆహారంలో ఉండాలి. కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాలి. ఉదాహరణకు 60 కిలోల బరువు గల వ్యక్తి సాధారణ సమయంలో 48 గ్రాములు తీసుకుంటే.. వ్యాయామం చేసేటపుడు కిలో బరువుకు 1.2 గ్రా.చొప్పున రోజూ 72 గ్రా.ప్రొటీన్‌ తప్పనిసరి. కొవ్వు పదార్థాల విషయంలో 60 కిలోల బరువున్న వ్యక్తి 36 గ్రాములు ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి.
  3. కార్బొహైడ్రేట్లు శక్తినిస్తే ప్రొటీన్లు కండ పటుత్వాన్ని పెంచుతాయి. కొవ్వు శరీరంలోని అంతర్గతభాగాలకు రక్షణగా పనిచేస్తుంది. ఎక్కువ ప్రయోజనం పొందాలని వీటిని ఎక్కువగా తీసుకున్నా, తక్కువైనా ప్రమాదమే.

ఏమేం తీసుకోవాలి

కార్బొహైడ్రేట్లు కేకులు, పప్పులు, బంగాళదుంపలు, అన్నంలో ఉంటాయి. ప్రొటీన్లు చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, సోయాలో లభిస్తాయి.రోజూ సాధారణ వ్యక్తులు ఆహారంలో 4 గ్రా. కొవ్వు పదార్థం తీసుకోవాలి. శరీరంలో సహజంగానే ఏ,డీ,ఈ,కే విటమిన్ల నిల్వలుంటాయి. బి, సి విటమిన్‌లు రోజువారీ ఆహారంలో ఉండాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్స్‌, ఖనిజ లవణాలు సమపాళ్లలో తీసుకుంటూ వ్యాయామం ద్వారా శరీరాన్ని దృఢంగా.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చంటున్నారు వ్యాయామ శిక్షకులు మహ్మద్‌ అదిల్‌.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.